logo

పీఆర్సీ సాధనకు సమష్టి పోరాటం

పీఆర్సీ సాధనకు.. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఐక్య ఉద్యమాలు చేయాలని ఉద్యోగ సంఘాల ఐకాస తీర్మానించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు తీవ్ర నష్టదాయకంగా ఉన్న పీఆర్సీ జీవోలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం కాకినాడలోని

Published : 24 Jan 2022 05:04 IST


చేతులు కలిపి ఐక్యత చాటుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు

కాకినాడ కలెక్టరేట్‌: పీఆర్సీ సాధనకు.. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఐక్య ఉద్యమాలు చేయాలని ఉద్యోగ సంఘాల ఐకాస తీర్మానించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు తీవ్ర నష్టదాయకంగా ఉన్న పీఆర్సీ జీవోలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం కాకినాడలోని ఏపీఎన్జీవో భవన్‌లో పీఆర్సీ సాధన సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రౌండు టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌, ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జి.రామ్మోహనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. పలు సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. పీఆర్సీ సాధనకు జరిగే పోరాటంలో అవసరమైతే జైలుకు వెళ్లడానికీ సిద్ధంగా ఉండాలన్నారు. కుటుంబాలతో సహా రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రెండు నెలల జీతం రాకపోయినా ఫర్వాలేదని, వాయిదాల చెల్లింపునకు సంబంధించి అవసరమైతే బ్యాంకు అధికారులతో చర్చిద్దామన్నారు. రాష్ట్ర కమిటీ కార్యాచరణ మేరకు జిల్లాలో ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ మద్దతు తెలిపారు. ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు, ఏపీ ఐకాస అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌వీఎస్‌ఎస్‌ఆర్‌కే దుర్గాప్రసాద్‌, ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ సీహెచ్‌ రవి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీఎస్‌ఎన్‌ జగన్నాథం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జిల్లా ఛైర్మన్‌ పి.వెంకటరత్నం, సంఘాల ప్రతినిధులు పి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాస్‌, సత్యానందం, ఎం.బాపూజీ, కేవీ సత్యనారాయణ, ఎల్‌.జార్జి, వి.రవిరాజు, జె.నరసింహరావు, పి.సుబ్బరాజు, రవిచక్రవర్తి, తిలక్‌బాబు, శాస్త్రి పాల్గొన్నారు.

రేపటి నుంచి నిరసనలు

ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు ఉద్యమ కార్యాచరణను పీఆర్సీ సాధన సమితి జిల్లా శాఖ విడుదల చేసింది. 25న జిల్లా కేంద్రంలో ర్యాలీలు, ధర్నాలు, 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాల అందజేత, 27 నుంచి 30 వరకు జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు, వచ్చే నెల 3న చలో విజయవాడ, 5న సహాయ నిరాకరణ, అన్ని ప్రభుత్వ యాప్‌లను తెరవకపోవడం, 7న సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని