logo

భిన్న జిల్లాలు.. విభిన్న స్వరాలు

 జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా మంత్రివర్గ ఆమోదంతో కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ప్రజల దృష్టి కొత్త జిల్లాల ఏర్పాటుపై పడింది. జిల్లాలోని కాకినాడ, కోనసీమ (అమలాపురం), తూ.గో.(రాజమహేంద్రవరం) నూతన జిల్లాలుగా ఆవిర్భవించనున్నాయి. విభజన నేపథ్యంలో గ

Published : 27 Jan 2022 04:40 IST

ఈనాడు డిజిటల్‌ - రాజమహేంద్రవరం: జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా మంత్రివర్గ ఆమోదంతో కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ప్రజల దృష్టి కొత్త జిల్లాల ఏర్పాటుపై పడింది. జిల్లాలోని కాకినాడ, కోనసీమ (అమలాపురం), తూ.గో.(రాజమహేంద్రవరం) నూతన జిల్లాలుగా ఆవిర్భవించనున్నాయి. విభజన నేపథ్యంలో గతంలోనే వెలుగు చూసిన సమస్యలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. వీటిలో భౌగోళిక సమస్యలు, దూరాభారాలు, విలీన మండలాల ఇబ్బందులు ప్రధానంగా ఉన్నాయి.

విలీన వేదన...

మన్యంలోని వీఆర్‌పురం, చింతూరు, కూనవరం, ఎటపాక మండలాలు 1953లో తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవి. వీటిని పాలన సౌలభ్యం కోసం 1959లో ఖమ్మం జిల్లాలో కలిపారు. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేశారు. తాజాగా పాడేరు జిల్లాలో కలుపుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. విలీన మండలాలే కాకుండా రంపచోడవరం, చింతూరు రెండు ఐటీడీఏల పరిధిలోని 11 మండలాలను పాడేరులో కలపటంతో దూరం పెరిగిపోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. చింతూరు, రంపచోడవరం నుంచి పాడేరు 280 కి.మీ. దూరంలో ఉంది. ఎటపాక 345 కి.మీ దూరంలో ఉంది. దీంతో జిల్లా కేంద్రానికి వెళ్లటానికి చాలా ఇబ్బందే అని మన్యంవాసుల వేదన. మన్యంలోని 11 మండలాలను జిల్లాగా ఏర్పాటు చేయాలి లేదా రాజమహేంద్రవరంలో కలపాలనే డిమాండ్‌ బాగా వినిపిస్తోంది.

ఎవరి ఆశలు వారివి..

రామచంద్రపురం నియోజకవర్గం అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నా అమలాపురానికి దాదాపు 60 కి.మీ దూరంలో ఉంది. కాకినాడకు కేవలం 30 కి.మీ దూరంలో ఉన్నందున కాకినాడ జిల్లాలో కలిపితే సౌకర్యంగా ఉంటుందని గతం నుంచి డిమాండ్‌ ఉన్నా.. తాజాగా అమలాపురంలోనే కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో మరోసారి చర్చలు మొదలయ్యాయి. కొందరు మాత్రం కోటిపల్లి వంతెన నిర్మాణం జరిగితే అమలాపురం కూడా దగ్గరవుతుందని చెబుతున్నారు.

అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి మండలాన్ని కూడా కాకినాడలో చేర్చాలనే డిమాండ్‌ ఉంది. ఈ మండలంలో 18 గ్రామాలకు రాజమహేంద్రవరం కంటే.. కాకినాడలో ఉంటేనే సౌలభ్యంగా ఉంటుంది. ఈ మండలంలోని రామేశ్వరం కాకినాడకు కేవలం 5 కి.మీ దూరంలో ఉంటే... రాజమహేంద్రవరానికి 80 కిమీ దూరంలో ఉంది.●

తాళ్లరేవు కాకినాడ రెవెన్యూ డివిజన్‌లో ఉంది. అమలాపురం పార్లమెంటు పరిధిలోనూ ఉన్నందున.. కోనసీమ జిల్లాలోకి వచ్చింది. ఈ మండలం కాకినాడకు కేవలం 12 కి.మీ దూరంలో ఉంది. కాకినాడ జిల్లాలో కలిపితే సౌలభ్యంగా ఉంటుందనే వాదన వినిపిస్తోంది. అదే అమలాపురంలో అయితే 40కి.మీ దూరం. ఈ అంశంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, అఖిలపక్షంగా ఏర్పడ్డాయి.

రెవెన్యూ, పోలీసుపరంగా గోకవరం రాజమహేంద్రవరం డివిజన్‌లోనే ఉంది. పార్లమెంట్‌ నియోజకవర్గం ప్రకారం కాకినాడలో ఉన్నందున ప్రస్తుతం కాకినాడ జిల్లాలో కలవనుంది. గోకవరానికి రాజమహేంద్రవరానికి 30 కి.మీ మాత్రమే. గోకవరం ప్రజలు అన్ని పనులకు రాజమహేంద్రవరమే వెళతారు. కాకినాడ వెళ్లాలంటే 65 కి.మీ ప్రయాణం తప్పదు.

అభ్యంతరాలు తెలిపే అవకాశం

జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ఆయా ప్రాంతాల ప్రజలకు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ కొనసాగుతుందనే విషయంపై ఇంకా ఆదేశాలు రాలేదు. ఒకటి రెండు రోజల్లో స్పష్టత వస్తుంది. -హరికిరణ్‌, కలెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని