logo

కొవిడ్‌ @3,00,743

కొవిడ్‌ కోరలు చాస్తోంది.. రూపు మార్చి ఆవహిస్తోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దూకుడూ జిల్లాలో నానాటికీ పెరుగుతోంది. 2020 మార్చి 21న తొలి కొవిడ్‌ కేసు నమోదైనప్పటి నుంచి.. కేసుల తాకిడికి అడ్డూఆపూ లేకుండా పోయింది. 22 నెల

Published : 23 Jan 2022 02:59 IST

సుదీర్ఘ విరామం తర్వాత మరో మరణం

ధవళేశ్వరం పీహెచ్‌సీ వద్ద పరీక్షల కోసం ఎదురుచూపు

ఈనాడు - కాకినాడ, న్యూస్‌టుడే - మసీదు సెంటర్‌ : కొవిడ్‌ కోరలు చాస్తోంది.. రూపు మార్చి ఆవహిస్తోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దూకుడూ జిల్లాలో నానాటికీ పెరుగుతోంది. 2020 మార్చి 21న తొలి కొవిడ్‌ కేసు నమోదైనప్పటి నుంచి.. కేసుల తాకిడికి అడ్డూఆపూ లేకుండా పోయింది. 22 నెలల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏకంగా మూడు లక్షల మార్కు దాటేసింది. కొవిడ్‌ కేసుల్లో సంఖ్యాపరంగా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో జిల్లా కొనసాగుతోంది. కొవిడ్‌ నిబంధనలు- టీకా జాగ్రత్తల్లో కొందరి లెక్కలేని తనం పరిస్థితి అదుపు తప్పడానికి కారణమవుతోంది.

అనుమానిత కేసుతో మొదలై..

జిల్లాలో కొవిడ్‌ తొలి అనుమానిత కేసును 2020 జనవరి 26న వైద్యారోగ్యశాఖ గుర్తించింది. జిల్లాకు చైనా నుంచి వచ్చిన ఈ వైద్య వైద్యార్థి కాకినాడ జీజీహెచ్‌లో ఐసొలేషన్‌ వార్డులో ఉంచి ఆరోగ్య స్థితిని పర్యవేక్షించారు. తర్వాత క్రమంలో లండన్‌ నుంచి వచ్చిన వ్యక్తిని పరీక్షిస్తే మార్చి 21న పాజిటివ్‌గా తేలింది. ఈ తొలికేసు నమోదైనప్పటి నుంచి జిల్లాలో కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. మూడు విడతల్లో మిగిలిన జిల్లాలతో పోలిస్తే మరణాల తీవ్రత ఇక్కడ ఎక్కువే కావడం గమనార్హం.

మూడో దశలో తొలి మృతి

జిల్లాలో తొలి రెండు దశల్లో ఎక్కువ మంది బాధితులు శ్వాస ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గతంతో పోలిస్తే.. మరణాలు కొంత తగ్గుముఖం పట్టాయి.

రాష్ట్ర కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ విభాగం శనివారం విడుదలచేసిన బులెటిన్‌లో జిల్లాలో ఒక మరణం నమోదయినట్లు వెల్లడించింది. దీంతో మరణాల సంఖ్య 1,291కి చేరింది. మూడు నెలల విరామం తర్వాత మరో మరణం నమోదుకావడం గమనార్హం. కాకినాడ నగరానికి చెందిన 83 ఏళ్ల మహిళ కొవిడ్‌ బారిన పడి మృతిచెందారు. ఈమెకు ఇతర దీర్ఘకాలిక వ్యాధులూ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

జిల్లాలో 24 గంటల్లో 756 పాజిటివ్‌ కేసులు గుర్తించడం గమనార్హం. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5 వేలు దాటడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

పరీక్షలకు ప్రామాణికం ఇదే..

జిల్లాలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు ఇతర ప్రభుత్వ వైద్యశాలల ప్రాంగణాల్లో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. స్మార్ట్‌ టెస్టింగ్‌ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌తోపాటు.. అత్యవసర కేసులు, గర్భిణులు, 70 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి పరీక్షల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు.

పెరుగుతున్న తీవ్రత...

ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసుల్లో ఒమిక్రాన్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. విదేశాల నుంచి 6,500 మంది వరకు జిల్లాకు చేరుకోవడంతో వారందరికీ పరీక్షలు నిర్వహించి.. ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. గతనెలలో పాజిటివిటీ 0.61 శాతం ఉంటే.. ఈనెలలో 7.58 శాతానికి చేరింది. 24 గంటల పరీక్షలతో నమోదైన కేసులతో పోలిస్తే గత మూడు రోజులుగా పాజిటివిటీ రేటు 20 శాతం వరకు నమోదవడం గమనార్హం. అనుమానిత ప్రాంతాల్లో పరీక్షలు పెంచడం ఓ కారణంగా అధికారులు చెబుతున్నారు.

కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు అనుబంధంగా ఉన్న గ్రామీణ మండలాల్లో కేసుల తీవ్రత కలవరపెడుతోంది. మన్యంలో ఎటపాక, చింతూరు, కూనవరం మండలాల్లో కేసులు ఎక్కువగా ఉండడం పరిశీలనాంశం.

బాధ్యతగా మసలుకోవాలి

కేసుల తీవ్రత పెరుగుతున్న వేళ కొవిడ్‌- 19 నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రస్తుతం ఒమిక్రాన్‌ కేసులూ పెరుగుతున్నాయి. మాస్కులు సరిగ్గా ధరించక పోవడం, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడంలో కొందరి నిర్లక్ష్యం అందరికీ ఇబ్బందిగా మారుతోంది. రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, ఇతర ప్రాంగణాల్లో నిబంధనల అమలు తప్పనిసరి. రాత్రి కర్ఫ్యూ సమర్థ అమలుపైనా దృష్టిసారించాం. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు, సమర్థ వైద్యసేవలపై దృష్టిసారించాం. -హరికిరణ్‌, కలెక్టర్‌

(ప్రతి లక్ష కేసులు నమోదైన రోజులు ఇలా)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని