logo

కోడి కత్తే.. గెలిచింది...

సంక్రాంతి సంప్రదాయం ముసుగులో ఏటా నిర్వహించే కోడిపందేలను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బరులను దున్నేసినా.. కోడి కత్తిని అడ్డుకోలేకపోయారు. హడావుడి చేసిన వారు పత్తాలేకుండా పోవడంతో.. బరిలో నిలిచిన కోడికి

Published : 15 Jan 2022 06:39 IST

ముమ్మిడివరం, కాట్రేనికోన, న్యూస్‌టుడే: సంక్రాంతి సంప్రదాయం ముసుగులో ఏటా నిర్వహించే కోడిపందేలను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బరులను దున్నేసినా.. కోడి కత్తిని అడ్డుకోలేకపోయారు. హడావుడి చేసిన వారు పత్తాలేకుండా పోవడంతో.. బరిలో నిలిచిన కోడికి అడ్డూఆపూ లేకుండా పోయింది. జిల్లాలో శుక్రవారం భోగి రోజు ఉదయం నుంచి కోడి పందేలు ప్రారంభమయ్యాయి. కోనసీమతో పాటు రామచంద్రపురం డివిజన్, మెట్ట ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున వేశారు. ప్రధానంగా కోనసీమలోని కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన బరి చర్చనీయాంశంగా మారింది. కోనసీమ మండలాల్లోని గ్రామాల్లో 40కు పైగా బరుల్లో కోడిపందేలు నిర్వహించారు. వాటికి సమాంతరంగా గుండాట బోర్డులను ఏర్పాటు చేశారు. తొలి రోజు జిల్లాలో కోడిపందేలు, గుండాటల్లో రూ.110 కోట్ల నుంచి రూ.120 కోట్లు వరకు చేతులు మారినట్లు అంచనా.

ఆతిథ్యం అదరహో..
పల్లంకుర్రు బరిలో నిర్వాహకులు ఆతిథ్యం.. అదరహో అన్నట్లుగా చేశారు. పందేలకు హాజరైన వారికి కోనసీమ రుచులు వడ్డించారు.  అరిసెలు, జంతికలు, బూరెలు, పూతరేకులు ఇలా.. వివిధ వంటకాలను గ్యాలరీల్లోని వారికి అందించారు. సుమారు నాలుగు వేల మందికి భోజనాల పొట్లాలను అందించే ఏర్పాట్లు చేశారు. ఇదే మండలం గెద్దనపల్లి బరిలో నిర్వాహకులు బుల్లెట్టు బండి బహుమతిని ప్రకటించారు. ఇక్కడ బరిలో రెండు జట్లు 10 కోడి పందేలు నిర్వహిస్తే.. మెజార్టీ పందేలు గెలిచిన వారికి ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా ఇవ్వనున్నారు.

కిక్కిరిసిన పల్లంకుర్రు
కాట్రేనికోన మండలంలో శివారు ప్రాంతం పల్లంకుర్రు.. సంక్రాంతి సందర్భంగా ఈ ప్రాంతం జనసంచారంతో కిక్కిరిసింది. మూడు రోజుల పాటు ఇక్కడ వాతావరణం తిరునాళ్లను తలపించనుంది. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున పందేలకు రావడంతో.. ఆ ప్రాంతంలో సుమారు 400లకు పైగా కార్లు నిలిపారు. ఇక మోటారు సైకిళ్లయితే లెక్కేలేదు. గేట్‌ పాస్‌లు చూపిన వారికే ప్రవేశం కల్పించారు. ఇక్కడి పెద్దబరిలో జరిగిన పందేల్లోనే ఒక్కో పందేనికి రూ.50 లక్షలు వరకు చేతులు మారినట్లు తెలుస్తోంది. నగదు లెక్కించేంయంత్రాలను పెట్టారు.  పందేల్లో గెలిచిన వారికి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ చేతులమీదుగా వెండి నాణేలు అందించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడు శ్రీకాంత్‌ కోడిపందేలను తిలకించేందుకు వచ్చారు. వర్షం కారణంగా అరగంట పాటు పందేలు నిలిచిపోయాయి. వర్షం వల్ల బరి తడిచిపోకుండా బరకాలు కప్పారు.


కాట్రేనికోన: పల్లంకుర్రు బరి వద్ద కోలాహలం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని