logo

‘బొండు ఇసుక పేరుతో ఇదేం దోపిడీ’

అనుమతులు లేకుండా గోదావరి నదీగర్భంలో ఇసుక తవ్వకాలు చేసి ఇతర జిల్లాలకు రవాణా చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని తవ్వకాలు చేసే చోటుకు వెళ్లేందుకు వచ్చిన తెదేపా బృందాన్ని శుక్రవారం ఉదయం పోలీసులు

Published : 02 Jul 2022 03:29 IST

తెదేపా బృందంతో మాట్లాడుతున్న డీఎస్పీ, తదితరులు

సీతానగరం, న్యూస్‌టుడే: అనుమతులు లేకుండా గోదావరి నదీగర్భంలో ఇసుక తవ్వకాలు చేసి ఇతర జిల్లాలకు రవాణా చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని తవ్వకాలు చేసే చోటుకు వెళ్లేందుకు వచ్చిన తెదేపా బృందాన్ని శుక్రవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. నదీగర్భంలో ఉన్న అక్రమ తవ్వకాలను ఆధారాలతో సహా చూపిస్తామంటూ తమతోపాటు పోలీసులు కూడా లోపలకు రావాలని బృందం కోరినా పోలీసు యంత్రాంగం అంగీకరించలేదు. సీతానగరం మండలంలోని కాటవరం రేవులో గతేడాది ఉమ్మడిజిల్లాగా ఉన్నప్పుడు కలెక్టర్‌ ఇచ్చిన బొండు ఇసుక రవాణాకు సంబంధించిన ఆదేశాలతో ప్రస్తుత సీతానగరం తహసీల్దార్‌ తెల్లకాగితంపై ఇచ్చిన అనుమతితో ఇసుకను విశాఖపట్నానికి ఎలా రవాణా చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ తెదేపా శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. అప్పటికే ఉత్తరమండల డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రేవు లోపలకు వెళ్లడానికి వీలులేదంటూ నిరోధించడంతో రోడ్డుపైనే ఆందోళనకారులు ఉండిపోయారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటేష్‌ మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణాల పేరుతో ఇసుకను అడ్డుగోలుగా దోచేస్తున్నారన్నారు. పునాదుల్లో వేసేందుకు ఉపయోగించే బొండు ఇసుక రవాణా చేస్తుంటే 30 టన్నుల బరువుతో వెళ్లే  లారీలకు జేపీ వెంచర్స్‌ స్లిప్‌లు ఎందుకు పంపిణీ చేస్తున్నారన్నారు.  గనులశాఖ నుంచి తవ్వకాలకు అనుమతులు లేకుండా ప్రైవేటు భూముల్లో ప్రైవేటు వ్యక్తులు దందా చేసి అడ్డుగోలుగా దోచేయడం ఆధారాలతో సహా చూపిస్తామంటూ తామంతా వచ్చినా రేవులోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారన్నారు. ఆర్‌ఐ గంగరాజు, వీఆర్వో అఖిల్‌ సంఘటనా స్థలానికి వచ్చి గతేడాది అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ బొండు ఇసుక రవాణా చేసుకునేలా అనుమతులిచ్చారన్నారు. అయితే అప్పట్లో గోదావరికి వరద రావడం వల్ల ఇసుకను తవ్వలేదన్నారు. ఆ ఆదేశాలను అనుసరించే ప్రస్తుత సీతానగరం తహసీల్దారు ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక రవాణాకు ఆదేశాలు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యేకు వివరించే ప్రయత్నం చేశారు. అనంతరం కలెక్టర్‌ మాధవీలతను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు చిట్టూరి రంగారావు, కాండ్రు శ్రీనివాసరావు, గద్దే సురేష్‌, గూడపాటి శ్రీనివాసు, దాసరి కోటేశ్వరరావు, బండి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని