logo

గణతంత్రస్ఫూర్తిఘన ప్రగతి దీప్తి

రాజ్యాంగ స్ఫూర్తితో.. దేశ సమైక్యత, సమగ్రత పరిరక్షణకు శ్రమిద్దాం.. సమష్టి భావనతో అన్ని రంగాల్లోనూ తూర్పు ప్రగతికి కృషి చేద్దామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పిలుపునిచ్చారు. బుధవారం కాకినాడ పోలీసు కవాతు మైదానంలో గణతంత్ర దినోత్సవ జిల్లాస్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై.. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుతో కలిసి

Updated : 27 Jan 2022 06:40 IST


జాతీయ పతాకం ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌. పక్కనే ఎస్పీ

కాకినాడ కలెక్టరేట్‌, మసీదు సెంటర్‌: రాజ్యాంగ స్ఫూర్తితో.. దేశ సమైక్యత, సమగ్రత పరిరక్షణకు శ్రమిద్దాం.. సమష్టి భావనతో అన్ని రంగాల్లోనూ తూర్పు ప్రగతికి కృషి చేద్దామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పిలుపునిచ్చారు. బుధవారం కాకినాడ పోలీసు కవాతు మైదానంలో గణతంత్ర దినోత్సవ జిల్లాస్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై.. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. త్రివిధ దళాల కవాతు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంక్షేమపథకాలు, వివిధ రంగాల్లో జిల్లా ప్రగతిని కలెక్టర్‌ వివరించారు.

విద్య, వైద్యానికి ప్రాధాన్యం

నాడు-నేడు తొలి దశలో 1,331 పాఠశాలల్లో రూ.374 కోట్లతో సౌకర్యాలు కల్పించాం. విద్యాకానుకతో రూ.74.43 కోట్ల విలువైన కిట్లను 4.81 లక్షల పిల్లలకు అందజేశాం. కరోనా కట్టడికి ఒక్కో నియోజకవర్గానికి ఒక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ పెట్టి.. ఆసుపత్రులకు అనుసంధానిస్తున్నాం. కేంద్రం, సీఎస్సార్‌ నిధులతో ఆక్సిజన్‌ ప్లాంట్లు పెట్టాం. కొవిడ్‌తో మరణించిన 3,906 మందికి ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇచ్చాం. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 88 మంది చిన్నారులకు సాయానికి ప్రతిపాదించాం.

అభివృద్ధి, సంక్షేమం

‘వైఎస్సార్‌ భరోసా- పీఎం కిసాన్‌’ ద్వారా ఈ ఏడాది జిల్లాలో 4.54 లక్షల మంది రైతులకు రూ.525 కోట్ల సాయం చేశాం. ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ కింద 71 వేల మందికి రూ.9.41 కోట్లు అందించాం. ‘వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం’ ద్వారా రూ.4.23 కోట్లతో రాయితీపై యాంత్రీకరణ పరికరాలు ఇచ్చాం. రూ.12.62 కోట్లతో ఉద్యాన పంటల విస్తరణ, అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాం. రూ.2.33 కోట్లతో కొబ్బరి తోటలు.. 1,800 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ తోటల విస్తరణ చేపట్టాం. ‘వైఎస్సార్‌ చేయూత’ కింద 6,871 పాడి పశువులను కొని లబ్ధిదారులకు ఇస్తున్నాం. ఉప్పాడ వద్ద రూ.422 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం, కాకినాడలో రూ.10 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ చేపట్టాం.

భళారే.. కళా

దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సెయింట్‌ ఆన్స్‌, కాకినాడలోని అన్నవరం సత్యవతీదేవి జూనియర్‌ కళాశాల, సత్యవతీదేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు మేటిగా నిలిచారు. జిల్లా అగ్నిమాపక శాఖ ప్రదర్శన అబ్బురపరిచింది. పరేడ్‌ కమాండర్‌ నరసింహమూర్తి సారథ్యంలో సాయుధ బలగాల కవాతు అలరించింది. ఏఎన్‌ఎస్‌, మహిళ, ఏఆర్‌ విభాగాలకు తొలి మూడు స్థానాలు దక్కాయి. శకటాలు.. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (స్వచ్ఛ సంకల్పం) - ప్రథమ, డీఆర్‌డీఏ - ద్వితీయ, ఐటీడీఏ (రంపచోడవరం) - తృతీయంగా నిలిచాయి.

పేదలకు గూడు

నవరత్నాలు-పేదలకు ఇళ్లు ద్వారా 3.25 లక్షల కుటుంబాల సొంతింటి కల సాకారం చేయనున్నాం. రూ.3,394 కోట్లతో కాలనీలు వృద్ధి చేస్తున్నాం. సంపూర్ణ గృహ హక్కుతో3.37 లక్షల కుటుంబాలకు ఓటీఎస్‌ అమలు చేపట్టగా 21,244 మంది వినియోగించుకున్నారు.

పింఛన్లలో ప్రథమం

రాష్ట్రంలో అత్యధికంగా 79,730 మందికి ప్రతీనెలా రూ.171.43 కోట్లు పింఛను సొమ్ము చెల్లిస్తున్నాం. ‘వైఎస్సార్‌ ఆసరా’ కింద రెండు విడతలుగా 94,670 డ్వాక్రా గ్రూపులకు రూ.1,394 కోట్లు ఇచ్చాం. ‘చేయూత’తో రూ.897 కోట్లు సాయం చేశాం. ‘జగనన్నతోడు’తో 43 వేల చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలిచ్చాం. 1.04 లక్షల డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ రాయితీగా రూ.71.89 కోట్లు చెల్లించాం.

ప్రముఖుల రాక

మంత్రి కన్నబాబు విశిష్ట అతిథిగా హాజరై... శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఉత్తమ ఉద్యోగులు, ప్రతిభా విద్యార్థులకు కలెక్టర్‌తో కలిసి బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు, మేయర్‌ శివప్రసన్న, కుడా ఛైర్మన్‌ చంద్రకళాదీప్తి, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రాజుబాబు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, జేసీలు సుమిత్‌, కీర్తి, భార్గవ్‌తేజ, కమిషనర్లు స్వప్నిల్‌, అభిషిక్త్‌కిశోర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, ఏఎస్పీ కరణం కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అధికార గణం: కలెక్టర్‌, ఎస్పీతో జేసీలు, కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు

సగర్వం: ఆకట్టుకున్న పోలీసు కవాతు

ఆతిథ్యం:జేసీ సుమిత్‌, మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ పండుల, జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి

ప్రథమ శకటం: కాకినాడ కార్పొరేషన్‌.. స్వచ్ఛ సంకల్పం

వర్ణ శోభితం: అలరించిన అగ్నిమాపక శకట విన్యాసం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని