logo

దండాలెట్టే వారే.. దయతలిచే వారేరీ?

గోదావరి.. దేశంలో రెండో పెద్ద నది.. దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల జీవనాడి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న గోదావరి పరిస్థితి పేరుకే గొప్ప.. అనే చందాన తయారైంది. జీవనది కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పుష్కర ఘాట్లు అపరిశుభ్రతకు నెలవులుగా మారి కాలుష్య కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. నగరంలో మురికినీరు నేరుగా గోదావరిలో కలవడం

Published : 28 Jun 2022 02:20 IST

ఈనాడు డిజిటల్‌ - రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే - రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

గోదావరి.. దేశంలో రెండో పెద్ద నది.. దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల జీవనాడి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న గోదావరి పరిస్థితి పేరుకే గొప్ప.. అనే చందాన తయారైంది. జీవనది కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పుష్కర ఘాట్లు అపరిశుభ్రతకు నెలవులుగా మారి కాలుష్య కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. నగరంలో మురికినీరు నేరుగా గోదావరిలో కలవడం, పేరుకుపోయిన వ్యర్థాలను నెలల తరబడి తొలగించకపోవటంతో కాలుష్యం కరాళనృత్యం చేస్తోంది. గోదావరి కాలుష్యం నివారణకు తలపెట్టిన నమామి గోదావరి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.

నల్లా ఛానల్‌ ద్వారా గోదావరిలో కలుస్తున్న మురుగు


సగమే శుద్ధి..

రాజమహేంద్రవరం నగర జనాభా... 4.5 లక్షలు. నగరం చుట్టూ 50కి పైనే పరిశ్రమలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల నుంచి రోజుకు 60 ఎంఎల్‌డీ మురుగు విడుదలవుతోంది. దానికి పారిశ్రామిక వ్యర్థాలు తోడవడం సమస్యగా మారింది. ఆవ ఛానల్‌ దగ్గర కేవలం 30 ఎంఎల్‌డీ ఎస్టీపీ ప్లాంట్‌ (మురుగునీటి శుద్ధీకరణ వ్యవస్థ) మాత్రమే ఉంది. మిగిలిన నీరు నల్లా ఛానల్‌ ద్వారా నదిలో కలుస్తోంది. దీంతో రోజుకు 30 ఎంఎల్‌డీ మురుగు నీరు సరాసరి గోదావరిలో కలిసి కాలుష్యం పెరుగుతోంది.


ముప్పన్నా.. ఉలకరే

గత పుష్కరాల వేళ జాతీయ కాలుష్య నియంత్రణ మండలి గోదావరిని పరిశీలించింది. నగరంలోని మురుగు నేరుగా నదిలో కలవడంతో కాలుష్య ముప్పు ఉంటుందని, మురుగు వచ్చే కాలువ వ్యవస్థను మెరుగుపరచాలని నివేదించింది. ఈ తరుణంలో నమామి గోదావరి ప్రాజెక్టులº మొదటి విడతలో కాలువల వ్యవస్థ ఆధునికీకరణతోపాటు.. మురుగును శుభ్రం చేసి నదిలో వదిలేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నగర భావి అవసరాల దృష్ట్యా ప్రస్తుత ఎస్టీపీకి అదనంగా.. 2021 నాటికి 40 ఎంఎల్‌డీ, 2030 నాటికి 60 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎస్టీపీలు నిర్మించాలన్న ప్రణాళిక గతంలో రచించినా కదలిక లేదు.


ప్రణాళికలే... పైసలు లేవు

పుష్కర ఘాట్‌ ఎగువన నదిలో కలుస్తున్న మురుగు

పూర్తిస్థాయిలో కాలుష్య నివారణ చేయాలంటే ఆవ ఛానల్‌ వద్ద ఎస్టీపీ ప్లాంట్‌ను ఆధునికీకరించాలి. మరోవైపు నగరంలో మురుగు నేరుగా నదిలో కలవకుండా పైపులైన్లను ఎనిమిది జోన్లుగా విభజించారు. ఆయా జోన్లలో కాలువలను విస్తరించాల్సి ఉంది.. వరద నీటిని స్టోరేజీ చేసేందుకు కంబాలచెరువు వద్ద పంపింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో కాతేరు, వీఎల్‌పురం, కోటిపల్లి బస్టాండ్‌ తదితర ప్రాంతాల మీదుగా వచ్చే మురుగును మళ్లించేందుకు కాలువల వ్యవస్థను మెరుగుపరచాలి.


ఆవ విస్తరణే కీలకం

ప్రధానంగా ఆవ కాలువ విస్తరణతో ధవళేశ్వరం దాటాకే మురుగు కలిసే ఏర్పాటు చేయాలి. ఈ పనుల కోసం నమామి గోదావరి పేరుతో నదీ స్వచ్ఛతకు నిధులు కేటాయించింది. మొత్తం రూ.400 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదించింది. తొలిగా రూ.వంద కోట్ల విడుదలకు అంగీకరించింది. దీంతో అధికారులు 87.16 కోట్లతో పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసినా.. డబ్బులు చేతికి రాలేదు.


నిర్వహణకు నీళ్లొదిలారు...

గోదావరి శుభ్రత విషయంలో వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే ఘాట్లు అపరిశుభ్రతకు నెలవుగా మారాయి. చెత్త, చెదారంతో నిండిపోయాయి. పర్వదినాల సమయంలో కూడా కనీసం శుభ్రం చేయటం లేదని భక్తులు వాపోతున్నారు. ప్రధానంగా గౌతమ, కోటిలింగాల ఘాట్లలో పరిశుభ్రతను గాలికొదిలేశారు. ఈ మురికి నీటిలోనే భక్తులు స్నానాలు చేస్తున్నారు. జల వనరుల శాఖ, నగరపాలక శాఖ రెండూ నిర్వహణను పట్టించుకోవటం లేదు. వెరసి మురుగు తొలగక.. నిర్వహణ లేక కాలుష్యంతో కునారిల్లుతున్నాయి.


చిక్కుల్లో ప్రజారోగ్యం..

వ్యర్థాలు- వ్యర్థ జలాల నిర్వహణ నిబంధనలు- 2016 జిల్లాలో పాలికలు.. పంచాయతీలూ పాటించడంలేదు. పరిస్థితి చక్కదిద్దాలని ఎన్జీటీ హెచ్చరిస్తున్నా కదలికలేదు. కాలుష్య నియంత్రణ మండలి నామమాత్ర తాఖీదులకు స్థానిక సంస్థలు స్పందించడంలేదు. పరిశ్రమలు, వ్యవసాయ, రసాయన కాలుష్య జలాలు.. నల్ల, ఆవ, ఏలేరు, పిఠాపురం, తుల్యభాగ, వృద్ధగౌతమి, శుద్ధగడ్డ, తిమ్మరాజు చెరువు ఇలా వివిధ పాయలు కాలువల ద్వారా గోదావరిలో కలిసి ప్రజారోగ్యం దెబ్బతింటోంది.


శుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం

గోదావరి కాలుష్యం, ఘాట్ల అపరిశుభ్రతపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించాను. నమామి గోదావరి నిధులు త్వరలో విడుదలవుతాయి. నిధులు వచ్చిన వెంటనే పనులు మొదలు పెడతాం. అన్ని ఘాట్ల నిర్వహణపై కూడా దృష్టిపెడతాం. పర్వదినాలతో సంబంధం లేకుండా శుభ్రంగా ఉంచుతాం.

- కె.మాధవీలత, కలెక్టర్‌, తూ.గో.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని