logo

Andhra News : గురి పెట్టారు.. గ్రూప్స్ కొట్టారు

లక్ష్యంపై స్పష్టత.. ప్రణాళికబద్ధమైన కృషి ఉంటే విజయం వరిస్తుందని వారంతా నిరూపించారు.. మంగళవారం వెలువడిన 2018 ఏడాదికి సంబంధించిన గ్రూప్‌-1 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వాసులు సత్తా చాటారు.. ఒకరు రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం కైవసం చేసుకుంటే.. మరో ఇద్దరు అధికారులుగా ఎంపికయ్యారు.

Updated : 06 Jul 2022 09:35 IST

లక్ష్యంపై స్పష్టత.. ప్రణాళికబద్ధమైన కృషి ఉంటే విజయం వరిస్తుందని వారంతా నిరూపించారు.. మంగళవారం వెలువడిన 2018 ఏడాదికి సంబంధించిన గ్రూప్‌-1 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వాసులు సత్తా చాటారు.. ఒకరు రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం కైవసం చేసుకుంటే.. మరో ఇద్దరు అధికారులుగా ఎంపికయ్యారు.

పట్టుదలతో రాణింపు

భర్త, కుమారుడితో గ్రూప్‌-1 టాపర్‌ రాణి సుస్మిత

పిఠాపురం: పట్టుదలతో సాధన చేసిన పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత గ్రూప్‌-1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించారు. రెండో ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో నిలిచారు.

 సైన్సు విద్యార్థి..: రాణి సుస్మిత చిన్నతనం నుంచి పిఠాపురంలోనే చదువుకున్నారు. ఇంటర్‌, డిగ్రీ కాకినాడ, పీజీ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, పీహెచ్‌డీ ఎన్‌ఐటీ తిరుచునాపల్లి(తమిళనాడు)లో పూర్తిచేశారు. సుస్మిత తాతయ్య పిఠాపురంలోని మున్సిపల్‌ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. అయన సూచనలతోనే చదువుపై ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి శ్రీనివాసు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆమెతోపాటు చెల్లి శృతిని చదివించారు. తల్లి పద్మప్రియ గృహిణి.ఉపాధ్యాయులైన మామయ్యలు శ్రీకాంత్‌, ఉమాకాంత్‌ సూచనలతో గ్రూప్సుపై ఆసక్తి పెంచుకున్నారు. పీహెచ్‌డీ తరువాత విశాఖపట్నానికి చెందిన రవికాంత్‌తో వివాహమైంది. వారికి ప్రస్తుతం కుమారుడు సురవ్‌ కాశ్యప్‌ ఉన్నారు. రాణి సుస్మిత ప్రస్తుతం హైదరాబాద్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ)లో, భర్త రవికాంత్‌ కర్ణాటకలోని ఓ కళాశాలలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు

 ఎంతో శ్రమించా: రోజుకు 18 గంటలు చదివా. ఎక్కడా కోచింగ్‌ తీసుకోకుండా పుస్తకాలపై పట్టు సాధించా. నేరుగా డిప్యూటీ కలెక్టర్‌ హోదా దక్కడం సంతోషాన్నిచ్చింది. పరిపాలనా విభాగంలో చేరి పేదలకు సేవ చేయాలనేది నా లక్ష్యం. ఐఏఎస్‌ చేయాలనేది మా తాత శర్మ కోరిక.

-రాణి సుస్మిత


కల నెరవేరిందిలా...

టి.నగర్‌, న్యూస్‌టుడే: కోరుకొండకు చెందిన గ్రంథి వెంకటేష్‌ గ్రూప్‌1 ఫలితాల్లో విజయం సాధించి.. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈయన తల్లిదండ్రులు సత్యనారాయణ, లక్ష్మీ. తండ్రి వ్యవసాయం చేస్తుంటారు. ప్రాథమిక విద్య గుమ్ములూరు ప్రభుత్వ పాఠశాలలో సాగింది. కోరుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఈయన ఇంజినీరింగ్‌ చదివారు.

ఉద్యోగం చేస్తూ: అయిదేళ్ల క్రితం ఎఫ్‌సీఐలో కొలువునకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ధవళేశ్వరం ఎఫ్‌సీఐ గోదాములో ఉద్యోగి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఒకపక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే గ్రూప్స్‌1 కు సిద్ధమయ్యారు.

విజేత మాట: ఏదైనా సాధించాలంటే వంద శాతం గురిపెట్టి చదవాలి.  ప్రజా పరిపాలన విభాగంలో చేరాలనే ఆలోచన నాలో పట్టుదల పెంచింది. ఆ హోదా ఉంటేనే ప్రజా సేవ చేయడం సాధ్యమవుతుందని తెలుసుకున్నా.


సాఫ్ట్‌వేర్‌ నుంచి డీఎస్పీగా ఎంపిక

రాయవరం:  రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన అనసూరి బాల సుభ పృథ్వీతేజ గ్రూప్‌-1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. తండ్రి అనసూరి వెంకటరమణ ఎస్సైగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం బాపట్లలో ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీగా పని చేస్తున్నారు. పృథ్వీతేజ  హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూÆట్ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌, 2015లో విశాఖపట్నంలోని గీతంలో ఎంటెక్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కంప్యూటర్‌ ఇంజినీరుగా చేస్తున్నారు.

సివిల్స్‌కు: పృథ్వీతేజ 2016లో సివిల్స్‌కు చెన్నైలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో చేరారు. ఆ సమయంలో గ్రూప్‌-1(2016) మెయిన్స్‌ ఉత్తీర్ణత సాధించారు. మౌఖిక పరీక్షల్లో విజయం సొంతం కాలేదు. మరింత దీక్షతో గ్రూప్‌-1కు సన్నద్ధమవుతూనే సాఫ్ట్‌వేర్‌ రంగంలో పని చేశారు. 2018 గ్రూప్‌1లో  విజయం సాధించారు.

నేరుగా డీఎస్పీగా ఉద్యోగాన్ని ప్రారంభించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తానని పృథ్వీతేజ చెప్పారు.


ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి రెవెన్యూకి..

ఈనాడు, కాకినాడ: కాకినాడ జిల్లా రవాణాశాఖ డీటీసీ మోహన్‌ కుమార్తె ఆదిమూలం సాయిశ్రీ గ్రూప్‌-1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికయ్యారు. 2015లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఈమె.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోనూ ఎంఏ టాపర్‌గా నిలిచారు. ఈమె 2019లో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగం సాధించారు. ఐఏఎస్‌ అవ్వాలన్నదే తన లక్ష్యమని సాయిశ్రీ చెప్పారు. ఆర్డీవోగా ఉద్యోగంలో చేరినా.. సివిల్స్‌కు ప్రిపేర్‌ అయి ఐఏఎస్‌ లక్ష్యాన్ని చేరుకుంటానని వెల్లడించారు. అమ్మనాన్న మోహన్‌, సునీత అడుగడుగునా ప్రోత్సహించారని ఆమె చెప్పారు. తిరుపతి గ్రామీణ మండలం చంద్రగిరి తాలూకా కాల్లూరు సాయిశ్రీ స్వగ్రామం. రవాణాశాఖ కాకినాడ జిల్లా ఉప కమిషనర్‌ ఎ.మోహన్‌ కుమార్తె సాయిశ్రీ. తన కుమార్తె సాయిశ్రీ రాష్ట్రస్థాయిలో పదో ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని డీటీసీ మోహన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని