logo

రైతు అపహరణ కేసులో నలుగురి అరెస్టు

అనపర్తి మండలం పొలమూరుకు చెందిన రైతు ద్వారంపూడి కృష్ణారెడ్డిని అపహరించి, రూ.10లక్షలు కాజేసిన కేసును మండపేట రూరల్‌ పోలీసులు ఛేదించినట్లు సోమవారం డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రమేయం ఉన్న అయిదుగురిలో ఒరు ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌. ఈ నెల 5న

Published : 18 Jan 2022 04:20 IST


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ బాలచంద్రారెడ్డి

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి మండలం పొలమూరుకు చెందిన రైతు ద్వారంపూడి కృష్ణారెడ్డిని అపహరించి, రూ.10లక్షలు కాజేసిన కేసును మండపేట రూరల్‌ పోలీసులు ఛేదించినట్లు సోమవారం డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రమేయం ఉన్న అయిదుగురిలో ఒరు ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌. ఈ నెల 5న మండపేట మండలం వేములపల్లిలోని పొలం వద్దనున్న కృష్ణా రెడ్డిని అతని వద్దే పనిచేస్తున్న బక్కే జయరాజుతో పాటు పాక శ్రీను, మండేల ప్రవీణ్‌, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, పాక సతీష్‌ కిడ్నాప్‌ చేసి తుంగపాడు, చక్రధ్వారబందం మీదుగా రంపచోడవరం మండలం సీతపల్లి తీసుకువెళ్లారు. ఆయన బంధువులకు ఫోన్‌ చేసి రూ.10లక్షలు డిమాండ్‌ చేశారు. బుర్రిలంక వద్ద డబ్బు తీసుకుని కృష్ణారెడ్డిని విడిపెట్టారు. జయరాజును అనుమానించి సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా, సీసీ ఫుటేజీ పరిశీలించారు. ఈ నెల 16న జయరాజు, శ్రీను, శ్రీనివాసరెడ్డి వేములపల్లి శివారులో పార్టీ చేసుకుంటుండగా పట్టుకుని విచారించారు. వారి నుంచి రూ.6లక్షలు, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్‌ను అంగరలో అరెస్టు చేశారు. వీరంతా వ్యసనాలకు బానిసలై, చేసిన అప్పులు తీర్చేందుకు కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. ఇందుకు పథక రచనను పోలవరం ప్రాజెక్టులో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పాకా సతీష్‌కుమార్‌ చేసినట్లు తెలిసిందని డీఎస్పీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని