logo

పనిభారం.. అప్పుల తిప్పలు

చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు జీతాలు, అద్దె సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు జీతాలు సరిపోకపోగా.. మరో వైపు అప్పులు చేసి పిల్లలకు ఆహారం పెడుతున్నారు.

Updated : 27 Sep 2023 06:31 IST

అంగన్‌వాడీ ఉద్యోగుల ఆందోళన

 

చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు జీతాలు, అద్దె సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు జీతాలు సరిపోకపోగా.. మరో వైపు అప్పులు చేసి పిల్లలకు ఆహారం పెడుతున్నారు. గుర్తింపు లేకుండా ఏళ్ల తరబడి పనిచేస్తూ.. హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. సీఎం జగన్‌ వారికి ఇచ్చిన హామీ నెరవేర్చక పోగా.. ఆందోళన చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.

న్యూస్‌టుడే, తిరుపతి(విద్య)

జిల్లా వ్యాప్తంగా 2,492 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు పిల్లలు 64,957 మంది, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు 51,007 మంది ఉన్నారు. వీరిలో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు 36,736 మంది ఉన్నారు. గర్భిణులు 12,560 మంది, బాలింతలు 10,373 ఉండగా.. వీరందరికి అంగన్‌వాడీ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. కష్టపడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.

పెరిగిన పని భారం

పూర్వ ప్రాథమిక విద్య, పోషకాహారం పంపిణీ, టీహెచ్‌ఆర్‌, యాప్‌లు ఇలా తమ పనితో పాటు ఇతర పనుల పనిభారం పెరిగిందని అంగన్‌వాడీ ఉద్యోగులు తెలిపారు. యాప్‌నకు ఇంటర్‌నెట్ సదుపాయం లేకుండా సతమతమవుతున్నామని వాపోతున్నారు. తమకు మించిన పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బందిని గుర్తించడంలేదని అంటున్నారు. కనీస వేతనం రూ.26వేలు, ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్‌ ఇవ్వాలని, గ్రాడ్యుటీని పెంచాలని కోరుతున్నారు.

నెలనెలా జీతాలు రాక..

అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు రూ.11,500, సహాయకులకు రూ.7వేల వేతనం ఇస్తున్నారు. వీటిలో కుటుంబ పోషణ భారంగా మారిందని అంటున్నారు. ప్రతినెలా జీతాలు రాకపోవడంతోపాటు ఉన్న అద్దె భవనాలకు అద్దెలు చెల్లించే పరిస్థితి లేదు. దీంతో భవన యజమానుల నుంచి మాటలు పడాల్సి వస్తోందని అంటున్నారు. ప్రభుత్వం విద్యుత్‌ బకాయిలు సైతం సరిగా చెల్లించడంలేదు. వారి జీతాల నుంచి అద్దెలు, విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. మరో వైపు సమావేశాలంటూ పిలుస్తున్నారు తప్ప.. ఛార్జీలు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని