logo
Published : 05/12/2021 06:26 IST

ఎక్కడున్నారు.. ఎలా ఉన్నారు?

విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా

ఈనాడు - కాకినాడ, -న్యూస్‌టుడే, కోరుకొండ మొన్న బెంగళూరులో రెండు ఒమిక్రాన్‌ కేసులు.. నిన్న హైదరాబాద్‌లో అనుమానిత కేసు... ఇన్నాళ్లూ విదేశాల్లో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఇప్పుడు స్వదేశంలోనూ తారసపడటం గుబులు రేపుతోంది. రాష్ట్రంలో అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదైన తూర్పున తాజా పరిస్థితిపై కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఆరా తీశాయి. దీంతో క్షేత్రస్థాయి పరిస్థితిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు దేశాలను ఒమిక్రాన్‌ ఆవహించడంతో విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి ఆరోగ్య స్థితిపై వైద్యారోగ్యశాఖ ఆరా తీస్తోంది.

44 మందికి నెగిటివ్‌...
నవంబరులో జిల్లాకు విదేశాల నుంచి 682 మంది వస్తే.. ఈనెలలో ఇప్పటికి 80 మంది వచ్చినట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా జాబితాలు జిల్లాకు చేరడంతో.. చిరునామాల ఆధారంగా వారిని గుర్తించి మరోసారి కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. శనివారం నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. డివిజన్ల వారీగా జాబితాలు పంపడంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు 44 మందికి పరీక్షలు నిర్వహిస్తే అన్నీ నెగెటివ్‌గా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.


విమానాశ్రయంలో సిబ్బందికి పరీక్షలు  

పాజిటివ్‌ అని తేలితే..
* విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో పాజిటివ్‌ లక్షణాలు కనిపిస్తే వారి నమూనాలు జినోమ్‌ సీక్వెన్స్‌ కోసం హైదరాబాద్‌ పంపుతారు. అక్కడ ఒమిక్రాన్‌ అని తేలితే ఆంక్షలు, ఇతర చర్యలు ఉంటాయి. ్య రాజమహేంద్రవరం విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలకు సన్నద్ధమైనా.. అప్పటికే ఓసారి పరీక్ష జరిగాకే ప్రయాణికులు వస్తుండడంతో ఆ నిర్ణయం విరమించారు. ఇక్కడ హెల్ప్‌ డెస్క్‌ ద్వారా అనుమానితులు పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.

తేలిగ్గా తీసుకోవద్దు...
జిల్లాలో రెండు దశల ఉద్ధృతి తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలు సాధారణమయ్యాయి. కొత్త వేరియంట్‌ హెచ్చరికలనూ కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారు. తాజా పరిస్థితుల్లో ఈ పరిణామం శ్రేయస్కరం కాదనే వాదన వైద్య నిపుణుల నుంచి వినిపిస్తోంది.
*ఒమిక్రాన్‌ వేరియంట్‌ డెల్టాకు మించి ప్రమాదకరమని.. ఇన్‌ఫెక్షన్‌ రేటు డెల్టా, బీటా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందనే వాదనలు ఉన్నాయి. కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల్ల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో జిల్లా ఉంటే.. మరణాల్లో రెండో స్థానంలో ఉంది. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ముందస్తు చర్యలు..
* జిల్లాలో నిత్యం 4 వేల  కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తుంటే.. 5- 25 వేల మందికి టీకా వేస్తున్నారు.* కాకినాడ జీజీహెచ్‌లో 2,000 పడకలు, రాజమహేంద్రవరంలో 1,300 పడకలు.. ఏరియా ఆసుపత్రుల్లో 50, సామాజిక వైద్యశాలల్లో 20 చొప్పున పడకలతో సేవలు అందించాలనేది ప్రణాళిక. అవసరమైతే... జిల్లా, గ్రామస్థాయి కొవిడ్‌ కేర్‌ సెంటర్లనూ పునరుద్ధరించాలని భావిస్తున్నారు.

పరీక్షలతో స్పష్టత
విదేశాల నుంచి వచ్చిన వారికి మళ్లీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాజిటివ్‌ తేలితే ఆయా నమూనాలు జినోమ్‌ సీక్వెల్‌కు పంపుతాం. ప్రస్తుతానికి పాజిటివ్‌ కేసులు లేవు. 
- గౌరీశ్వరరావు, డీఎంహెచ్‌వో 

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని