logo

కుట్లు..పచ్చ నోట్లు

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: అదేంటో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువ సంఖ్యలో ఉంటే.. ప్రైవేటు హాస్పిటళ్లలో మాత్రం సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ మర్మమేంటో తెలియక సామాన్యులు తికమకపడుతుంటారు..

Updated : 08 Aug 2022 06:42 IST

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: అదేంటో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువ సంఖ్యలో ఉంటే.. ప్రైవేటు హాస్పిటళ్లలో మాత్రం సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ మర్మమేంటో తెలియక సామాన్యులు తికమకపడుతుంటారు.. సాధారణంగా నగదు చెల్లించే సేవలు నాణ్యమైనవిగా ఉంటాయని నమ్ముతారు.. అందుకే డబ్బులు ఖర్చయినా, సురక్షిత వైద్య సేవలు అందుతాయని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తారు.. తీరా అక్కడ చాలా కేసుల్లో కత్తెరకే పని చెబుతున్నారు. సిజేరియన్లు చేయడంలో ఎప్పటికప్పుడు వారి రికార్డులను వారే తిరగరాస్తున్నారు.

కత్తెరకే మొగ్గు..
2021-22 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రసవాలకు సంబంధించిన గణాంకాలు చూస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఉమ్మడి జిల్లాలో ఏటా 60 నుంచి 80 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రి, జీజీహెచ్‌ కలిపి 190 ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయి. వసతులు మెరుగవ్వడంతో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. 2021-22లో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 33,934 కాన్పులు జరిగితే అందులో 66.5 శాతం సాధారణ ప్రసవాలే. అత్యవసరమైతేనే ఇక్కడి వైద్యులు శస్త్రచికిత్స వైపు మొగ్గు చూపారు.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్న సందర్భాల్లో సైతం సిజేరియన్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,064 ప్రైవేటు ఆసుపత్రులుంటే.. అందులో మూడు వందల వరకు గైనిక్‌ సేవలు అందజేసేవి ఉన్నాయి. వీటిలో 2021-22లో 39,478 ప్రసవాలు జరిగితే అందులో 62.8 శాతం సిజేరియన్లే ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ ప్రసవమైతే తక్కువ రుసుములుంటాయి కాబట్టి.. శస్త్రచికిత్సల వైపు మొగ్గుతున్నారు. ఒక్కో సిజేరియన్‌కు రూ.50వేల నుంచి రూ.లక్ష తీసుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు గది అద్దె, మందులు, ఇతర ఖర్చులు అదనంగా వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రసవమైతే రెండు రోజుల్లో డిశ్ఛార్జి అవుతారు. శస్త్రచికిత్సకు కనీసం వారం ఆసుపత్రిలో ఉండాల్సిందే.. కాబట్టి ఎక్కువ మొత్తం బిల్లులకు అవకాశం ఉంటుంది.  దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది. పర్యవేక్షణ లేక ఏ వైద్య సేవకు ఎంత ఖర్చు అవుతుందో డిస్‌ప్లే బోర్టులపై ప్రదర్శించాలన్న నిబంధన పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.


చర్యలు తీసుకుంటాం..
ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్దేశించిన రుసుములే వసూలు చేయాలి. కొన్ని ఆసుపత్రుల్లో ఫీజులు భారీగా తీసుకుంటున్నారని తెలిసింది. వారిపై చర్యలు తీసుకుంటాం. అవసరం లేకున్నా సిజేరియన్లు చేయడం సరికాదు. బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. -డాక్టర్‌ రమేష్‌, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని