logo

ఫలితాల్లో జాప్యం... బాధితుల్లో కలవరం

కొవిడ్‌ జోరు పెరిగినా ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేయక పోవడం.. ఫలితాల్లో తీవ్ర జాప్యంతో బాధితులకు కంటి మీద కునుకు కరవైంది. రూ.వెయ్యికి పైగా వెచ్చించి ప్రైవేట్‌గాపరీక్షలు చేయించాల్సి వస్తోందని వాపోతున్నారు. స్థోమత లేని వారు..

Published : 22 Jan 2022 05:23 IST


రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో నిరీక్షణ

కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో ఈనెల 18న పరీక్ష చేయించుకున్నా. నాలుగు రోజులు దాటినా ఫలితం రాలేదు. ఈలోపు ఓ వైద్యుడిని సంప్రదించి.. ఆయన సూచన మేరకు మందులు వాడా. శుక్రవారం ప్రైవేట్‌ ల్యాబ్‌లో ర్యాపిడ్‌ పరీక్ష చేయిస్తే పాజిటివ్‌గా తేలింది. - మణికంఠ,రాజమహేంద్రవరం

అమలాపురం ఆసుపత్రిలో ఈనెల 19న పరీక్ష చేయించా. ఇప్పటికీ ఫలితం రాలేదు. ముందుగానే మందులు వాడుతూ హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నా. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నా. బయట ల్యాబ్‌ల్లో పరీక్ష చేయించాలంటే అధిక మొత్తంలో డబ్బులు అడుగుతున్నారు. స్థోమత లేక చేయించుకోలేదు. అధికారులు స్పందించి ఫలితాలు త్వరగా వచ్చేలా చొరవ చూపాలి. - నరేష్‌, అమలాపురం - మసీదుసెంటర్‌ (కాకినాడ), రాజమహేంద్రవరం వైద్యం

కొవిడ్‌ జోరు పెరిగినా ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేయక పోవడం.. ఫలితాల్లో తీవ్ర జాప్యంతో బాధితులకు కంటి మీద కునుకు కరవైంది. రూ.వెయ్యికి పైగా వెచ్చించి ప్రైవేట్‌గాపరీక్షలు చేయించాల్సి వస్తోందని వాపోతున్నారు. స్థోమత లేని వారు.. అలాగే ఉండిపోవడంతో ఆరోగ్యం క్షీణించి.. వైరస్‌ వ్యాప్తి కారకులుగా మారుతున్నారు. జిల్లాలో కేవలం కొన్ని ఆసుపత్రుల్లోనే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తుండటం.. సేకరించిన నమూనాలను కాకినాడకు తేవడంలో జాప్యం...ఫలితాల వెల్లడిలో ఆలస్యంతో కలవరం నెలకొంది.

ఎందుకిలా:రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రుల్లో నిరుడు సెప్టెంబరులో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. కానీ వాటిని నేటికీ ప్రారంభించలేదు. ఆరోగ్య కేంద్రాల్లో మొదటి దశలో ర్యాపిడ్‌ యాంటిజన్‌, ట్రూనాట్‌ కిట్లతో కొవిడ్‌ పరీక్షలు చేసేవారు. ప్రస్తుతం ఆ పద్ధతి లేకపోవడమూ ఫలితాల జాప్యానికి కారణమే.●

కిట్లు తరలించరే: రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో సేకరించిన కొవిడ్‌ నమూనాలను రెండు రోజులకు ఒకసారి కాకినాడ పంపిస్తున్నారు. ● ఇటీవల రోజూ నమూనాలను తీసుకెళ్లే వాహనానికి పెట్రోలు బిల్లు చెల్లించకపోవడంతో నాలుగు రోజుల తర్వాత తీసుకెళ్లారు. ● ఇదే ఆసుపత్రిలో కొవిడ్‌ పరీక్షల కోసం ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లనే కేటాయించడంతో నమూనాల సేకరణ నత్తనడకన సాగుతోంది. రోజుకు 150-180 మంది నమూనాలు సేకరించి.. మిగిలిన వారిని మరుసటి రోజు రమ్మని టోకెన్లు ఇస్తున్నారు. ● అమలాపురం, తుని, రంపచోడవరంలోనూ ఇదే తీరు. దూర ప్రాంతాల నుంచి రవాణా ఇక్కట్లు, సమయానుకూలంగా స్పందన లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

కాకినాడలో ఇలాగండి...

కాకినాడ జీజీహెచ్‌లో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లో పరీక్ష ఫలితాలు వెంటనే వస్తున్నా.. జిల్లా మొత్తానికి ఇదొక్కటే పరీక్షా కేంద్రం కావడం.. బాధితులు అధికంగా రావడంతో పరీక్ష కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక్కడ కేవలం రోజుకు నాలుగు వేల నమూనాల ఫలితాలు మాత్రమే తేల్చగలరు. రాజమహేంద్రవరం, అమలాపురంలో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు ప్రారంభిస్తే జీజీహెచ్‌ ల్యాబ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. జిల్లాలో ఎక్కడా కిట్ల కొరత లేకపోయినా పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతున్నాయి

రెండు, మూడురోజుల్లో చక్కదిద్దుతాం

జిల్లా మొత్తానికి కాకినాడలో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ ఒక్కటే ఉంది. దూరప్రాంతాల నుంచి నమూనాలు జీజీహెచ్‌కు తరలించడంలో ఆలస్యం అవుతోంది. దీంతో ఒకరోజులో రావాల్సిన ఫలితం రెండు రోజుల్లో వస్తోంది. దీనిని అధిగమించేలా రెండు, మూడు రోజుల్లో రాజమహేంద్రవరం, అమలాపురం ఆసుపత్రుల్లో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లను అందుబాటులోకి తేనున్నాం. దాంతో సమస్య పరిష్కారం అవుతుంది. -డా.బి.మీనాక్షి, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో

అమలాపురంలో ప్రారంభానికి నోచని ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని