logo

విదేశాలకు ఉప్పాడ పట్టు చీరలు

మగువలకు ఎంతో ఇష్టపడే ఉప్పాడ జాంధానీ పట్టుచీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలో సొంతంగా చేనేత మగ్గాలపై తయారవ్వడమే దీని ప్రత్యేకత. దీనిపై ఉప్పాడ నేత కార్మికులకు పేటెంట్‌ హక్కు సైతం దక్కింది.

Published : 10 Aug 2022 06:13 IST

వివిధ రంగుల్లో ఉప్పాడ జాంధానీ పట్టు చీరలు

కొత్తపల్లి, న్యూస్‌టుడే: మగువలకు ఎంతో ఇష్టపడే ఉప్పాడ జాంధానీ పట్టుచీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలో సొంతంగా చేనేత మగ్గాలపై తయారవ్వడమే దీని ప్రత్యేకత. దీనిపై ఉప్పాడ నేత కార్మికులకు పేటెంట్‌ హక్కు సైతం దక్కింది. వీటి కొనుగోలుకు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఇంతటి గుర్తింపు పొందిన చీరల తయారీ అంత సులువు కాదు. నేత కార్మికులు ఎంతో ఓర్పు సహనంతో పోగు పోగు మగ్గంపై చేతితో పేర్చుతూ 20 నుంచి 40 రోజులు నేస్తేనే ఒక చీర తయారవుతుంది. చీరంతా వెండి, బంగారు రంగుల జరీతో వివిధ రకాల డిజైన్లు అద్దడమే ప్రత్యేకత. చీరకు రెండు వైపులా డిజైన్లు ఒకేలా ఉండటం కూడా విశేషం. సినీ, రాజకీయ, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు ఉప్పాడకు విచ్చేసి ఇక్కడ చీరలను ఎంతో ఆసక్తిగా తిలకించి కొనుగోలు చేస్తుంటారు. ఉప్పాడ పట్టు చీరను జీవితంలో ఒకసారైనా ధరించాలని మగువలు కోరుకుంటారు.

వెంకటరావు కృషితో గుర్తింపు
జాంధానీ సృష్టికర్తగా పిలిచే వాకతిప్పకు చెందిన స్వర్గీయ లొల్ల వెంకటరావు ఉప్పాడ చీరలకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి  కృషి చేశారు. కొత్త డిజైన్లు కనిపెట్టి చీరలను తీర్చిదిద్దేవారు. ఈ చీర దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు సైతం మార్కెటింగ్‌ చేయడంలో వెంకట రామలక్ష్మి ఫ్యాబ్రిక్స్‌ సంస్థ చాలా కృషి చేస్తోంది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు 2019లో జాతీయ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారాన్ని ఈ నెల 8న దిల్లీలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో సంస్థ అధినేత లొల్ల సత్యనారాయణ స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు