logo

గోదారమ్మ కన్నెర్ర

గత నెలలో మహోగ్రరూపం చూపిన గోదావరి మళ్లీ కన్నెర్రజేసింది. నెల తిరగకముందే రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరడంతో లోతట్టు ప్రాంతాల్లో..

Published : 12 Aug 2022 05:51 IST

బోడసకుర్రు వైనతేయ వారధి వద్ద వరద నీటిలో పల్లిపాలెం

గత నెలలో మహోగ్రరూపం చూపిన గోదావరి మళ్లీ కన్నెర్రజేసింది. నెల తిరగకముందే రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరడంతో లోతట్టు ప్రాంతాల్లో.. లంక గ్రామాల్లో ఆందోళన మొదలైంది. రోజులుగా ముంపుతో అవస్థలు పడిన జనం.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడి కోలుకుంటున్న తరుణంలో ఎగువన వర్షాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాజా పరిస్థితిపై విపత్తుల నిర్వహణ సంస్థ యంత్రాంగాన్ని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసింది.
- ఈనాడు, అమలాపురం - న్యూస్‌టుడే, పి.గన్నవరం, ముమ్మిడివరం, టి.నగర్‌, సీతానగరం

బోడసకుర్రు పల్లిపాలెంలో మత్స్యకారుల నివాస గృహాలు ఇలా...

* పెరిగిన వరద..: రాజమహేంద్రవరం వద్ద వరద ప్రవాహం పెరిగింది. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయల్లో ప్రవాహం ప్రమాదకరంగా మారింది. దీంతో కీలక శాఖలు ముందస్తు సన్నద్ధంలో నిమగ్నం అయ్యాయి. గురువారం ఓ వైపు కేంద్ర బృందంతోపాటు సాగుతుంటే.. ఆ కార్యక్రమంలో పాల్గొంటూనే తాజా పరిస్థితిపై క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తంచేశారు.

కొవ్వూరు పట్టణం, నిడదవోలు: ఎగువ నుంచి వరద నీరు భారీ స్థాయిలో చేరుతోంది. గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరవళ్లుతొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట విజ్జేశ్వరం వైపు వద్ద వరద ఉరకలెత్తుతోంది. రెండో ప్రమాద హెచ్చరికతో మద్దూరు లంకను వరద నీరు చుట్టుముట్టింది. కొవ్వూరు గోష్పద క్షేత్ర ప్రాంగణం, రెండు ప్రవేశ మార్గాల్లో నీరు చేరింది. ఆలయాలు ముంపుబారిన పడ్డాయి. గురువారం ఉదయం క్షేత్రానికి వరద తాకిడి పెరగడంతో భక్తులు వెనుదిరిగారు.

క్షేత్రంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్‌ కమ్‌ రైలు, గామన్‌ వంతెన, బాణాకార వంతెనల వద్ద వరద ఉద్థృతంగా ప్రవహిస్తోంది. వాడపల్లి, ఔరంగాబాదు ఇసుక ర్యాంపులు వరద ముంపునకు గురవ్వడంతో పడవలను ఒడ్డుకు తీసుకొచ్చి లంగరేశారు. మద్దూరులంక, చిగురులంక తదితర ప్రాంతాల్లో అరటి, కంద, కూరగాయల తోటల్లోకి నీరు చేరింది.

ఖండవల్లిలో గోదావరి నీటిలో నుంచి అరటి గెల తెచ్చుకుంటున్న రైతు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని