logo
Published : 02/12/2021 06:33 IST

కౌలుకోలేని వేదన!


మట్టిపట్టి.. రంగుమారిన ధాన్యం చూపుతున్న కౌలు రైతు సత్యనారాయణ

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, పి.గన్నవరం, కాకినాడ కలెక్టరేట్‌ నేలతల్లి కడుపు చీల్చుకుని.. పచ్చని పైరు పెరుగుతుంటే.. కంకులు బరువెక్కి నేలకు వందనమని అంటుంటే.. ధాన్యం గింజలు కనకవర్షంలా జలజలా రాలుతుంటే.. రైతుకు కనుల పండగే.. హలధారికి.. నేలతల్లికి ఉన్న పేగు బంధం వరుస విపత్తులతో మసకబారుతోంది. సిరులు కురిపించాల్సిన నేలతల్లి లాలనకు రైతు దూరమవుతున్నాడు.. వానొస్తే వణికు.. గాలివీస్తే బెరుకు.. వరుస విపత్తులతో ముంచెత్తుతున్న వరదలకు వెంటాడుతున్న గుబులు.. ఇదీ రైతుల దయనీయ చిత్రం.. ఏదో ఒక ఏడాది కావీ కష్టాలు.. ఏటా ఎదురవుతున్న దయనీయ చిత్రాలే ఇవి.. అందుకే రైతు కన్నీటి కథకు విరామం లేదు.. వ్యధకు విశ్రాంతీ లేదు.

భార్య పుస్తెలు తాకట్టు పెట్టానయ్యా
కౌలుకు 3.2 ఎకరాలు తీసుకుని వరి పండించా. వానకు మొత్తం మునిగింది. మొలకలు వచ్చి కుళ్లిపోయింది. దమ్ము, పిండి, మందు, కలుపుతీత అన్నింటికీ రూ.1.10 లక్షలు ఖర్చయింది. భార్య పుస్తెల తాడు, పిల్లల చెవి దుద్దులు తాకట్టుపెట్టి.. అప్పుచేసి మరీ పెట్టుబడి పెట్టా. ఎంత తాపత్రయపడినా.. పది బస్తాలు కూడా చేతికొచ్చేలా లేదు.
-శ్రీను, చంద్రంపాలెం, (సామర్లకోట)

పరిహారం అందితే..
జిల్లాలో నాలుగు లక్షల మంది కౌలు రైతులు ఉంటే.. 1.36 లక్షల మంది పంట సాగు హక్కు పత్రాలు (సీసీఆర్‌సీ) పొందారు. 33 శాతం మించి పాడైన పంటకు మాత్రమే పెట్టుబడి రాయితీ వర్తిస్తుంది. ఎకరాకు రూ.6 వేలు చొప్పున చెల్లిస్తారు. సీసీఆర్‌సీ కార్డులు లేని కౌలు రైతులకు ఈ పరిహారమూ దక్కదు. సొమ్ము అసలు రైతు ఖాతాలో పడుతుంది. భూ యజమానులు సహకరిస్తేనే కౌలు రైతుకు ఆసరా దక్కేది.

కౌలు చెల్లింపు కష్టమే
ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి భూములు కౌలుకు తీసుకుంటారు. కొందరు ఎకరాకు 25-27 బస్తాలు.. మరికొందరు రూ.25-30 వేలు కౌలు మొత్తంగా ఇవ్వడానికి ప్రాంతాల వారీగా భూ యజమానితో అంగీకారం కుదుర్చుకుంటారు. లాభనష్టాలతో యజమానికి సంబంధం లేదు. వెరసి విపత్తులతో పంట నష్టపోతున్న వారంతా కౌలు చెల్లించడానికి అవస్థలు పడుతున్నారు. 

పంట పోయి.. అప్పు మిగిలింది
ఆరెకరాలు కౌలుకు తీసుకొని వరి వేశా. రెండున్నర వడ్డీకి.. లక్షన్నర అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టా. యజమానికి ఎకరాకు 25 బస్తాలు ఇవ్వాలి. వారంలో చేతికొచ్చే వేళ మునిగింది. ఏమైనా దక్కుతుందనే ఆశతో ముంపులో వరి కంకులు కోసి నూర్పిడి చేశా. ఎకరాకు 10 బస్తాలు కూడా వచ్చేలా లేదు. పంట పోయి.. అప్పు మిగిలింది. 
-సత్యనారాయణ, పి.గన్నవరం

రబీపైనే ఆశలు
రబీలో బొండాలు సాగు చేయొద్దని, ఉప్పుడు బియ్యాన్ని సీఎంఆర్‌ కింద స్వీకరించమని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.. బొండాలు రకం ధాన్యం ఎకరాకు దిగుబడి సరాసరి 40 బస్తాలు (75 కేజీలు) వస్తుంది. ఈ ధాన్యంతో వచ్చే సొమ్ములే కౌలు రైతులకు ఆసరాగా నిలిచేవి. తాజా నిర్ణయంతో 2021-22 మార్కెటింగ్‌ సీజన్‌ కౌలు రైతుకు అశనిపాతంలా మారింది.

రుణ సాయం అందిస్తే..
రబీ మొదలైంది. ఇప్పటికే ఖరీఫ్‌ అప్పులు కౌలు రైతును వెంటాడుతున్నాయి. రబీలో పెట్టుబడికి దిక్కులు చూస్తున్నారు. సీసీఆర్‌సీ కార్డులున్న రైతులకు మాత్రమే బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందే వీలుంది. కౌలు రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తే ఊరట దక్కుతుంది.

ఖరీఫ్‌ వరి.. గాలివానకు దెబ్బతింది. ఈ ప్రభావం 48 మండలాల్లో 601 గ్రామాలపై పడింది. 1.33 లక్షల మంది నష్టపోయారు. సాగుదారుల్లో 80 శాతం మంది కౌలు రైతులే కావడంతో పరిస్థితి దయనీయంగా మారింది. పంట నష్టానికి రూ.100 కోట్ల పెట్టుబడి రాయితీ వర్తించే వీలున్నా.. కౌలు రైతుకు చేకూరే మేలు ఎంతనేది ప్రశ్నార్థకమే.

ప్రతి కౌలు రైతుకూ పరిహారం
కౌలు రైతులు అధైర్యపడొద్దు. సాగు చేసిన వారికి పంట నష్ట పరిహారం అందిస్తాం. సీసీఆర్‌సీ కార్డులున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాగులో ఉన్న మిగిలిన కౌలు రైతుల పేర్లను పెట్టుబడి రాయితీ జాబితాలో పొందుపరుస్తున్నాం. ఇందుకు భూ యజమానులు సహకరించాలి. 33 శాతం కంటే ఎక్కువ పాడైన పంటకు పెట్టుబడి రాయితీకి ప్రతిపాదిస్తున్నాం. రబీలో బ్యాంకు రుణాలకు చర్యలు తీసుకుంటున్నాం. -విజయకుమార్, జేడీఏ

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని