logo

ఆధ్యాత్మిక శోభ.. సంక్రాంతి ప్రభ

కోనసీమలోని పచ్చని చేలు ఆధ్యాత్మికతలో ఓలలాడాయి..సంక్రాంతి పర్వదినాల్లో కనుమ రోజు అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో నిర్వహించిన ప్రభల తీర్థానికి భక్తజనం పోటెత్తారు..అక్కడ కొలువయ్యే ఏకాదశరుద్రులను దర్శించుకునేందుకు ఆదివారం భారీగా తరలివచ్చారు.

Published : 17 Jan 2022 05:07 IST


జగ్గన్నతోటలో ఎగువ కౌశికనది దాటించి భుజాలపై 
యువకులు మోసుకొస్తున్న గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం ప్రభలు 

న్యూస్‌టుడే, అంబాజీపేట కోనసీమలోని పచ్చని చేలు ఆధ్యాత్మికతలో ఓలలాడాయి..సంక్రాంతి పర్వదినాల్లో కనుమ రోజు అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో నిర్వహించిన ప్రభల తీర్థానికి భక్తజనం పోటెత్తారు..అక్కడ కొలువయ్యే ఏకాదశరుద్రులను దర్శించుకునేందుకు ఆదివారం భారీగా తరలివచ్చారు. అందమైన రంగురంగుల నూలుతో నయనానందకరంగా ప్రభలను తీర్చిదిద్ది తీర్థానికి భక్తులు భుజాలపై మోసుకొచ్చారు. ప్రభలకు శిఖర భాగంలో త్రిశూలం, మధ్యభాగంలో మకర తోరణంతో ఉన్న మహారుద్రుడి ఉత్సవ ప్రతిమను కొలువుతీర్చి.. ఒక బల్లపై అమర్చిన ప్రభలను ‘అశ్శరభ..ఆశ్శరభ.. అంటూ శరణుఘోష చేస్తూ తీర్థానికి తీసుకురావటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 
ఆ దృశ్యం నయన మనోహరం..
గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు గ్రామాలకు చెందిన పార్వతీ వీరేశ్వరస్వామి, చెన్నమల్లేశ్వరస్వామి ప్రభలు స్థానికంగా ఉన్న ఎగువ కౌశికనదిని దాటించి తీసుకొచ్చారు. ఈ దృశ్యాలను అప్పటికే తీర్థంలో ఉన్న వేలాది మంది వీక్షించేందుకు పోటీపడ్డారు. నిండు ప్రవాహంతో ఉన్న ఎగువకౌశిక నదిలో దిగినప్పుడు ప్రభలను భుజాలపై మోస్తూ..  శివనామస్మరణ చేస్తూ తీరం దాటించే సన్నివేశం మహాద్భుతంగా ఆవిష్కృతŸమైంది. భక్తులు ఈ అపూరూప దృశ్యాల్ని రెప్ప వాల్చకుండా తిలకించారు.


పప్పులవారిపాలెం డ్యాంసెంటర్‌ వద్ద..

జయజయ  ధ్వానాలతో..
వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి నుంచి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల నుంచి రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి నుంచి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వార్ల రూపాలతో పాటు కముజువారిలంక నుంచి ఉమామహేశ్వరస్వామి వారి ప్రభలను మంగళవాయిద్యాల నడుమ భక్తజనుల జయజయ ధ్వానాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో జగ్గన్నతోట తీర్థానికి తీసుకొచ్చారు.


జగ్గన్నతోటలో భక్త జనం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని