logo

జీవోలు ఆపుతారా.. జీరోలు అవుతారా ?

ఉద్యోగ దండు కదలింది. సాగర తీరాన పోరు కెరటమై ఎగసిపడింది. హక్కుల సాధనకు నినదించింది. రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందనీ, దీనిని జీర్ణించుకోలేక పోతున్నామని వాపోయింది. ఇక చర్చల్లేవు.. సమరమే అని ప్రతిన బూనింది. మీరు ఉద్యోగులకు రివర్స్‌ పీఆర్సీ ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో మీ అంకెలు రివర్సే అని గళమెత్తింది. పీఆర్సీ సాధన స

Published : 26 Jan 2022 04:53 IST

కాకినాడలో ఉద్యోగ సంఘాల ధర్నా

కాకినాడ కలెక్టరేట్‌, నగరం: ఉద్యోగ దండు కదలింది. సాగర తీరాన పోరు కెరటమై ఎగసిపడింది. హక్కుల సాధనకు నినదించింది. రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందనీ, దీనిని జీర్ణించుకోలేక పోతున్నామని వాపోయింది. ఇక చర్చల్లేవు.. సమరమే అని ప్రతిన బూనింది. మీరు ఉద్యోగులకు రివర్స్‌ పీఆర్సీ ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో మీ అంకెలు రివర్సే అని గళమెత్తింది. పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం కాకినాడ ధర్నాచౌక్‌ వద్ద మహాధర్నాకు వేలాదిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది తరలివచ్చారు. మహాధర్నాకు జిల్లా ఐకాస ఛైర్మన్‌, ఏపీఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు జి.రామ్మోహనరావు అధ్యక్షత వహించారు.

ప్రముఖుల రాక

ఎమ్మెల్సీ ఐవీ, ఏపీ ఐకాస అమరావతి జిల్లా అధ్యక్షుడు త్రినాథరావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్నాథం, ఏపీఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి మూర్తిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్‌, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ జార్జిబాబు, ఉపాధ్యాయ ప్రతినిధులు చక్రవర్తి, సుబ్బరాజు, తిలక్‌బాబు, ఉద్యోగ ప్రతినిధులు పద్మమీనాక్షి, ఎం.బాపూజీ, నరసింహారావు, మునిప్రసాద్‌, జార్జి, పలివెల శ్రీనివాస్‌, విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధి కె.సత్తిరాజు, కార్మిక ప్రతినిధులు వెంకటేశ్వరరావు, సత్తిబాబు, ప్రసాద్‌, శేష బాబ్జి పాల్గొన్నారు.

 

మిన్నంటిన నినాదాలు

ఉద్యోగుల శాంతియుత ర్యాలీకి తొలుత పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ధర్నా తర్వాత ధర్నాచౌక్‌ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా జడ్పీ కూడలి వరకు ప్రదర్శనగా సాగారు.ధర్నా చౌక్‌ వద్ద ధర్నాను పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించారు. ఏఎస్పీ కరణం కుమార్‌ ఆధ్వర్యంలో డీఎస్పీ భీమారావు పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. కలెక్టరేట్‌, జడ్పీ, పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రాంతాల్లో దారులను మూసేశారు. కలెక్టరేట్‌ వద్ద భారీ బందోబస్తు ఉంచారు.

సీఎం, మంత్రులదే బాధ్యత

ఈ పీఆర్సీ మాకొద్దని 13 లక్షల మంది రోడ్డెక్కారు. దీనికి సీఎం, మంత్రులు, అధికారులు బాధ్యత వహించాల్సిందే. ఉద్యోగుల సంక్షేమానికి మంగళం పాడేశారు. ఒక్కో మెట్టు ఎక్కి రాయితీలు సాధించుకుంటే.. సీఎం ఇప్పుడు అన్ని మెట్లూ కూల్చేశారు. చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌.. సీఎంలుగా మంచి పీఆర్సీ ఇస్తే.. తండ్రీకొడుకులు రాజశేఖర్‌రెడ్డి, జగన్‌నిలువునా ముంచారు. రెండేళ్లుగా ఉద్యోగ సంఘాలతో ఈ సీఎం మాట్లాడలేదు. - -ఐ.వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ

ఉద్యోగులంతా ఏకతాటిపైనే..

ఉద్యోగులను నాలుగు వర్గాలుగా విభజించి పాలించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగులంతా ఐక్యంగా ఉండి ఏకతాటిపైకి వచ్చారు. అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీ సాధించేలా పోరాడతాం. -రామ్మోహనరావు, ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌

అశుతోష్‌ మిశ్రా నివేదిక బయటపెట్టాలి : 

అశుతోష్‌ మిశ్రా నివేదికను వెల్లడించాలి. పీఆర్సీని నిర్ణయించే అధికారం అధికారుల కమిటీకి లేదు. మూడు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. న్యాయబద్ధ విధానాన్ని అమలు చేయాలి. -జగన్నాథం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు

సేవకులకు అన్యాయం

పీఆర్సీతో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో వేర్వేరు విభాగాల్లో పనిచేస్తోన్న మూడు లక్షల మందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రస్తుత పీఆర్సీతో ఉద్యోగుల క్రమబద్ధీకరణ కలగానే మిగిలింది. -రవిచక్రవర్తి, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

పోరాటాన్ని ఆపేదిలేదు..

ప్రతిపక్షంలో ఉండగా జగన్‌కు ఉద్యోగులు అంతా ఎదురెళ్లి మరీ మద్దతు తెలిపాం. మా ఆశలు నెరవేరతాయని భావించాం. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా వదిలేశారు. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపేదిలేదు. -పితాని త్రినాథ్‌, ఏపీ ఐకాస అమరావతి, జిల్లా ఛైర్మన్‌

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని