logo
Published : 02/12/2021 06:33 IST

ఆట దివ్యం.. గెలిచిన ఆత్మ విశ్వాసం

క్రికెట్‌లో రాణిస్తున్న జిల్లా దివ్యాంగ యువత


విశాఖపట్నంలో జరిగిన దివ్యాంగుల టోర్నమెంటులో జ్ఞాపిక అందుకుంటున్న జిల్లా జట్టు(పాత చిత్రం)

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం-న్యూస్‌టుడే, ధవళేశ్వరం ‘వైకల్యం దేనికీ అడ్డుకాదు.. అడ్డురాదు.. ప్రయత్నించకపోవడమే పెద్ద వైకల్యం. అవమానాలను అభిమానంగా, కష్టాన్ని ఇష్టంగా, దారిద్య్రాన్ని దీక్ష, పట్టుదలతో జయించినప్పుడు.. విజయం నిన్ను చేరడానికి దారి వేస్తుంది. సమాజం నిన్ను తలెత్తిచూస్తుంది. ఆశ్రుధారలు అమృతంగా మారి నిన్ను అమరుడ్ని చేస్తాయి’.. అంటున్నారీ యువకులు. చెయ్యి, కాలు లేకపోయినా గుండెలనిండా ఆత్మవిశ్వాసం, గెలుస్తాం, నిలుస్తామనే ధైర్యం ఉందని నిరూపిస్తూ జాతీయ, ప్రాంతీయ స్థాయిలో క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు. ఈ నెల 3న విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురి విజయాలపై కథనం.

ఆటపై ఇష్టమే నడిపించింది..

నాన్న నీటిపారుదల శాఖలో చిరుద్యోగి, అమ్మ గృహిణి. చిన్న వయసులో పోలియో జ్వరం వచ్చింది. పేదరికం, అవగాహన లేమితో సరైన వైద్యం అందలేదు. అయిదేళ్లప్పుడు కుడికాలు చచ్చుబడింది. క్రికెట్‌ అంటే ఉన్న ఇష్టం, ప్రేమ నన్ను నిలబెట్టి నడిపించాయి. వీడేం ఆడతాడని హేళన చేసినవారిని ఆటలో ఓడించిన క్షణం జీవితంలో మరువలేనిది. సొంత డబ్బుతో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నా. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో డెంటల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నా.

- పల్నాటి బలరామకృష్ణ(32), కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌, ధవళేశ్వరం

మూమూలు కుర్రాళ్లతో ఆడతా..

మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఎనిమిదేళ్ల వయసులో ప్రమాదవశాత్తు చెయ్యి లిఫ్ట్‌ గ్రిల్స్‌లో పడి నుజ్జయ్యింది. భుజం వరకు తొలగించారు. ఒంటి చేత్తోనే బ్యాటింగ్‌, బౌలింగ్‌, కీపింగ్‌ విభాగాల్లో రాణించా. ఆరేళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నా. దివ్యాంగులతోపాటు మామూలు కుర్రాళ్లతోనూ ఆడుతున్నా. దిల్లీ, గుజరాత్‌, వారణాసి తదితర నగరాల్లో జాతీయస్థాయిలో ఆడా. ప్రస్తుతం చాగలిలో వాలంటీరుగా పనిచేస్తున్నా.- మహ్మద్‌ ఇబ్రహీం ఖలీష్‌(23), ఆల్‌రౌండర్‌, పెద్దాపురం

 

వైకల్యం చిన్నబోయింది..

నాన్న వ్యవసాయ కూలీ. అమ్మ గృహిణి. ఏడో తరగతిలో సైకిల్‌పై వెళుతుంటే రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడమ చేతికి తీవ్రగాయమై తొలగించారు. బాగా చదువుతున్నా.. ఆటలాడలేకపోతున్నాననే బాధపడేవాడిని. చెయ్యి లేనివాడు ఏం ఆడతాడు, టీంని ఎలా గెలిపిస్తాడన్నారు.. సాధనచేసి గెలిచి చూపించా. రాష్ట్ర స్థాయిలో దివ్యాంగుల టోర్నమెంట్లెన్నో ఆడా. పట్టుదల ముందు వైకల్యం చిన్నబోయింది. ప్రస్తుతం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీజీ చేస్తున్నా.- బి.హిమగిరి(26), ఆల్‌రౌండర్‌, అమలాపురం

నీ ఆట చూసేందుకే గ్రౌండ్‌కొచ్చానన్నారు..

అమ్మానాన్న వ్యవసాయ పనులు చేస్తుంటారు. చిన్నప్పుడు మేడపైనుంచి పడిన ప్రమాదంలో గాయపడ్ఢా ఇన్‌ఫెక్షన్‌తో చెయ్యి తొలింగించారు. ఎనిమిదో తరగతిలోనే క్రికెటర్‌ అవ్వాలనుకున్నా. రోజుకు రెండు గంటలు సాధన చేశా. ముంబయి, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నా. నీ ఆట చూసేందుకే గ్రౌండ్‌కు వచ్చానని ఓ వ్యక్తి అనడం ఇప్పటికీ గుర్తుంది. ఎమ్మెస్సీ కంప్యూటర్సు పూర్తి చేశా. -తుపాకుల కిశోర్‌(27), ఆల్‌రౌండర్‌, సీతానగరం

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని