ఆర్టీసీ.. గొయ్యో మొర్రో..
అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని.. అధ్వాన రహదారులు పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. గుంతల దారుల్లో రాకపోకల్లో ప్రతిబంధకాలు, ప్రమాదాలు ఇబ్బందిగా మారాయి. బస్సుల నిర్వహణ భారం సంస్థపై తీవ్రంగా పడుతోంది. దెబ్బతిన్న దారుల్లో ప్రభుత్వ
ఈనాడు, రాజమహేంద్రవరం- న్యూస్‌టుడే, వి.ఎల్.పురం, నిడదవోలు
రాజమహేంద్రవరం డిపోలోని గ్యారేజిలో మరమ్మతులు
అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని.. అధ్వాన రహదారులు పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. గుంతల దారుల్లో రాకపోకల్లో ప్రతిబంధకాలు, ప్రమాదాలు ఇబ్బందిగా మారాయి. బస్సుల నిర్వహణ భారం సంస్థపై తీవ్రంగా పడుతోంది. దెబ్బతిన్న దారుల్లో ప్రభుత్వ వాహనమైనా.. ప్రైవేటు వాహనమైనా కష్ట- నష్టాల ప్రయాణం తప్పడం లేదు. వాహనాల నిర్వహణకే అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. వర్షాలు, వరదలకు రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణం దినదిన గండంలా మారింది.
ఒడుదొడుకుల ప్రయాణం..
గతేడాది అక్టోబరు 20
రావులపాలెం మండలం రావులపాడు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న పల్లె వెలుగు బస్సు రెండు టైర్లూ ఒక్కసారిగా ఊడిపోయాయి. గుంతల రహదారుల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. వాహనాన్ని డ్రైవర్ నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఏడాది మే 6
గోకవరం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే దారిలో గుమ్మళ్లదొడ్డి సమీపంలో ఆర్టీసీ బస్సు ముందు చక్రం టైరు పంక్చర్ అయ్యింది. ప్రత్యామ్నాయంగా మరో బస్సులోకి ఎక్కించి పంపించే వరకు ప్రయాణికులు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది.
జూన్ 14
తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు చక్రం నిడదవోలు మండలం బసివిరెడ్డిపేట సమీపంలో ఊడింది. ప్రయాణికులు ఉలికిపాటుకు గురయ్యారు.
జులై 24
గోకవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దేవీపట్నం మండలంలో గంటి వద్ద అదుపు తప్పింది. అధ్వాన రహదారిలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో రోడ్డు పక్కన బస్సు ఆగి.. గండం తప్పింది.
రావులపాలెం మండలం రావులపాడు వద్ద గోతుల ప్రభావంతో బస్సు చక్రాలు ఊడిపోయాయిలా.. (పాత చిత్రం)
ప్రయాణం సురక్షితమేనా..?
ఆర్టీసీ ప్రయాణం శుభప్రదం- సుఖమయం- సురక్షితం.. ఇదీ సంస్థ నినాదం. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి.
* సీతానగరం, కాకినాడ, కోనసీమ వైపు వెళ్లే పలు మార్గాల్లో.. జంగారెడ్డిగూడెం- నిడదవోలు మార్గంలో ప్రయాణం సాఫీగా సాగడంలేదు. సమయానికి గమ్యస్థానాలకు చేర్చలేని పరిస్థితి. ఆయా రూట్లలో ట్రిప్పుకు 25- 30 నిమిషాల వరకు ఆలస్యమవుతున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు.
* పెద్దాపురం-కాట్రావులపల్లి, రాచపల్లి-శాంతిఆశ్రమం, ఒమ్మంగి-శాంతిఆశ్రమం, ఉత్తరకంచి- పెద్దిపాలెం, ఉప్పాడ- నేమాం, తూరంగి-నడకుదురు, శంఖవరం-రౌతులపూడి, శంఖవరం-శాంతిఆశ్రమం రోడ్లు దెబ్బతినడంతో అవస్థలు తప్పడంలేదు.
* సీతానగరం, పురుషోత్తపట్నం మార్గాల్లో బస్సుల కట్టలు విరగడం, టైర్లు పంక్చర్ లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాతేరు నుంచి సీతానగరం వరకు రోడ్లు దెబ్బతినడం ఇబ్బందిగా మారింది. 32 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు చక్రం ఊడిపోయింది. మరో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొని ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది.
సీతానగరం వెళ్లే రోడ్డులో ఇదీ పరిస్థితి..
బస్సులు దెబ్బతింటున్నాయ్..
గుంతల దారుల్లో రాకపోకలతో బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. బస్సుల కేఎంపీఎల్ పడిపోతోంది. టైర్లు అరిగిపోవడం... గేర్ బాక్సుల్లో సమస్యలు తలెత్తడం... లీప్‌స్ప్రింగులు దెబ్బతినడం.. పీపీ సేఫ్టీ జాయింట్లు, బేరింగ్‌లు
వదిలేయడం..
* తూగో పరిధిలో మరమ్మతులకే ఏటా రూ. కోటి వరకు ఆర్టీసీ వెచ్చిస్తోంది. ఏడాదిలో నాలుగు డిపోల్లో 70 బస్సులు దెబ్బతిన్నాయి. కేఎంపీఎల్ సగటున 20 పాయింట్ల వరకు పడిపోయింది. అధ్వాన రోడ్లతో రోజుకు వెయ్యి లీటర్లకుపైగా అదనంగా డీజిల్ ఖర్చవుతోంది.
* కాకినాడ జిల్లాలోని డిపోల్లో బస్సులకు ఎక్కువగా టైర్లు, కమాన్ కట్‌లు, స్ప్రింగ్‌లు దెబ్బతింటున్నాయి. గడచిన మూడు నెలల్లో విడి భాగాలు, టైర్లకు రూ.82 లక్షలు, వర్క్‌షాప్ నిర్వహణకు రూ.72 లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. స్పేర్‌పార్టుల ఖర్చు పెరుగుతోంది.
* రాజోలు డిపోలో బస్సు కమాన్‌కట్టలు, టైర్లు, అద్దాలు ఊడిపోవడం, ఇంజిన్లు మరమ్మతులు లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అమలాపురం డిపో పరిధిలో 136 బస్సులు తిరుగుతుంటే.. బస్సుల నిర్వహణకు అదనంగా రూ.30 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
- షర్మిలాఅశోకా, జిల్లా ప్రజా రవాణా అధికారి, తూగో జిల్లా
దెబ్బతిన్న మార్గాల్లో తిరిగే బస్సుల డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నాం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంపైనే దృష్టిసారించాం. ప్రత్యేక డ్రైవ్ పెట్టి బస్సులన్నీ పూర్తి కండీషన్‌లోకి తెచ్చాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.