logo

పద్మభివందనం

నేటి తరాన్ని తన ప్రసంగాలతో మురిపించిన.. సాహితీ ప్రముఖులను తన అవధాన ప్రతిభతో మెప్పించిన ఘనాపాటి.. గరికపాటి నరసింహారావు.. కళల కాణాచి కాకినాడలో తన సాహిత్యం, సహస్రావధానాలు ప్రారంభించిన ఆయనకు కేంద్రంపద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Published : 26 Jan 2022 04:53 IST


కాకినాడలో గరికపాటి దంపతులకు సన్మానం

కాకినాడ(గాంధీనగర్‌): నేటి తరాన్ని తన ప్రసంగాలతో మురిపించిన.. సాహితీ ప్రముఖులను తన అవధాన ప్రతిభతో మెప్పించిన ఘనాపాటి.. గరికపాటి నరసింహారావు.. కళల కాణాచి కాకినాడలో తన సాహిత్యం, సహస్రావధానాలు ప్రారంభించిన ఆయనకు కేంద్రంపద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గరికపాటి పుట్టింది పశ్చిమగోదావరి జిల్లాలో అయినా.. అన్నవరానికి చెందిన శారదతో వివాహమైంది. అలా ఆయనకు జిల్లాతో అనుబంధం మొదలైంది. ఉద్యోగ రీత్యా వరంగల్‌ చేరుకున్న ఆయన ఆపై కాకినాడ వచ్చారు. స్నేహితులతో కలిసి కోనసీమ జూనియర్‌ కళాశాలను స్థాపించారు. ఆ తర్వాత సొంతంగా గరికపాటి జూనియర్‌ కళాశాల నడిపారు. కొంతకాలం తర్వాత దాన్ని ఆపేసి, చైతన్య కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేశారు.

ఇక్కడే శతావధానం..: కాకినాడలో ఉండగానే తన మొదటి శతావధానం చేశారు. 1996 మేలో సూర్యకళామందిరంలో 21 రోజులపాటు సహస్రావధానం చేసిన ఘనుడు గరికపాటి. ఆయన అమోఘ జ్ఞాపకశక్తికి.. బేతవోలు రామబ్రహ్మం ధారణాబ్రహ్మ రాక్షసుడనే బిరుదు ఇచ్చారు. గరికపాటికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కావ్యం ‘సాగరఘోష’ కాకినాడలోనే రచించారు. రామారావుపేటలోని ఈశ్వర పుస్తక భాండాగారంలో 4 అవధానాలు చేశారు. ఆంధ్ర సాహిత్య పరిషత్‌లో ప్రవచనాలు, సాహితీ సభలు నిర్వహించారు. నేటికీ రాజేశ్వరినగర్‌లోని పైడావారి వీధిలో ఆయనకు ఇళ్లు ఉన్నాయి. 2010లో హైదరాబాద్‌ వెళ్లి స్థిరపడినా నేటికీ కాకినాడలోని సంగీత, సాహిత్య సంస్థలు, ప్రముఖులతో ఆయనకు విడదీయరాని బంధం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని