logo

పుష్కరిణి.. భక్తకోటి ప్రణమిల్లి

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం చక్రస్నానం కనులపండువగా జరిగింది. తెల్లవారుజామున మూడు నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు.

Updated : 27 Sep 2023 07:01 IST

చక్రధారుడి చక్రస్నానం
ధ్వజావరోహణంతో  ఉత్సవాలు పరిసమాప్తం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం చక్రస్నానం కనులపండువగా జరిగింది. తెల్లవారుజామున మూడు నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి స్నానం చేయించారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు, కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, జేెఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, సీవీఎస్‌వో నరసింహకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.  

  • శ్రీవారి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించారు. కార్యక్రమంలో జీయంగార్లు పాల్గొన్నారు.

    కమనీయం.. వరసిద్ధుడి కల్యాణం

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిద్ధిబుద్ధిలతో స్వామివారి కల్యాణం మంగళవారం రాత్రి కమనీయంగా జరిగింది. సర్వాలంకృతులైన ఉత్సవమూర్తులను కల్యాణ వేదిక వద్ద రాత్రి కొలువు దీర్చారు. ముందుగా వధూవరులకు కంకణధారణ గావించి, నూతన వస్త్రాలు సమర్పించారు. ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు వీక్షిస్తుండగా స్వామివారు ఉభయ దేవేరుల మెడలో మాంగల్య ధారణ చేశారు. అనంతరం తలంబ్రాలు పోశారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఉత్సవానికి కాణిపాకం, తిరువణంపల్లెకు చెందిన వణిగ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.

అశ్వ వాహనధారియై.. కనువిందు చేసి..: కల్యాణోత్సవం అనంతరం నూతన వధూవరులు అశ్వవాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అలంకార మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అశ్వవాహనంపై ఉంచి ఊరేగించారు. పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు, ఏఈవో ఎస్వీ కృష్ణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.ఉత్సవానికి బొమ్మసముద్రం, తిరువణంపల్లె, చింతమాకుపల్లె, కారకాంపల్లె గ్రామాలకు చెందిన గోనుగుంట బలిజ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు