logo

ఇ-గవర్నెన్స్‌లో పీఎఫ్‌ సంస్కరణలు

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇ-గవర్నెన్స్‌ విధానం ద్వారా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) పలు సంస్కరణలు తీసుకొచ్చిందని రాజమహేంద్రవరం ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌-1 మనోజ్‌కుమార్‌ అన్నారు. రాజమహేంద్రవరంలోని ఈపీఎఫ్‌వో

Published : 20 May 2022 05:45 IST


మాట్లాడుతున్న పీఎఫ్‌ కమిషనర్‌-1 మనోజ్‌కుమార్‌, చిత్రంలో అకౌంట్స్‌ అధికారి కృష్ణ

 

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇ-గవర్నెన్స్‌ విధానం ద్వారా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) పలు సంస్కరణలు తీసుకొచ్చిందని రాజమహేంద్రవరం ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌-1 మనోజ్‌కుమార్‌ అన్నారు. రాజమహేంద్రవరంలోని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈపీఎఫ్‌వో అమలు చేస్తున్న సంస్కరణలను వివరించారు. కొత్తగా ఈ ఏడాది మార్చి నుంచి ప్రిన్సిపల్‌ ఎంప్లాయర్స్‌(ప్రధాన యాజమానులు) తమ కాంట్రాక్టర్లు, ఒప్పంద ఉద్యోగుల ఈపీఎఫ్‌ వర్తింపు స్థితిని తెలుసుకోవడానికి వీలుగా ఈపీఎఫ్‌వో యూనిఫైడ్‌ పోర్టల్‌లో ఎలక్ట్రానిక్‌ సదుపాయం అమలులోకి వచ్చిందన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా అప్‌లోడ్‌ చేయడానికి, వారి పీఎఫ్‌ ప్రయోజనాలు విస్తరించడానికి, మెరుగుపరచడానికి ఈ అప్లికేషన్‌ సహాయకారిగా ఉంటుందన్నారు. ఇప్పటికే యూనిఫైడ్‌ పోర్టల్‌ ద్వారా ఖాతాదారులకు మెరుగైన అనేక సేవలు అందుతున్నాయన్నారు. 2021-22లో ఇక్కడి ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి క్లెయిమ్‌ల పరిష్కారానికి ఆన్‌లైన్‌లో 1.35 లక్షల దరఖాస్తులు రాగా వీటిలో 1.14 లక్షలు మూడు రోజుల వ్యవధిలోనే పరిష్కారమైనట్లు వివరించారు. చందాదారుల ఈకేవైసీ నవీకరణ, పుట్టిన తేదీల్లో తప్పుల సవరణ, ఆధార్‌లో వివరాల మార్పులు-చేర్పులు వంటివి సులభతరం చేయడం, ఇ-నామినేషన్‌ సౌకర్యం, పాక్షిక న్యాయ విచారణ కోసం వర్చువల్‌ హియరింగ్‌ సౌకర్యం తదితర సంస్కరణలు ఈపీఎఫ్‌వో తీసుకొచ్చిందన్నారు. సమావేశంలో అక్కౌంట్స్‌ అధికారి డి.కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని