logo

తుని చెంతన పులి కలకలం

ఇన్నాళ్లూ అటవీ ప్రాంతంలో సంచరించి, రెండు రోజులుగా ఆనవాళ్లు లేకుండాపోయిన పెద్దపులి సోమవారం రాత్రి పాదముద్ర ద్వారా ప్రజలు, అధికారులను ఉలికిపాటుకు గురిచేసింది. తుని మండలంలో కొండల మాటున పాదముద్రలు కనిపించడంతో

Published : 28 Jun 2022 02:20 IST

కొలిమేరు-కుచ్చర్లకొండ సమీపంలో పెద్దపులి పాదముద్ర

తుని గ్రామీణం, రౌతులపూడి, ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ఇన్నాళ్లూ అటవీ ప్రాంతంలో సంచరించి, రెండు రోజులుగా ఆనవాళ్లు లేకుండాపోయిన పెద్దపులి సోమవారం రాత్రి పాదముద్ర ద్వారా ప్రజలు, అధికారులను ఉలికిపాటుకు గురిచేసింది. తుని మండలంలో కొండల మాటున పాదముద్రలు కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో కలవరం మొదలైంది. సోమవారం రాత్రి సమయంలో కొలిమేరు-కుమ్మరిలోవ సమీపంలోని కుచ్చర్లకొండ వద్ద పెద్దపులి రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా ఆటుగా వెళ్తున్న ప్రైవేటు బస్సులోని ప్రయాణికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలోని పెద్దపులి జాడను గుర్తించే ప్రయత్నం చేశారు. కొండల సమీపంలో పులిపాద ముద్రలు గుర్తించిన స్థానిక అటవీ శాఖ సిబ్బంది వెంకటరమణ, సంధ్య, శివలు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. మంగళవారం ఉన్నతాధికారులు ఈ ప్రాంతంలో జల్లెడ పట్టనున్నారు. తుని పట్టణంలోని కొట్టాం బస్టాండ్‌ వద్ద నుంచి కుమ్మరిలోవ, కొలిమేరు వెళ్లే మార్గంలో ప్రయాణికులు వెళ్లవద్దంటూ పోలీసులు అప్రమత్తం చేశారు. బెంగాల్‌ టైగర్‌ అటవీ ప్రాంతం నుంచి మెట్టప్రాంత మైదానంలోకి అడుగుపెట్టడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అలజడి తప్ప అలికిడి శూన్యం: కంటికి కనిపించకుండా, సీసీకెమెరాలకు చిక్కకుండా పాదముద్రలతోనే అలజడి రేపుతూ, అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న పులి సంచార తీరు ఆందోళనకరంగా ఉంది. మూడు రోజులు ఎస్‌.పైడిపాలలో సంచరించాక ఎ.మల్లవరం, లచ్చిరెడ్డిపాలెం గ్రామాల వెంబడి తిరిగింది. పొలాల్లో, వాగుల వెంట తిరిగిన పులి ఆనవాళ్లు సోమవారం రాత్రి వరకు లభ్యంకాలేదు. పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నామని ఏలేశ్వరం రేంజర్‌ జె.శ్రీనివాస్‌ తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని