logo

‘తెర’పడని కష్టాలు

సినీ పరిశ్రమను కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్న.. మొన్నటి వరకు కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా ప్రదర్శనలు నిలిచిపోయాయి. తీరా పరిస్థితి సద్దుమణిగిన తరువాత కొత్త నిబంధనలు అమలు.. టికెట్ల ధరల తగ్గింపుతో థియేటర్ల

Updated : 28 Jun 2022 07:05 IST

గాంధీనగర్‌, రామచంద్రపురం, న్యూస్‌టుడే: సినీ పరిశ్రమను కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్న.. మొన్నటి వరకు కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా ప్రదర్శనలు నిలిచిపోయాయి. తీరా పరిస్థితి సద్దుమణిగిన తరువాత కొత్త నిబంధనలు అమలు.. టికెట్ల ధరల తగ్గింపుతో థియేటర్ల యాజమాన్యాలు కుదేలయ్యాయి. తాజాగా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఏపీఎఫ్‌డీసీ ద్వారా టికెట్ల అమ్మకాలు చేయాలని ఒప్పందం కోసం ప్రయత్నిస్తుండటం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైందని థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వాపోతున్నారు.

నష్టాల నుంచి గట్టెక్కకుండానే..

కొవిడ్‌ వేళ లాక్‌డౌన్‌తో సినిమాల విడుదల ఆగింది. థియేటర్లు మూతపడి వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు.అనంతరం థియేటర్లు తెరిచినా కొవిడ్‌ నిబంధనల పేరుతో 50 శాతం ఆక్యుపెన్సీతో నష్టాల్లో నడిచాయి. ఈ పరిస్థితుల్లో టికెట్ల ధరలు తగ్గించడంతో ఉక్కిరిబిక్కిరైన యజమానులు థియేటర్లను మూసివేశారు. అనంతరం జరిగిన చర్చల్లో కొంత మేర పెంచి ఊరట కల్పించినా మళ్లీ ఇప్పడు కొత్తగా జీవో తెచ్చి తమ ఆధ్వర్యంలోనే టికెట్ల అమ్మకాలు జరగాలని చెప్పడం థియేటర్ల యజమానులను కలవరపెడుతోంది.

టికెట్ల డబ్బులు ఎప్పుడిస్తారో..

రాష్ట్ర చలనచిత్ర అభివృద్ది మండలి ఆధ్వర్యంలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మడం సరే,  అమ్మిన టికెట్ల డబ్బులు ఎప్పుడు తిరిగిస్తారోనని వారు వాపోతున్నారు. ఇవాళ టికెట్లు అమ్మితే తర్వాత రోజు సొమ్మును థియేటర్ల ఖాతాల్లో జమ చేస్తామన్నా సంశయిస్తున్నారు. కాకినాడ జిల్లాలో 45, కోనసీమ జిల్లాలో 56, తూ.గో. జిల్లాలో 33 థియేటర్లకు సొమ్ములు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండిపోతాయనీ, తాము వ్యాపారం చేసేదెలాగని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీఎఫ్‌డీసీ రూపొందించిన ఎంవోయూలపై సంతకాలు చేయాలని ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులపై ఒత్తిడి పెరిగింది. జూన్‌ 2న ఇచ్చిన జీవో, దానికి అనుబంధంగా ఒప్పందం రూపొందించి సంతకాలు చేయాలని చెప్పడంపై ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. థియేటర్‌ నిర్వహణకు రోజువారీ ఖర్చులుంటాయని, ఆన్‌లైన్‌లో జమైన మొత్తం ఒకవేళ నిలిచిపోతే సమస్యలు తప్పవని చెబుతున్నారు.

సమస్య పరిష్కరించాలని వినతి

ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై ఉన్న నిబంధనలు, ఎంవోయూలపై చేస్తున్న ఒత్తిడిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించిన ఉమ్మడి జిల్లాలోని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు సోమవారం రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఎంవోయూలపై అధికారులు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, నిబంధనలు పూర్తిగా ఎఫ్‌డీసీకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు చేస్తే ముందురోజు అమ్మకాల సొమ్ము తరువాత రోజున జమ చేస్తామంటున్నారని వీటిపై తమకు స్పష్టత లేనందున పునః సమీక్షించాలని కోరినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని