logo

అధికారం అండగా తవ్వుకో.. దోచుకో

పట్టణంలోని గొడ్డేరు వాగు, కైవల్యనదిలో అక్రమ తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. వెలిగొండల నుంచి ప్రవహించే వీటి పరిధిలో సహజసిద్ధంగా మట్టి, రాళ్లు కొట్టుకువస్తాయి.

Updated : 27 Sep 2023 06:43 IST

అక్రమ తవ్వకాలపై అర్ధరాత్రివేళ వైకాపా, జనసేన నేతల వాగ్వాదం (పాతచిత్రం)

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని గొడ్డేరు వాగు, కైవల్యనదిలో అక్రమ తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. వెలిగొండల నుంచి ప్రవహించే వీటి పరిధిలో సహజసిద్ధంగా మట్టి, రాళ్లు కొట్టుకువస్తాయి. వీటిని ఇళ్ల నిర్మాణం కోసం వినియోగిస్తుంటారు. గతంలో ట్రాక్టర్‌ రూ.150 చొప్పున బరంత్‌ దొరికేది. నాలుగేళ్లుగా స్థానిక నేతల పెత్తనంతో ఏకంగా రూ.500 నుంచి రూ.800 చేరింది. ఇంటి నిర్మాణాలకు మట్టి, ఇసుక, బరంత్‌ అవసరం కావడంతో లబ్ధిదారులు తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. అధికారం అండగా వైకాపాకు చెందిన పలువురు నేతలు ఇసుక, బరంత్‌, చెరువు మట్టి విక్రయాల్లో రాత్రింబవళ్లు మునిగితేలుతున్నారు. ఒక్కోసారి వందలాది ట్రాక్టర్లు పెట్టి బరంత్‌ను తరలిస్తున్నారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు చేయగా కొంతకాలం సద్దుమణిగినా మళ్లీ చెలరేగిపోతున్నారు.. ఈక్రమంలో ఆదివారం అర్ధరాత్రి చింతగుంట సమీపంలోని గోడ్డేరు వాగు నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు పెట్టి బరంత్‌ తరలిస్తుండగా జనసేన నేతలు అడ్డుకున్నారు.. ఈక్రమంలో వైకాపాకు చెందిన నేతలు రంగ్రప్రవేశం చేయడంతో వాగ్వాదం వరకు వెళ్లింది. పోలీసులు, సెబ్‌ అధికారులు వచ్చేవరకు వదిలేది లేదంటూ జనసేన నేతలు అడ్డుకున్నారు..

  • పట్టణ పరిధిలోని పలు చెరువుల్లో అక్రమంగా మట్టి విక్రయాలు చేస్తున్నారు. బొప్పాపురం చెరువు సమీపంలోని అటవీ భూమిలో సైతం తవ్వకాలు సాగిస్తున్నారు. చెవిరెడ్డిపల్లి, మనులాలాపేట సహా పలు చెరువుల్లోని మట్టిని తరలిస్తున్నారు.. ఇటీవల చెవిరెడ్డిపల్లి చెరువులో మట్టిని తవ్వి సమీపంలోని ప్రైవేటు వ్యక్తికి చెందిన భూమిలో తరలించడం వివాదంగా మారింది. ఈ చెరువుకు వచ్చే వరవ కాలువ సమీపంలోని ఖాళీస్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఓచోటా నేత ఆక్రమించే ప్రయత్నాలు చేయగా సదరుశాఖ అధికారులు అప్రమత్తమై అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చెరువును ఆక్రమించుకుని నిర్మాణాలు సాగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

అధికారులు చోద్యం చూస్తున్నారు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనింగ్‌, జలవనరుల శాఖలకు నగదు చెల్లించి చెరువు నుంచి మట్టి తరలించేందుకు అనుమతి పొందా. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు కలిసి అడ్డుకున్నారు. రూపాయి చెల్లించకుండా వైకాపా నేతలు మట్టి, బరంత్‌ అక్రమంగా తవ్వి విక్రయాలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారు.

వెంకటేశ్వర్లు, జనసేన నేత

చర్యలు తీసుకుంటాం

అర్ధరాత్రివేళ జేసీబీలు పెట్టి బరంత్‌, చెరువు మట్టిని తరలిస్తున్నారు.. నిఘా, పోలీసుల సహకారంతో అక్రమ తవ్వకాలను అడ్డుకుంటాం. అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్న వారిపై ఉన్నతాధికారుల సూచనలతో చర్యలు తీసుకుంటాం.

సుబ్బారావు, జలవనరులు శాఖ ఏఈ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని