logo

మట్టి గుట్టా నాదే..

కొన్నేళ్లుగా చెట్టుకొకరు పుట్టకొకరుగా మట్టి తవ్వుకుంటున్నారు. ఎవరికివారు లాభపడుతుండేవారు. ఈ మట్టి రుచి మరిగిన ఓ నాయకుడు జిల్లాలో అన్నిచోట్లా నేనే మట్టి తవ్వుతాను.. ఇంకెవ్వరూ క్వారీల జోలికి వెళ్లొద్దని హుకుం జారీచేశాడు. చిన్నాచితకా అంతా.. పరపతి ఉన్న ఆ నాయకుడి హెచ్చరికలకు బెదిరి

Published : 18 Jan 2022 04:20 IST


గండేపల్లి మండలంలోని రామేశ్వరం మెట్టలో అనధికారిక మట్టి తవ్వకాలు

ఈనాడు, కాకినాడ: కొన్నేళ్లుగా చెట్టుకొకరు పుట్టకొకరుగా మట్టి తవ్వుకుంటున్నారు. ఎవరికివారు లాభపడుతుండేవారు. ఈ మట్టి రుచి మరిగిన ఓ నాయకుడు జిల్లాలో అన్నిచోట్లా నేనే మట్టి తవ్వుతాను.. ఇంకెవ్వరూ క్వారీల జోలికి వెళ్లొద్దని హుకుం జారీచేశాడు. చిన్నాచితకా అంతా.. పరపతి ఉన్న ఆ నాయకుడి హెచ్చరికలకు బెదిరి ఎదురుచెప్పలేక తవ్వకాలు ఆపేశారు. కానీ ఓ రెండు నియోజకవర్గాల్లో మాత్రం ఆ నాయకుడికి ప్రతిఘటన ఎదురైంది. మా ప్రాంతంలో నీ పెత్తనం ఏంటని ఎదురుతిరిగారు. దీంతో కొద్ది రోజులుగా జిల్లాలో మట్టి రచ్చ సాగుతోంది. పలు దఫాలు చర్చలు జరిపినా.. వ్యవహారం కొలిక్కిరాలేదు. ఈలోగా ఒకరిపై ఒకరు నిఘా వర్గాలకు ఉప్పందించుకోవడంతో తనిఖీలూ షురూ అయ్యాయి. దీంతో క్వారీలన్నీ తాత్కాలికంగా మూతపడ్డాయి. పదిహేను రోజులుగా చాపకింద నీరులా సాగుతున్న ఈ మట్టి వివాదం చర్చనీయాంశమైంది.

కప్పం కట్టాల్సిందే..

గండేపల్లి మండలానికి చెందిన ఓ నాయకుడు అక్రమ క్వారీల వద్ద ఇటీవల పాగా వేశాడు. తాను ఈ ప్రాంత నాయకుడినని.. అక్రమంగా మట్టి తవ్వుతున్నందుకు తలో కొంత చెల్లించాలన్నాడు. ఈ విషయం జిల్లావ్యాప్తంగా మట్టి తవ్వకాలపై కన్నేసిన ఆ బడా నాయకుడి దృష్టికి వెళ్లడంతో.. ఆ చోటా నాయకుడిని గట్టిగా హెచ్చరించడంతో వెనక్కితగ్గినట్లు సమాచారం.

పేదల ఇళ్ల స్థలాల్లో పునాదులు మధ్య నింపడానికి కొందరు దొడ్డిదారిన తవ్విన మట్టి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన లేఔట్‌ మెరక పనుల్లో పరపతి ఉన్న కొందరు నాయకులు వేలుపెట్టారు. ఈ పరిస్థితి లోపాలకు తావిస్తోంది. సామాజిక తనిఖీలు సమర్థంగా జరిగితే ఈ లోపాలపై స్పష్టత వచ్చే వీలుంది.

ఎవరి వాటా వారికి..

ఎర్రమట్టి నిల్వలు ఉన్న భూములను కొందరు నాయకులు కొనుగోలు చేస్తే.. మరికొందరు లీజుకు తీసుకున్నారు. నాయకుల క్వారీలకు ఎలాంటి సుంకం లేకపోయినా.. చిన్నాచితకా మట్టి మాఫియా మాత్రం మట్టి తవ్వుతున్నందుకు అది ప్రైవేటు, డి- పట్టా భూమైనా ఎకరాకు ఆ భూమి యజమానికి రూ.15 లక్షలు.. ఆ ప్రాంత నాయకుడికి రూ.3 లక్షలు చొప్పున కప్పం కట్టాల్సిందే.

కోనసీమలోని లంక భూముల్లో ఇటీవల మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు ఊపందుకున్నాయి. మామిడికుదురు, అయినవిల్లి, అల్లవరం, కొత్తపేట, రావులపాలెం, కపిలేశ్వరపురం తదితర మండలాల్లో అడ్డుకునే పరిస్థితిలేదు.

పి..గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలేన్ని ఆనుకుని ఉన్న ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు లంక భూముల్లో ఇటీవల విజిలెన్స్‌ బృందాలు తనిఖీచేసి కేసు నమోదుచేశారు. తవ్వకాలకు అనుమతులు లేనట్లు తేల్చాయి.

500 ఎకరాలకు పైగానే..

జిల్లాలో భారీగా మట్టి అక్రమ తవ్వకాలకు పెద్దాపురం - గండేపల్లి మండలాల పరిధిలోని రామేశ్వరం మెట్ట వేదికయింది. 500 ఎకరాలకు పైనే ఇక్కడ మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. అనధికారిక క్వారీలు 10 నడుస్తున్నాయి. ఇవికాక జిల్లాలో జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు, రాజానగరం, రంగంపేట తదితర మండలాల్లో 30కి పైనే అనధికారిక క్వారీలు నడుస్తున్నాయి. వీటిలో సింహభాగం రాజకీయ దన్నుతో నడుస్తున్నవే.. అధికారిక చిట్టాకు.. క్షేత్రస్థాయి పరిస్థితికి పొంతన లేదు. తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నా.. భూగర్భ గనులశాఖతో పాటు స్థానికంగా ఉండే రెవెన్యూ, ఇతర అధికారులు కన్నెత్తి చూడడంలేదు. ఈ క్వారీలు కాసులు కురిపిస్తుండటంతో జిల్లాలో పలు ప్రాంతాల మెట్టలు, కొండలు, పోలవరం కాలువ గట్లు.. దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.

చక్రం తిప్పేస్తున్నారు..

జిల్లాలో పేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన ఇళ్లస్థలాల్లో ఉపాధి నిధులతో మెరక పనులు జరగుతున్నాయి. కొన్నిచోట్ల ఈ పనులకు మట్టి కొరత ఎదురవుతోంది. అవే ప్రాంతాల్లోని ప్రైవేటు లేఔట్లకు మాత్రం పుష్కలంగా మట్టి దొరుకుతుండడం గమనార్హం.

మట్టి నిల్వలపై కన్నేసిన కొందరు నాయకులు ఆయా ప్రాంతాల్లోని భూములను రైతుల నుంచి కొంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే లోతుగా తవ్వకాలకు తెగబడుతున్నారు. జిరాయితీ, పట్టా భూములు చేతులు మారడంతో ఈ తరహా వ్యవహారాలు ఇటీవల ఎక్కువయ్యాయి.


హవ్వ..కాలువనూ వదల్లే.. 

మట్టి తవ్వకాల్లో తొలగించిన డ్రాప్‌లు

జగ్గంపేట గ్రామీణం: మట్టి మాఫియా ఆగడాలకు ఓ చోట ఏకంగా పుష్కర కాలువ మాయమైపోయింది.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు అధికారులు ఎవరు తవ్వారని ఆరాలు తీస్తున్నారు. జగ్గంపేట మండలం రామవరంలో సర్వే నం.108 మీదుగా వెళుతున్న పుష్కర కాలువ నామరూపాలు లేకుండా మారింది. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పుష్కర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీనికోసం రైతుల నుంచి భూములు సేకరించి వారికి పరిహారం సైతం చెల్లించారు. అన్ని ప్రాంతాలకూ నీరు పారేలా ప్రధాన, పిల్లకాలువలు తవ్వారు. కాలువ ఎత్తుగా ఉన్న చోట అవసరమైన చెెక్‌డ్యాంలు నిర్మించారు. కాలువల తవ్వకాలు డ్రాప్‌లు, స్లూయిస్‌లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేశారు. తాజాగా ఆ ప్రాంతంలో ఉన్న కొండ నుంచి మట్టిని తరలించే క్రమంలో పుష్కర కాలువ నిర్మాణాలను సైతం పెకిలించేశారు. దీంతో రామవరం, మర్రిపాక, కిర్లంపూడి మండలంలోని బూరుగుపూడి గ్రామాల రైతులకు సమస్యలు తప్పవు. దీనిపై పుష్కర డీఈ ఎం.వి.వి.కిశోర్‌ను సంప్రదించగా 108, 124 సర్వే నంబర్లలో సుమారు 300 మీటర్ల మేర కాలువ, దానిపై నిర్మించిన డ్రాప్‌లు, స్లూయిస్‌లు తొలగించినట్లు గుర్తించామన్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని