logo

ఓడిపోవద్దు..వీడిపోవద్దు!

 ఓటమి ఎదురైతే కుంగిపోవద్ధు ఒత్తిడికి గురైతే తనువు చాలించొద్ధు ఉజ్వల భవితను క్షణికావేశంతో తుంచేసుకోవద్ధు. ఓటమి చెప్పిన పాఠంతో.. ఒత్తిడి నేర్పిన గుణపాఠంతో ముందుకెళ్తే అవాంతరాలను అధిగమించి విజయం సాధించవచ్ఛు ఓటమి ఎవరి తల రాత కాదు.. ఒత్తిడి ఎవరికీ శాపం

Published : 20 May 2022 05:45 IST

ఒత్తిళ్లు, వేధింపులపై పోలీసు శాఖలో అంతర్మథనం

ఈనాడు, అమలాపురం, కాకినాడ , రాజమహేంద్రవరం ఓటమి ఎదురైతే కుంగిపోవద్ధు ఒత్తిడికి గురైతే తనువు చాలించొద్ధు ఉజ్వల భవితను క్షణికావేశంతో తుంచేసుకోవద్ధు. ఓటమి చెప్పిన పాఠంతో.. ఒత్తిడి నేర్పిన గుణపాఠంతో ముందుకెళ్తే అవాంతరాలను అధిగమించి విజయం సాధించవచ్ఛు ఓటమి ఎవరి తల రాత కాదు.. ఒత్తిడి ఎవరికీ శాపం కాదు.. ఈ విషయాన్ని గమనిస్తే వైఫల్యాలకు కుంగిపోయి.. మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడే బలహీనత అధిగమించవచ్ఛు ఆత్మ విశ్వాసమే ఆయుధంగా ముందుకు దూసుకెళ్తే.. అవాంతరాలన్నీ మన స్థైర్యం ముందు చిన్నవేనని మానసిక వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

శ్రుతిమించిన జోక్యం..

ఉమ్మడి జిల్లాలో మైనింగ్‌, సారా, గంజాయి మాఫియాకు కొదవేలేదు. వీటిని ఛేదించే క్రమంలో పోలీసులకు నిత్యం సవాళ్లే. అక్రమ నిల్వలు పట్టుకుంటే వదిలేయమని.. క్వారీల జోలికి వెళ్లవద్దనే ఒత్తిళ్లు పరిపాటిగా మారాయి. ఉద్యోగం సాఫీగా సాగాలంటే నాయకులు చెప్పినట్లు కొన్నిచోట్ల వినాల్సిందే. ఏ ఠాణాలో ఎవరు ఉద్యోగం చేయాలో తేల్చేది నాయకులే కావడంతో సమస్య వస్తోంది.

మూడు జిల్లాల్లో సామర్థ్యానికి తగిన చోటు దక్కక మానసికంగా ఇబ్బంది పడుతున్న పోలీసులు ఉన్నారు. విధి నిర్వహణలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పులు చేస్తూ వీఆర్‌లోకి కొందరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒత్తిళ్లతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ నాయకుల జోక్యానికి తావులేని స్వేచ్ఛా వాతావరణం ఉంటే మెరుగైన సేవలు అందించే వీలుంది.

అమలాపురం సీఐ బాజీలాల్‌ను వీఆర్‌కు పంపడం వివాదాస్పదమైంది. ఓ ప్రజాప్రతినిధి జోక్యంతో రాజకీయ కోణంలోనే ఈ చర్యలు తీసుకున్నారనే విమర్శలు గుప్పుమన్నాయి. ఇదే అంశంపై ఓ వర్గానికి చెందిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాయకులు ఆందోళనకు దిగడం.. దీనికి ఇతర సంఘాలు మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది.

సీతానగరం మండలంలో శిరోముండనం కేసు.. మండపేట, సామర్లకోటలో మృతదేహాలతో ఆందోళన వ్యవహారాల్లో పోలీసుల తీరు వివాదాస్పదమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు చర్యలు తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణం. ఒత్తిడి తెచ్చిన నాయకులు తప్పించుకోగా.. ఆయా కేసుల్లో అంతిమంగా పోలీసులే శాఖాపర చర్యలను ఎదుర్కొన్నారు.

ఇతర వృత్తులతో పోలిస్తే పోలీసు శాఖలో ఉద్యోగులది దృఢచిత్తం.. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండే పోలీసుల్లోనూ మానసిక ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు పోలీసులను ప్రశాంతంగా విధులు నిర్వహించుకునే వెసులుబాటులేని పరిస్థితి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ ఉంది. పోలీసు విధుల్లో మితిమీరిన రాజకీయ జోక్యం పెద్ద సమస్యగా మారింది.

కాకినాడ గ్రామీణం సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య ఇటీవల చర్చనీయాంశమైంది. నాగమల్లితోట ప్రాంతంలో తన నివాసంలో సర్వీస్‌ తుపాకీతో కాల్చుకుని మృతిచెందారు. మానసిక ఒత్తిడికి గురై ఈ చర్యకు పాల్పడ్డారనే వాదన వినిపిస్తోంది.

సఖినేటిపల్లి మహిళా ఎస్సై భవానీ నిరుడు ఆత్మహత్య చేసుకున్నారు. విజయనగరంలో పోలీసు శిక్షణకు వెళ్లిన ఈమె అక్కడే ఉరేసుకుని మృత్యువాత పడ్డారు. వ్యక్తిగత ఇబ్బందే ఆత్మహత్యకు కారణమని.. మానసిక వేదనతోనే అఘాయిత్యానికి పాల్పడ్డారనే వాదన వినిపించింది.

తూ.గో.జిల్లాలో ఓ ఏఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏఎస్సైకి వ్యతిరేకంగా స్థానిక పోలీసుస్టేషన్‌ ఎదుట పలువురు ఆందోళనకు దిగారు. దీంతో మనస్తాపానికి గురై.. పోలీసు క్వార్టర్స్‌లో ఉరేసుకోవడానికి ప్రయత్నించారు. సకాలంలో గుర్తించిన సహచర సిబ్బంది తలుపు పగలగొట్టి రక్షించారు.

శిక్షణలోనే శారీరక, మానసిక స్థైర్యం

పోలీసు శిక్షణలో అందరినీ శారీరకంగా, మానసికంగా సంసిద్ధులను చేస్తారు. అన్ని సమస్యలు ఎదుర్కొనేలా తర్ఫీదు ఇస్తారు. వ్యక్తిత్వ వికాస నిపుణులతో ప్రత్యేక తరగతులు ఉంటాయి. కఠోర శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతున్నా.. కొందరు సున్నిత మనస్కులు కావడంతో ఇబ్బంది వస్తోంది. 95 శాతం మంది రాటుదేలుతారు. మరికొందరు ఇమడలేకపోతారు. వివాహాలైన తర్వాత కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురై కుంగిపోతారు. వీరికోసమే ప్రత్యేక స్పందన నిర్వహించిసమస్యలు పరిష్కరిస్తున్నాం.- రవీంద్రనాథ్‌బాబు, కాకినాడ జిల్లా ఎస్పీ- కమాండెంట్‌, ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌

భావోద్వేగాలు అంచనా వేయాలి..

మనిషి ప్రవర్తన, మాటతీరు, ఆలోచన విధానం, భావోద్వేగాలు అంచనా వేయగలిగితే ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నాన్ని అడ్డుకోవచ్ఛు ప్రవర్తనలో తేడా గమనిస్తే స్నేహితులైనా, సహోద్యోగులైనా, కుటుంబ సభ్యులైనా వారితో కాసేపు మాట్లాడి వారిలో అంతర్లీనంగా ఉన్న వేదనకు ఊరటనివ్వాలి. వారి ఆలోచనలు మరల్చాలి. ఒక్క క్షణం మనపై ఆధారపడేవారి గురించి ఆలోచిస్తే విపత్తు నుంచి బయటపడొచ్ఛు కౌన్సెలింగ్‌ ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. - డాక్టర్‌ కర్రి రామారెడ్డి, మానసిక వైద్య నిపుణులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని