logo
Updated : 29/11/2021 02:18 IST

కట్టడి లేదు..కట్టుడే !

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, టి.నగర్‌, అమలాపురం పట్టణం, తుని : అది భవనమైనా.. వ్యాపార సముదాయమైనా.. ప్లానుకీ నిర్మాణానికి పొంతన ఉండదు. వాహనాలు నిలపాల్సిన సెల్లార్లలో ఎంచక్కా వ్యాపారాలు.. అడుగడుగునా అతిక్రమణలే.. కొందరి ఉదాసీనత.. లోపాయికారీ తంతు.. రాజకీయ జోక్యం అక్రమానికి ఆజ్యం పోస్తోంది. క్రమబద్ధీకరణ అవకాశం కొందరు అందిపుచ్చుకుంటున్నా.. మరికొందరు అదీ పట్టించుకోవడంలేదు. పదేపదే హెచ్చరిస్తున్నా.. తాఖీదులు జారీచేస్తున్నా.. లెక్కచేయడంలేదు.

ఆదాయానికి గండి..

లెక్కకు మించి అతిక్రమణలు కొందరి జేబులు నింపుతున్నా.. పాలికల ఆదాయానికి మాత్రం భారీగా గండి పడుతోంది.

300 చ.మీ. స్థలంలో జీ ప్లస్‌ 2 నిర్మాణానికి మాత్రమే అనుమతి. పార్కింగ్‌, చుట్టూ ఖాళీ స్థలం, అగ్నిమాపక ఇతర నిబంధనలకు లోబడి ఆ స్థలంలో భవనం కట్టాలి.

వాణిజ్య, 300 చ.మీ. పైబడిన స్థలంలో నిర్మాణానికి పాలిక నుంచి తనఖా ప్లాన్‌ పొందాలి. ఏపీడీపీఎంఎస్‌ అనుమతి తప్పనిసరి. పట్టణ ప్రణాళిక అధికారులు పరిశీలించి.. అన్నీ సవ్యంగా ఉంటేనే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి.

దరఖాస్తుదారు అన్‌లైన్‌లో పొందుపరిచిన అంశాలకు, క్షేత్రంలో నిర్మాణానికి పొంతన ఉండటం లేదు. స్థానిక సిబ్బందికి కొంత సమర్పించి ఇష్టానుసారంగా కట్టేస్తుండడంతో సమస్య వస్తోంది.

అంతా మా ఇష్టం..

అమలాపురంలో శ్రీరామపురం ప్రాంతంలో 20 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవున్న స్థలంలో కేవలం రెండంతస్తుల భవన నిర్మాణానికి ఓ యజమాని అనుమతి పొందారు. అనధికారికంగా సెల్లారు, మరో రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. అయిదో అంతస్తు నిర్మాణానికి సిద్ధమవగా అప్రమత్తమైన పుర అధికారులు సెంట్రింగ్‌ సామగ్రిని పురపాలక కార్యాలయానికి తరలించారు. అయినా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.

లెక్కలేకుంది...

కాకినాడలో అతిక్రమణలు హద్దు మీరాయి. కీలకమైన మెయిన్‌రోడ్డు, ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో వాహనాలు నిలపడానికి నిర్దేశించిన సెల్లార్లను దుకాణాలుగా మార్చి అద్దెలకు ఇచ్చేశారు. దీంతో వివిధ పనులపై వచ్చేవారు రోడ్లపై వాహనాలు నిలిపి ట్రాఫిక్‌ పోలీసుల ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తోంది. పలుచోట్ల ఆక్రమణలు, నిర్మాణాల్లో అతిక్రమణలపై చర్యలకు రాజకీయం అడ్డు తగులుతోంది. ఏకంగా 791 మందికి నోటీసులిచ్చినా.. లెక్కలేకుంది.

రాజమహేంద్రవరం

46 చోట్ల సెల్లార్ల నిబంధనలు, 60 చోట్ల నిర్మాణాలు, ప్లాన్లలో అతిక్రమణలు గుర్తించారు. రాజకీయ ఒత్తిళ్లతో చర్యల ఊసేలేదు.

అమలాపురం

అనుమతి లేకుండా 64 భవనాలు నిర్మిస్తే.. నిబంధనలు అతిక్రమించిన 84 కట్టడాలు పట్టణ ప్రణాళిక విభాగం గుర్తించి నోటీసులు ఇచ్చింది. 12 మందిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. దుడ్డివారి అగ్రహారం, భూపయ్య అగ్రహారం, ఏఎస్‌ఎన్‌ కళాశాల ప్రాంతాల్లో జీ ప్లస్‌2, 3 నిర్మాణాలకు అనుమతి పొంది.. అదనపు అంతస్తులు నిర్మించారు.

మండపేట

ఉల్లంఘనులను గుర్తించి రూ.2.81 కోట్లు అపరాధ రుసుము చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. 104 కేసులు న్యాయస్థానంలో ఉన్నాయి.

తుని

జీఎన్‌టీరోడ్డు, ఫీడర్‌రోడ్డు, పెద్దవీధి, బెల్లపువీధి, బాడవతోట తదితర మార్గాలు, పురపాలక దుకాణ సముదాయం వద్ద అతిక్రమణలతో సెల్లార్లలో ఉండాల్సిన వాహనాలు రోడ్లపై నిలపాల్సివస్తోంది.

తప్పు తేలితే కఠిన చర్యలు

ప్రతి నిర్మాణం ప్రణాళిక, అనుమతుల ప్రకారం చేపట్టాలి. దానిని పర్యవేక్షించాల్సిన బాధ్యత పట్టణ ప్రణాళిక విభాగాలదే. ఈమేరకు వారికి దిశానిర్దేశం చేస్తాం. అడ్డగోలు తేలితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. -రంగనాయకులు, ఆర్డీడీ, పట్టణ ప్రణాళిక విభాగం

రెండు నగర పాలికలు, ఏడు పురపాలక సంఘాల పరిధిలోనే 2,110 అతిక్రమణలు ఉన్నాయి.

Read latest East-godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని