logo

ఇంటి ముంగిటకే వైద్యసేవలు

గ్రామీణ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాల్లో ఇకపై వారానికి రెండుసార్లు వైద్యుడు ఓపీ చూడడంతోపాటు క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో

Published : 06 Aug 2022 06:39 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

గ్రామీణ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాల్లో ఇకపై వారానికి రెండుసార్లు వైద్యుడు ఓపీ చూడడంతోపాటు క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు రిసోర్సు పర్సన్లతో శిక్షణ ఇప్పించారు. 104 వాహనం, వైద్యుడు, మిడ్‌లెవిల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తతో కూడిన బృందాలు గ్రామాల్లో పర్యటించి వైద్యసేవలందిస్తాయి.

ఇలా చేస్తారు..
జిల్లాలోని పీహెచ్‌సీల్లో ఇద్దరేసి వైద్యులు అందుబాటులో ఉన్నారు. రోస్టర్‌ ప్రకారం వారి పరిధి గ్రామాల్లోని వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలందించాలి. ఒకరు పీహెచ్‌సీలో ఉంటే మరొకరు ఆయా సచివాలయాల పరిధిలో ఓపీ చూడాల్సి ఉంటుంది. ఆయా ఆరోగ్య కేంద్రంలో ఉదయం ఓపీ చూసి, మధ్యాహ్నం నుంచి గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగులకు ఆరోగ్య అవగాహన, పాఠశాలల్లో చిన్నారులకు సూచనలు, అంగన్‌వాడీల సందర్శనతోపాటు పక్షవాతం వంటి రోగాలతో కదల్లేని స్థితిలో ఉండే రోగులకు ఇంటికొచ్చి చికిత్స చేయడం వంటి కార్యక్రమాలు చేస్తారు. ఇలా రోస్టర్‌ ప్రకారం ఆ పీహెచ్‌సీ పరిధిలో ఉన్న గ్రామాల్లో వారానికి ఒకటి నుంచి రెండుసార్లు పర్యటించనున్నారు.

14 రకాల వ్యాధులకు
ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు  వైద్యులు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. మిడ్‌లెవిల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు, ఏఎన్‌ఎంల సేవలు కీలకం కానున్న నేపథ్యంలో వారికి అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, మానసిక, నేత్ర,  హెచ్‌ఐవీ,  వంటి 14 రకాల వ్యాధులకు చికిత్స అందించేలా ప్రణాళిక చేశారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలోని 201 గ్రామ సచివాలయాలు ఉండగా 104 వాహనాలు 21 ఉన్నాయి. ఒక సర్వజన ఆసుపత్రి, ఆరు సీహెచ్‌సీలు, 35 పీహెచ్‌సీలున్నాయి.  సచివాలయాల కేంద్రంగా  ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తారు. మధుమేహం, రక్తపోటు, పలు రకాల రక్తపరీక్షలు చేస్తారు. 72 రకాల మందులు ఉచితంగా ఇస్తారు.


క్షేత్రస్థాయిలో మెరుగైన విధానం
-డాక్టర్‌ వసుంధర, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో

గ్రామాల్లో క్షేత్రస్థాయిలో మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం కుటుంబ వైద్యం విధానాన్ని తీసుకొచ్చింది.  దానికి సంబంధించి  బృందాల ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీకీ వెళ్లడానికి అవ్వని వారికి ఇది ఎంతో ఉపయుక్తం. సద్వినియోగం చేసుకోవడంతోపాటు ఆరోగ్య అవగాహన పెంపొందించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని