logo

ముచ్చటగా..3

జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాలు మూడు జిల్లాలుగా అవ

Published : 26 Jan 2022 04:53 IST

కొత్త జిల్లాలకు మంత్రివర్గం ఆమోదం

ఈనాడు డిజిటల్‌ - రాజమహేంద్రవరం: జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాలు మూడు జిల్లాలుగా అవతరించనున్నాయి. గతంలోనే అధికారులు ఆయా జిల్లా కేంద్రాల్లో పాలనకు అనువైన వనరులు, వసతుల కల్పన దిశగా దృష్టి సారించారు. భౌగోళిక స్వరూపం, సరిహద్దుల వివరాలు కూడా ఇప్పటికే అధికారులు నమోదు చేశారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెర మీదకు వచ్చింది. జిల్లాల ఏర్పాటుతోపాటు జిల్లా కేంద్రాల వివరాలు కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంగా ఉండే జిల్లాకు పూర్వ తూర్పుగోదావరి జిల్లా అనే పేరును యథాతథంగా ఉంచారు. అమలాపురం కేంద్రంగా ఆవిర్భవించే జిల్లాకు కోనసీమ జిల్లాగా పేరుపెట్టారు. రాజమహేంద్రవరం పేరును కూడా యథాతథంగా కొనసాగిస్తున్నారు.

వీటిపై దృష్టి అవసరం...

పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా మారుస్తున్న నేపథ్యంలో గతంలోనే ఆయా ప్రాంతాల్లో కలెక్టరేట్ల ఏర్పాటుకు అవసరమైన వనరులు, జిల్లాస్థాయి కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు గుర్తించారు. ఉద్యోగుల వివరాలు, అవసరాలపై నివేదిక సిద్ధం చేశారు. సరిహద్దులు, భౌగోళిక విస్తీర్ణం వివరాలు సేకరించారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్లు, పోలీసు సబ్‌ డివిజన్లు సమానంగా లేవు. రెవెన్యూ డివిజన్లు ఏడు ఉన్నాయి. జిల్లా ఎస్పీ కార్యాలయం పరిధిలో ఆరు పోలీసు సబ్‌ డివిజన్లు, రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ పరిధిలో నాలుగు జోన్లు ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైతే వీటి సర్దుబాటు దిశగా కసరత్తు చేయాల్సి ఉంది. పాలనా సౌలభ్యం కోసం తమ మండలాలను అనుకూలంగా ఉన్న జిల్లాల్లో చేర్చాలనే వినతులు ప్రజల నుంచి గతంలోనే జిల్లా అధికారులకు అందాయి. తాజా కసరత్తులో భాగంగా వీటిపై దృష్టిసారించాల్సి ఉంది.

 

కొత్త జిల్లాలపై మీ మాటేంటి?

ఈనాడు - కాకినాడ: ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్ధంచేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్‌ అభిప్రాయాలను సేకరించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ హరికిరణ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. గతంలో శాఖల వారీగా సేకరించి పంపిన నివేదిక వివరాలను కలెక్టర్‌ వెల్లడించారు. కొత్త జిల్లాలపై డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల తర్వాత అభ్యంతరాల స్వీకరణకు నెలరోజులు గడువు ఇచ్చే వీలుందని కలెక్టర్‌ హరికిరణ్‌ ‘ఈనాడు’తో చెప్పారు. అన్నీ పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందన్నారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని