logo

జైల్లో పరిచయంతో వరుస దొంగతనాలు

భవానీపురం ప్రాంతంలో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠాను పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. శనివారం డీసీపీ కె.బాబూరావు వివరాలు వెల్లడించారు. కాకినాడ మాధవనగర్‌కు చెందిన పిన్నింటి రమేష్‌ బాబు అలియాస్‌ నంద

Published : 23 Jan 2022 02:59 IST

భవానీపురం, న్యూస్‌టుడే : భవానీపురం ప్రాంతంలో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠాను పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. శనివారం డీసీపీ కె.బాబూరావు వివరాలు వెల్లడించారు. కాకినాడ మాధవనగర్‌కు చెందిన పిన్నింటి రమేష్‌ బాబు అలియాస్‌ నందన్‌ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జైలులో శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో భరత్‌ చౌహాన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్‌ దార్‌ జిల్లాకు చెందిన భరత్‌ చౌహాన్‌ బంధువైన సురేష్‌తో కలిసి 2020, 2021లో కాకినాడలో ఎనిమిది దొంగతనాలు చేశారు. దొంగిలించిన సొత్తుతో మధ్యప్రదేశ్‌ వెళ్లిపోతుండేవారు. తిరిగి గత ఏడాది డిసెంబరులో విజయవాడ భవానీపురం వచ్చి ఐదు దొంగతనాలకు పాల్పడ్డారు. బాజీబాబా మందిరం రోడ్డులోని ఆ ఇంట్లో చోరీకి యత్నించారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ అమర్చి ఉండటంతో.. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు అక్కడకు చేరుకోగానే.. దొంగలు పారిపోయారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు, ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఆ వేలిముద్రలు కాకినాడలో దొంగతనాలకు పాల్పడిన వారితో సరిపోలాయి. ఇది పాతనేరస్థుల పనిగా భావించారు. ఈ నెల 22వ తేదీ ఉదయం గొల్లపూడి వైజంక్షన్‌ వద్ద ద్విచక్రవాహనంపై భరత్‌ చౌహాన్‌, పిన్నింటి రమేష్‌బాబులు వస్తుండగా పోలీసులు ఆపారు. వారిద్దరూ అనుమానాస్పదంగా కనిపించటంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో దొంగతనాల విషయం వెలుగుచూసింది. సురేష్‌ దొరకాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని