logo

ధరల పెరుగుదలపై తెదేపా నిరసన

వైకాపా ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు నిరసనగా తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. మండలంలోని ఇర్రిపాక గ్రామంలో శుక్రవారం ఉదయం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల

Published : 15 Jan 2022 03:06 IST


ప్రత్తిపాడు: భోగిమంటలో ఓటీఎస్‌ ప్రతులు వేస్తున్న వరుపుల రాజా తదితరులు 

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు నిరసనగా తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. మండలంలోని ఇర్రిపాక గ్రామంలో శుక్రవారం ఉదయం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల పట్టికను భోగి మంటల్లో వేశారు. అనంతరం నెహ్రూ మాట్లాడుతూ సామాన్యుడు భరించలేని విధంగా అన్ని రకాల సరకుల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. గ్యాస్, పెట్రోలు, పప్పు దినుసుల ధరలు పెరగడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారని అన్నారు. ఒకవైపు కరోనా ప్రభావంతో పనుల్లేక ఇబ్బంది పడుతుంటే వారిపై ధరల పెరుగుదల మరింత భారాన్ని మోపారన్నారు. పెరిగిన ధరలను తగ్గించి ప్రజలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.
తొండంగి: రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలన, అందుకు అనుగుణంగా విడుదల చేసిన జీవో కాపీలను భోగిమంటల్లో వేసి శుక్రవారం తెదేపా నాయకులు నిరసన తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రతులను భోగిమంటల్లో వేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోడ వెంకటరమణ, రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ, మురాలశెట్టి సత్తిబాబు పాల్గొన్నారు. 
తుని పట్టణం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా శ్రేణులు వివిధ జీవోల ప్రతులు శుక్రవారం భోగిమంటల్లో వేసి తగులబెట్టారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఇలా నిరసన తెలిపారు. 
కోటనందూరు: ప్రజలను ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం విడుదల చేసిన వివిధ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని మండల తెదేపా అధ్యక్షుడు గాడి రాజబాబు డిమాండు చేశారు. బొద్దవరంలో శుక్రవారం వీటికి సంబంధించిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. లెక్కల భాస్కర్, బైలపూడి శ్రీరామమూర్తి, వెంకటరమణ పాల్గొన్నారు.
ప్రత్తిపాడు: ఓటీఎస్‌ పేరిట ప్రభుత్వం అక్రమ వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపిస్తూ తెదేపా శుక్రవారం తెల్లవారుజామున భోగిమంట వద్ద నిరసన తెలిపింది. ఇందుకు సంబంధించిన జీవో ప్రతులను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరుపుల రాజా, నాయకులు కొమ్ముల కన్నబాబు, యాళ్ల జగదీష్, మదినే వెంకన్నదొర, కార్యకర్తలు భోగిమంటలో  వేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని