logo

సకుటుంబ సపరివార సంక్రాంతి

నగరాలు, పట్టణాల్లో నిత్యం తీరిక లేకుండా గడిపే జీవితాలకు పండగ గొప్ప ఊరట. పనులన్నీ పక్కనపెట్టి సొంతూళ్లకు రెక్కలు కట్టుకుని వాలిపోవాల్సిందే.. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా.. సంక్రాంతి వచ్చిందంటే పల్లెల్లో ఉండే కళ అంతాఇంతా కాదు..

Published : 15 Jan 2022 03:19 IST


పి.గన్నవరం మండలం రాజులపాలెంలో మండువా లోగిలిలో కుటుంబ సభ్యుల సందడి

వి.ఎల్‌.పురం, కోరుకొండ, పి.గన్నవరం, న్యూస్‌టుడే: నగరాలు, పట్టణాల్లో నిత్యం తీరిక లేకుండా గడిపే జీవితాలకు పండగ గొప్ప ఊరట. పనులన్నీ పక్కనపెట్టి సొంతూళ్లకు రెక్కలు కట్టుకుని వాలిపోవాల్సిందే.. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా.. సంక్రాంతి వచ్చిందంటే పల్లెల్లో ఉండే కళ అంతాఇంతా కాదు.. అందులో పాలుపంచుకోవాలని ఈ ఏడాది కూడా హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు తదితర నగరాల నుంచి జిల్లావాసులు తరలివచ్చారు. సకుటుంబ సపరివార సమేతంగా జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు.

లక్షకు పైగానే..
తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు చిరస్థాయిగా ఉంటున్నాయంటే అది పండగల గొప్పతనమే. ఈ పండగను పురస్కరించుకుని ఆర్టీసీ ఈ నెల 7 నుంచి శుక్రవారం వరకు మొత్తం 251 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది. ఇవికాక తెలంగాణ ఆర్టీసీకి చెందిన 150 బస్సులు ఒక్క హైదరాబాద్‌ నుంచే వచ్చాయి. వీటిలో సొంతూర్లు, బంధువుల ఇళ్లకు వచ్చినవారు 42వేల మంది వరకు ఉంటారనేది అంచనా. ఇక రైళ్లు, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాలు కలిపితే ఆయా ఊర్లకు వచ్చినవారు 1.26 లక్షల మంది ఉంటారని అంచనా.

విమానాలు ఫుల్‌
పండగ వేళ విమాన సర్వీసులు రద్దీగా నడుస్తున్నాయి. . హైదరాబాద్‌కు 6, బెంగళూరుకు రెండు, తిరుపతి, చెన్నై, వైజాగ్‌కు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. పండగతో ఆయా ప్రాంతాలకు టికెట్ల డిమాండ్‌ బాగా పెరిగింది. ఇప్పటివరకు వచ్చే వారి సంఖ్యతో పాటు 16, 17, 18 తేదీల్లో వెళ్లే వారు  ఎక్కువగా ఉండటంతో సర్వీసులు రద్దీగా ఉన్నాయి.

ఆత్మీయతల కలబోత..
కోనసీమకే ప్రత్యేకమైన మండువా లోగిళ్లు పండగను పురస్కరించుకుని కళకళలాడుతున్నాయి. చిన్నారులకు భోగిపళ్లు పోసే వేడుకలు, బొమ్మల కొలువులు, అందరూ కలిసి రంగవల్లులు తీర్చిదిద్దుతూ సందడి చేస్తున్నారు.  బంధువులంతా కొబ్బరి తోటల్లో ఆత్మీయంగా గడిపేందుకు ఉద్యుక్తులవుతున్నారు.

అమెరికా నుంచి వచ్చాం
పదేళ్ల తరువాత కుటుంబంతో సంక్రాంతి పండగ కోసం ఇంటికి వచ్చాం.  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా అమెరికాలోని అట్లాంటాలో పనిచేస్తున్నాం. మా కుటుంబ సభ్యుల మధ్య కుమార్తె ఈషారమణికి భోగిపళ్లు పోయాలనుకున్నాం. అందుకే వచ్చాం.  
- త్సల్లా సుబ్రహ్మణ్యకృష్ణ, నరేంద్రపురం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని