logo

గడువు మార్చినా..ప్చ్

జిల్లాలోని పురపాలక సంఘాల్లో 14వ ఆర్థిక సంఘం నిధులతో తలపెట్టిన పనులు ఒక అడుగు ముందుకి.. మూడు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారాయి. ఈ నిధుల వినియోగానికి సంబంధించి 2019లో గడువు పూర్తయినప్పటికీ.. కరోనా కారణంగా కేంద్రం రెండేళ్లుగా కాల పరిమితిని పొడిగించింది. అప్పటికీ పనులు చేయలేదు.

Published : 18 Jan 2022 04:20 IST

జిల్లాలోని పురపాలక సంఘాల్లో 14వ ఆర్థిక సంఘం నిధులతో తలపెట్టిన పనులు ఒక అడుగు ముందుకి.. మూడు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారాయి. ఈ నిధుల వినియోగానికి సంబంధించి 2019లో గడువు పూర్తయినప్పటికీ.. కరోనా కారణంగా కేంద్రం రెండేళ్లుగా కాల పరిమితిని పొడిగించింది. అప్పటికీ పనులు చేయలేదు. తాజాగా ఈ ఏడాది మార్చి నాటికి గడువు ముగియనుండడంతో అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులు కాస్తా మురిగిపోనున్నాయి.

14వ ఆర్థిక సంఘం నిధులతో ముంపు నివారణ లక్ష్యంగా రాజమహేంద్రవరం తిలక్‌రోడ్డు ప్రాంతంలో చేపట్టిన కాలువ నిర్మాణం కొంత మేర మాత్రమే పూర్తి చేశారు. కాలువ ఆనుకొని చేపట్టాల్సిన రోడ్డు పనులను కూడా నిలిపివేశారు. ఇటీవల వర్షాలకు రోడ్డు బాగా పాడవ్వడంతో తాత్కాలికంగా గుంతలు పూడ్చి సరిపెట్టారు.

నిధుల జాప్యంతో..

కరోనా ప్రభావం కారణంగా కేంద్రం 2018, 2019-20లో ప్రతిపాదించిన పనులకు సంబంధించి నిధులు విడుదల చేయలేదు. అంతకు ముందు జరిగిన వాటికి కూడా కేవలం 10 నుంచి 20 శాతం మాత్రమే విడుదలయ్యాయి. దీంతో గుత్తేదారులు మధ్యలో పనులు నిలిపివేశారు. కొన్నిచోట్ల ప్రారంభించి కొంత మేర చేసిన పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. మున్సిపల్‌ యంత్రాంగం సైతం గుత్తేదారులపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లు మారాయి. మార్చి నాటికి గడువు ముగియనుండడంతో కొన్ని పురపాలక సంఘాల్లో వాటిని సాధారణ నిధుల నుంచి వాటిని పూర్తిచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కరోనా ప్రభావంతో..

కరోనా కారణంగా 14వ ఆర్థిక సంఘం నిధులతో తలపెట్టిన పనులకు ఆటంకం కలిగింది. వాస్తవానికి 2015-16 నుంచి విడతల వారీగా నిధులు విడుదలయ్యాయి. లాక్‌డౌన్‌ అనంతరం రెండేళ్లు పనులు నిలిచిపోయాయి. తరువాత కేంద్రం మరో ఏడాది పాటు గడువు పొడిగించింది. 2019-20 నాటికి పూర్తి కావాల్సి ఉండగా 2020-21 వరకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.

నత్తనడకన..

14వ ఆర్థిక సంఘం నిధులను జిల్లాలోని పురపాలక సంఘాల్లో ప్రధానంగా తాగునీటి సౌకర్యం, డ్రైనేజీలు, రోడ్ల విస్తరణకు ఎక్కువగా కేటాయించారు. ఈ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అసౌకర్యానికి గురవు తున్నారు.

రాజమహేంద్రవరంలోని ఆవ నుంచి జాతీయ రహదారిని కలిపేలా వంద అడుగుల రోడ్డు నిర్మాణం తలపెట్టారు. పనులు మధ్యలో నిలిచిపోయాయి. కాలువను కొంత దూరం మాత్రమే వేసి వదిలివేయడంతో మురుగు నీరు ఖాళీ స్థలాల్లోకి వదిలేస్తున్నారు.సాధారణ నిధులతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

ఆటంకం ఉండదు

14వ ఆర్థిక సంఘం నిధుల జాప్యం ప్రభావం అభివృద్ధి పనులపై పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర పనులకు సాధారణ నిధుల నుంచి కేటాయించాల్సిందిగా ఆదేశించాం. దీంతో పనులు నిలిచిపోయే ఆస్కారం ఉండదు. - సత్యనారాయణ, మున్సిపల్‌ ఆర్డీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని