logo

అన్నదాత.. కృషీభవ

మట్టిలో తిరుగుతూ.. మట్టికోసం బతుకుతూ.. మట్టినే దైవంగా కొలుస్తూ.. పైరును ప్రాణంగా భావిస్తూ.. స్వేదంతో నేలను తడుపుతూ సిరులు పండిస్తున్నారు రైతు మారాజులు..

Published : 10 Aug 2022 06:13 IST

ఈనాడు - రాజమహేంద్రవరం -న్యూస్‌టుడే, కడియం

మట్టిలో తిరుగుతూ.. మట్టికోసం బతుకుతూ.. మట్టినే దైవంగా కొలుస్తూ.. పైరును ప్రాణంగా భావిస్తూ.. స్వేదంతో నేలను తడుపుతూ సిరులు పండిస్తున్నారు రైతు మారాజులు.. వాన చుక్క ముఖం చాటేసినా.. కరవు కన్నెర్రజేసినా.. గిట్టుబాటు దక్కపోయినా.. అప్పులు మెడకు చుట్టేసినా.. హలధారి అకుంఠిత దీక్షే అందరికీ బువ్వ పెడుతోంది. మార్పులు ఒడిసి పడుతూనే కర్షకులు ముందడుగు వేస్తున్నారు. ఇదేతరుణంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు చేదోడుగా నిలిచి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పథకాలు, సేవలు రైతులకు చేరువ చేసి వ్యవసాయ రాబడి పెంచితే..  సాగు సువర్ణమే.

హరిత విప్లవం..
ధాన్యాగారంగా పేరొందిన ఉమ్మడి తూ.గో. పేరు సార్థకత చేయడంలో అన్నదాతల కృషి ఎనలేనిది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టి.. మంచి దిగుబడి సాధిస్తూ.. హరిత విప్లవానికి నాంది పలికారు. సేంద్రియ సాగు నుంచి.. ఆధునిక వ్యవసాయ విధానాల వరకు అన్నింటినీ అందిపుచ్చుకుని హలధారులు ముందుకు సాగారు. ప్రస్తుతం పెట్టుబడుల భారం.. కూలీల కొరత సవాళ్లతో ముందుకు ‘సాగు’తున్నారు.

కోనసీమ సిరి.. కొబ్బరి..
కొబ్బరి సాగులో రాష్ట్రంలో మనదే అగ్రస్థానం. కొబ్బరి పంట ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా మూడు లక్షల మందికి ఉపాధి చూపిస్తోంది. స్వాతంత్య్రానికి ముందు రవాణా వ్యవస్థ అంతగాలేని రోజుల్లో కొబ్బరి రైతులు పంటను జలరవాణా ద్వారా పడవలపై రాజమహేంద్రవరం తీసుకెళ్లి.. ఆపై రైలులో ఇతర రాష్ట్రాలకు పంపేవారు. తర్వాత కాలంలో రావులపాలెం- సిద్ధాంతం వంతెన నిర్మాణంతో రవాణా వ్యవస్థ మెరుగయి వ్యాపారం ఊపందుకుంది. ఎగుమతులు: ఒడిశా, బిహార్‌, ఝార్ఖండ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, దిల్లీ, హరియాణా, చైనాకు వెళ్తున్నాయి.

* కొబ్బరి పంటను విస్తరించి.. నాణ్యమైన కొబ్బరి నారును పరిశోధనల ద్వారా ఉత్పత్తి చేయాలి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా కొబ్బరి అనుబంధ, ఉప ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేసి ప్రోత్సహించాలి. కేంద్ర ప్రభుత్వం ‘ఒక జిల్లా- ఒక ఉత్పత్తి’ నినాదంతో కొబ్బరి పంటను ఎంపిక చేసిన వేళ మరింత ఊతమివ్వాలి.

సాగు పథం మారిందిలా...
స్వాతంత్య్రానికి పూర్వమే ధవళేశ్వరం వద్ద కాటన్‌ మహాశయుడు ఆనకట్టను నిర్మించారు.  ధవళేశ్వరం ఆనకట్ట 1862 నుంచి అందుబాటులోకి రాగా.. ఉమ్మడి జిల్లాలో అప్పట్లో  1.25 లక్షల హెక్టార్లలోనే సాగు చేసేవారు. స్వాతంత్య్రం వచ్చిన 35 ఏళ్ల వరకు ఈ విధానం కొనసాగింది. తర్వాత 1970- 82 మధ్యన నూతన ఆనకట్ట నిర్మాణంతో 1982 నుంచి ఆయకట్టు స్థిరీకరణ జరిగి.. ఉమ్మడి తూ.గో.లో 2.29 లక్షల హెక్టార్ల వరకు సాగు విస్తీర్ణం పెరిగింది.

విస్తీర్ణం తగ్గి.. దిగుబడి పెరిగి..
సాగులో మూడు దశాబ్దాలుగా భారీ మార్పులు వచ్చాయి. అంతకుముందు సాగులో దేశవాళీ వరి వంగడాలదే ప్రధాన భూమిక. వీటితో ఖరీఫ్‌లో ఎకరాకు 20 బస్తాలు, రబీలో 30 బస్తాలకు దిగుబడి రాని పరిస్థితి. ఆపై పరిశోధనల ఫలితం, మేలైన వంగడాల రూపకల్పనతో నూతన వరి వంగడాలు వచ్చి దిగుబడులు పెరిగాయి. ఖరీఫ్‌లో ఎకరాకు 30-35 బస్తాలు, రబీలో 45-50 బస్తాల దిగుబడి దరి చేరుతోంది.

ప్రకృతి సేద్యమే ముద్దు...
ఉమ్మడి జిల్లాలో యూరియా, డీఏపీ, ఎంవోపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు 2.23 లక్షల మెట్రిక్‌ టన్నుల అవసరం ఉంటే.. గత 20 ఏళ్లుగా అంతకుమించి వాడేశారు. దిగుబడులపై అత్యాశ ఫలితంగా పెట్టుబడి ఖర్చులు పెరిగి.. భూసారం దెబ్బతింటోంది. నేల తల్లికి జరుగుతున్న నష్టాన్ని గుర్తిస్తున్న రైతులు ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రకృతి సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం 1.24 లక్షల ఎకరాల్లో  ప్రకృతి వ్యవసాయాన్ని 1.08 లక్షల మంది చేస్తున్నారు.

పెద్ద కమతాలు కనుమరుగు..
గతంలో 5-15 ఎకరాల కమతాలు ఉండేవి. జనాభా పెంపు, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం.. సాగు భూములు ఆక్వా, స్థిరాస్తి ఇతర అవసరాలకు మారడంతో కనుమరుగయ్యాయి. సాగులో కూలీల కొరత ప్రభావం చూపాయి. పొలాల కౌలుకే ప్రాధాన్యం ఇవ్వడంతో కౌలు రైతులు పెరిగారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సాగు చేసే వారిలో 90 శాతం కౌలు రైతులే ఉన్నారు.

అరటి అదరహో..
* విస్తీర్ణం : 13,000 హెక్టార్లు
* దిగుబడి : 13 లక్షల టన్నులు
* వ్యాపారం : రూ. 200 కోట్లు

* రావులపాలెం, అంబాజీపేట, యర్రవరంలో అధికారిక మార్కెట్లు ఉన్నాయి. తుని, రాజమహేంద్రవరం మార్కెట్లలోనూ విక్రయాలు సాగుతున్నాయి. రోజుకు 30 వేల గెలలు ఎగుమతి అవుతాయి.  
ఎగుమతులు: విజయనగరం, విశాఖ, విజయవాడ, ఒడిశా,
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక
* అరటితో పోషకాల పౌడర్‌, పానీయాలు, చిప్స్‌, పువ్వు నుంచి ఊరగాయలు, దవ్వ నుంచి ఔషధాలకు ఉపయోగపడే రసాలు తీసే వెసులుబాటు ఉంది. ఈ దిశగా ప్రోత్సాహం అవశ్యం.

విరుల వైభవం
కడియం నర్సరీలకు 1942లోనే పునాది పడింది.  నాడు కావడిపై మొక్కలమ్మేవారు. ్య 1945 నుంచి కడియం రైల్వే స్టేషన్‌ నుంచి రైళ్లలో పూల, పండ్ల, వాణిజ్య మొక్కల విక్రయాలు జరగగా.. క్రమేపీ బస్సులు, లారీలు, వ్యాన్లలో.. ఇతర దేశాలకు కంటైనర్లలో మొక్కలను దుబాయ్‌, సౌదీ, ఒమన్‌, మస్కట్‌కు తరలిస్తున్నారు.

సాంకేతికత జోడిస్తే: మొక్కల తయారీలో వినియోగిస్తున్న నల్లమట్టి స్థానే కోకోపిట్‌ను వాడితే హోలాండ్‌, లండన్‌ తదితర ప్రాంతాలకు నేరుగా కడియం నుంచి విక్రయాలు పెరిగే వీలుంది. అన్ని కాలాల్లో దొరికే కట్‌ ఫ్లవర్స్‌ తయారీకి అనువైన పాలీహౌస్‌, షేడ్‌నెట్‌ వంటి అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందుకుంటే పూల విక్రయాల్లో మనమే మేటి.
* కడియం ఉద్యాన పంటలు : 750 హెక్టార్లు
* నర్సరీల విస్తీర్ణం : 1,642   ।।
* పూల తోటలు : 300      ।।
* మొత్తం నర్సరీలు : 1,748 (రిజిస్టర్డ్‌)
* నర్సరీ రైతులు : 2 వేల మంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని