logo
Published : 02/12/2021 06:33 IST

ఓటీఎస్‌కు పొదుపు సొమ్ము


సీతానగరం: రఘుదేవపురంలో ఓటీఎస్‌పై పొదుపు మహిళలకు అవగాహన

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే 1983-2011 సంవత్సరం వరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణ పొంది ఇళ్లను నిర్మించుకున్న వారికి ‘జగనన్న గృహ హక్కు’ పథకం ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించి పత్రాలు ఇవ్వడానికి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నారు. లక్ష్యాలు పూర్తి చేయడానికి డ్వాక్రా సంఘాల పొదుపు సొమ్ముపై కన్నేశారు. ఈ పథకం లబ్ధిదారుల సమ్మతితోనే అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. నిర్బంధంగా ఓటీఎస్‌ సొమ్ము రాబట్టేలా పరోక్ష చర్యలు చేపట్టారు.

లక్ష్యాలతో బెంబేలు
ఓటీఎస్‌ అమలుకు నియోజకవర్గాల స్థాయిలో లక్ష్యాలు నిర్దేశించారు. ప్రతీరోజూ లక్ష్యంలో 10 శాతం సొమ్ము వసూలు చేయాలని ఆదేశించారు. ఒక పక్క లబ్ధిదారులు సొమ్ములు చెల్లించలేమని చెబుతున్నా.. కొన్నిచోట్ల నిర్బంధ వసూళ్లకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది, వీఆర్వోలపై ఒత్తిడి పెంచారు. 

ప్రక్రియ మొదలు
ఓటీఎస్‌ లబ్ధిదారులు, వారి కుటుంబాల్లో డ్వాక్రా మహిళల గుర్తింపునకు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే గృహ నిర్మాణ సంస్థ గ్రామాలు, పట్టణాలకు వేర్వేరుగా జాబితా రూపొందించింది. డీఆర్‌డీఏ పరిధిలో 98,654 మంది అని లెక్కించారు. వీరి ఆధార్‌కార్డుల ఆధారంగా పొదుపు మహిళలను గుర్తిస్తున్నారు. బుధవారం వరకు 40 మండలాల్లో 31,639 మందిని గుర్తించారు.  ఇలా గుర్తించిన వారిలో కొందరితో డ్వాక్రా సంఘాల పొదుపు నుంచి ఓటీఎస్‌కు సొమ్ము జమ చేసే ప్రక్రియ మొదలెట్టారు. మెప్మా పరిధిలో పట్టణాలు, నగరాలు, నగర పంచాయతీల్లో 19,015 మందిని గుర్తించారు. ఈ జాబితాపై సర్వే పూర్తి చేశారు. వీరిలో 4,301 మంది డ్వాక్రా మహిళలు ఉన్నట్లు తేల్చారు. వీరిలో కొంత మందితో ఇప్పటికే ఓటీఎస్‌ సొమ్మును డ్వాక్రా సంఘాల పొదుపు నుంచి చెల్లించే ఏర్పాట్లు చేశారు.

తగ్గేదేలే..
ఓటీఎస్‌ అమలుకు యంత్రాంగం ఎడతెగని కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలలో లబ్ధిదారుల నుంచి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ సొమ్ము కట్టించేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు. ఒకేసారి పల్లెల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.15 వేలు, నగరాల్లో రూ.20 వేలు చొప్పున ఓటీఎస్‌ కింద సొమ్మును చెల్లించాలని ఆదేశాలు రావడంతో అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు.

డ్వాక్రా వారు ఉన్నారా?..
ఒకేసారి ఇంత మొత్తం సొమ్ము కట్టలేమని లబ్ధిదారుల నుంచి విముఖత రావడంతో వీరికి అప్పు ఇప్పించి, వాటిని జమ చేసుకోవడానికి డ్వాక్రా సంఘాలను తెరపైకి తెచ్చారు. ఓటీఎస్‌కు గుర్తించిన లబ్ధిదారుల్లో డ్వాక్రా మహిళ ఉంటే, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డ్వాక్రా సంఘం పొదుపు నుంచి రుణం ఇప్పించి, ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇంట్లో వారైనా సరే..
లబ్ధిదారుల్లో డ్వాక్రా మహిళ లేకపోతే, ఆ కుటుంబంలోని మహిళలు ఎవరైనా డ్వాక్రా సంఘాల్లో ఉంటే వారిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఒకేసారి సొంతంగా ఈ మొత్తం కట్టలేని స్థితిలో ఉన్న వారికి డ్వాక్రా సంఘం పొదుపు నిధి నుంచి జమ చేసుకోనున్నారు. ఈమేరకు డ్వాక్రా సంఘ సభ్యులందరితో రుణం పొందేందుకు సమ్మతి తీసుకుంటున్నారు. రుణం పొందిన సభ్యురాలు వాయిదా పద్ధతుల్లో తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

రుణం ఇప్పిస్తున్నాం..
డ్వాక్రా సంఘాల సభ్యులు ఓటీఎస్‌కు సొమ్ము చెల్లించి, వారి ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు పొందడానికి పొదుపు నుంచి రుణాలు ఇప్పిస్తున్నాం. ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానంతో మహిళలకు వడ్డీ భారం తగ్గుతుంది. ఇప్పటికే ఓటీఎస్‌ లబ్ధిదారుల జాబితాలపై సర్వే నిర్వహించాం. పొదుపు సొమ్ము తక్కువ ఉన్న సంఘాల్లో సభ్యులకు అవసరమైతే బ్యాంకు లింకేజీ రుణాలు కల్పించనున్నాం. ఇప్పటికే చాలాచోట్ల పొదుపు నుంచి ఓటీఎస్‌కు సొమ్ము చెల్లిస్తున్నారు. వాయిదా పద్ధతిలో మళ్లీ అప్పు చెల్లించేలా ఏర్పాట్లు చేశాం, డ్వాక్రా సంఘాల సంఘాల సభ్యులందరి అంగీకారంతోనే పొదుపు సొమ్ము ఓటీఎస్‌కు చెల్లిస్తున్నారు. -కె.శ్రీరమణి, పీడీ, డీఆర్‌డీఏ 

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని