logo

ఎక్కడెక్కడి దొంగలూ..ఇక్కడే!

మన్యంలో గంజాయి గుప్పుమంటోంది. అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఈ దందాలో కీలక భూమిక ఇతర రాష్ట్రాల వారిదే.. గిరిజనుల అవసరాలు ఆసరాగా చేసుకుని.. సాగు నుంచి సంరక్షణ వరకు అక్రమ వనాలకు మదుపు పెడుతున్న మాఫియా.. పంట చేతికొచ్చాక..

Published : 22 Jan 2022 06:31 IST

రూ.కోట్లు కొల్లగొడుతున్న గంజాయి మాఫియా

అడ్డదారుల్లో 15 రాష్ట్రాలకు తరలింపు

ఈనాడు, కాకినాడ

జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్న నిల్వలు

మన్యంలో గంజాయి గుప్పుమంటోంది. అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఈ దందాలో కీలక భూమిక ఇతర రాష్ట్రాల వారిదే.. గిరిజనుల అవసరాలు ఆసరాగా చేసుకుని.. సాగు నుంచి సంరక్షణ వరకు అక్రమ వనాలకు మదుపు పెడుతున్న మాఫియా.. పంట చేతికొచ్చాక.. పోలీసుల కళ్లుగప్పి.. అడ్డదారుల్లో తరలించి సొమ్ము చేసుకుంటోంది. పంట ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవడం ఒక ఎత్తయితే.. చేతికొచ్చిన సరకు సురక్షిత ప్రాంతాలకు తరలించి.. అక్కడి నుంచి వివిధ మార్గాల్లో హద్దులు దాటించి.. గమ్యసానాలకు చేర్చడం మరో ఎత్తుగా వ్యవహారం సాగుతోంది. రోజుకో కొత్తదారిలో గమనం సాగుతోంది.

స్వాధీనం చేసుకున్న లారీ

ఎక్కడ పండినా.. ఇక్కడ్నుంచే..

జిల్లాలో గంజాయి సాగు తక్కువే.   పంట ఎక్కడ పండినా.. జిల్లా మీదుగా అక్రమంగా రవాణా అవుతోంది. మోతుగూడెం, డొంకరాయి, వై.రామవరం, చింతూరు ప్రాంతాల్లో సాగవుతోంది. మిగిలింది విశాఖ, ఒడిశా సరిహద్దుల నుంచి వస్తుందే.. గతంలో ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు అక్రమ నిల్వలు పట్టుకుంటే.. నిరుడు ఏకంగా రూ.16.70 కోట్ల విలువైన సరకు పట్టుకున్నారు.

పట్టుబడిన ద్రవరూప గంజాయి

పరారే.. పరారే...

2019లో 51 మంది, 2020లో 72 మంది పోలీసుల కళ్లుగప్పి పారిపోతే.. నిరుడు ఏకంగా 158 మంది నిందితులు పరారవడం గమనార్హం. ఆయా కేసుల్లో తప్పించుకున్నవారు పోను.. 1,091 మందిని జిల్లా పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సైతం.. స్టేషన్‌ నుంచి తప్పించుకున్న ఘటనలూ ఇటీవల జగ్గంపేటలో చోటుచేసుకున్నాయి.

కాదేదీ అనర్హం..

కార్లు, లారీలు.. నీళ్ల ట్యాంకులు, అంబులెన్సులు.. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ఇలా ఏ తరహా వాహనాలు వచ్చినా.. తనిఖీలు చేయాల్సిందే. ఏవోబీ నుంచి ఒంటికి చుట్టుకుని కాలినడకన కొందరు.. గుర్రాలు, గాడిదలపైనా మూటలతో మరికొందరు.. వాహనాల అరల్లో ఇమిడ్చి.. ద్రవ రూపంలోకి మార్చి ఇంకొందరు దాటిస్తున్నారు.

నర్సీపట్నం- పాయకరావుపేట మార్గాల్లో జిల్లాలోకి గంజాయి వస్తోంది. నర్సీపట్నం నుంచి ఏలేశ్వరం మీదుగా కొంత తరలిపోతుంటే.. అడ్డతీగల మీదుగా మరికొంత చొరబడుతోంది. గోకవరం- రంపచోడవరం- మారేడుమిల్లి- భద్రాచలం మీదుగా గుట్టుగా నిల్వలు  సరిహద్దులు దాటుతున్నాయి.

లింకులు చాలా ఉన్నాయ్‌...

గంజాయి మాఫియా.. నిల్వల తరలింపులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెరవెనుక ఎవరు ఉన్నారనేది బయటకు పొక్కకుండా.. వ్యవహారం అంతా కిందిసాయి వారితోనే నడిపిస్తోంది. ఒకవేళ తరలింపు క్రమంలో చిక్కినా సూత్రధారులు ఎవరో బయటకు తెలీదు. వెరసి మూలాలు కనుక్కోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది.

పెట్టుబడి

గంజాయి సాగుకు పెట్టుబడి పెడుతున్నారు. వ్యవసాయ పంటల కంటే.. గంజాయి సాగుతో ఎక్కువ సంపాదించొచ్చనే ఆశ చూపుతున్నారు. సాగుకు అన్నీ సమకూరుస్తున్నారు.

తరలింపు

పండిన పంటను అటవీ మార్గంలో నిర్దేశిత రహస్య ప్రాంతాలకు చేర్చడం.. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి తరలించడంలో ఎగుమతిదారు కీలక పాత్ర పోషిస్తున్నారు. గంజాయి నిల్వతో వెళ్తున్న వాహనానికి ఎస్కార్ట్‌ వాహనాలు ఉండి, పోలీసు జాడలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటాయి.

సరఫరా

గంజాయి నిల్వలు ఎక్కడెక్కడకు ఎంత పంపాలనేది వీరు చూస్తారు. ముందస్తు ఒప్పందం ప్రకారం సరకు వెళ్లేలా వీరు స్కెచ్‌ వేస్తారు. విద్యాలయాలు, ఇతర ప్రాంగణాల్లో ఈ మత్తుకు బానిసైన వారికి వివిధ రూపాల్లో సరకు చేరుస్తారు. ద్విచక్ర, ఇతర వాహనాల్లో సరకు రవాణాకు వీరిని వాడుకుని.. ప్యాకెట్లు, సిగరెట్ల రూపంలో మత్తు చేర్చేస్తారు.

నిరంతర నిఘా

తూర్పున గంజాయి సాగు తక్కువే అయినా.. జిల్లా మీదుగా తరలుతున్న దందాపై నిఘావేశాం. వ్యక్తిగతంగా, ముఠాల దన్నుతో తరలిస్తున్న 15 రాష్ట్రాల వారిని అరెస్టుచేశాం. అక్రమ సాగు, రవాణా ప్రోత్సహించే వారిపై దృష్టిపెట్టాం. ఆపరేషన్‌ పరివర్తన పేరుతో ప్రత్యేక డ్రైవ్‌ ముగిసినా, వాహన తనిఖీలు ఉంటాయి. ప్రభావిత ప్రాంతాల్లో పరిసితిని  ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్నాం. - రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ

అడ్డదారులెన్నో... 
నడక దారులు 5
లోడింగ్‌ పాయింట్లు  6
అక్రమ రవాణా మార్గాలు 60

చిక్కింది కొంతే...
గత మూడేళ్లలో చిక్కింది 1.03 లక్షల కేజీలు
స్వాధీన ఉత్పత్తి విలువ రూ.28.80 కోట్లు

రెండేళ్లలో అరెస్టయిన ఇతర రాష్ట్రాల నిందితులు ఇలా... రాష్ట్రం అరెస్టయినవారు తెలంగాణ 126  ఒడిశా 58  తమిళనాడు 31   మహారాష్ట్ర  41   కర్ణాటక  20   హరియాణా  16   ఉత్తరప్రదేశ్‌  25   కేరళ  12   మధ్యప్రదేశ్‌  14   రాజసాన్‌  5   దిల్లీ 5     ఛత్తీస్‌గఢ్‌ 3   పశ్చిమ బంగ  1   పంజాబ్‌  1   గుజరాత్‌ 1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని