logo

ఇది బెబ్బులి అడ్డానా..?

అడుగులతోనే అలజడి రేపుతున్న బెబ్బులి నచ్చినట్టు వేటాడుతూ సంచరిస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఉపప్రణాళిక ప్రాంతంలోని సమీప గ్రామాల్లో రోజుకు పది నుంచి 20 కిలోమీటర్లు పయనిస్తున్న దాని ప్రవర్తన అర్థంకాక అటవీ యంత్రాంగం

Updated : 27 Jun 2022 09:44 IST

ప్రత్తిపాడు, రౌతులపూడి: అడుగులతోనే అలజడి రేపుతున్న బెబ్బులి నచ్చినట్టు వేటాడుతూ సంచరిస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఉపప్రణాళిక ప్రాంతంలోని సమీప గ్రామాల్లో రోజుకు పది నుంచి 20 కిలోమీటర్లు పయనిస్తున్న దాని ప్రవర్తన అర్థంకాక అటవీ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఇప్పటివరకు అది దాదాపు 150 చదరపు కి.మీ. విస్తీర్ణంలో సంచరించింది. తాజాగా రౌతులపూడి మండలం ఎ.మల్లవరం, లచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో పులి అడుగుజాడలు జనాన్ని ఆదివారం భయపెట్టాయి.

ఉనికి చిక్కడం లేదు: పులిని బంధించేందుకు ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు అనుకూలించడం లేదు. డ్రోన్‌ ఇతర సాంకేతిక సహకారంతో పులి ఉనికి ఇక్కడ అని స్పష్టంగా చెప్పేందుకు వీలవ్వడం లేదు.

మాటుకు దొరక్కుండా..: పోతులూరు వద్ద మూడు రోజులు మకాం పెట్టాక పులిని బంధించే సరంజామా తెచ్చారు. పొదురుపాక వద్ద ఆవును వేటాడాక మాటు వేశారు. బోనును పసిగట్టిన పులి ఇప్పటివరకు దానివైపు చూడలేదు.

షూటర్లు రావడం లేదేం..: మహారాష్ట్ర తడోబా టైగర్‌ రిజర్వ్‌ నుంచి షూటర్లను రప్పించడానికి పులి దినచర్య ఒక నిర్ణీత ప్రాంతానికి రెండు మూడు రోజులు కూడా పరిమితం కావడం లేదు.

ఆహార వైవిధ్యం: పులి ఇప్పటికి 8 పశువులను వేటాడింది. 9 పశువులను గాయపరిచింది. జనం కంట పడకుండా నక్కడానికి అనువైన కొండలు, డొంకలు ఉండడమే కాదు.. ఆహార వైవిధ్యం ఈప్రాంతంలో పులికి పుష్కలంగా ఉంది. వచ్చిన దారిన వెళ్లేందుకు వర్షాల కారణంగా కొంత తడబడుతోందని భావిస్తున్నారు.

వారి వ్యూహం ఇదే: చీఫ్‌ కన్జర్వేటర్‌ శరవణన్‌ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ పులి జాడలు పట్టుకుని గమనాన్ని చూస్తున్నారు. ఒక ప్రాంతంలో అది గడిపినా తడోబా బృందం రంగంలోకి దిగుతుంది.  పశువును వేటాడి రెండు మూడు రోజుల్లో వస్తే మాటువేసి ట్రాంక్విలైజ్‌ గన్‌తో షూట్‌చేసి అడవికి పంపిస్తామని అటవీ అధికారులు చెపుతున్నారు. వర్షం వల్ల దట్టమైన పొదలు పెరగడం యంత్రాంగానికి సవాలుగానూ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని