logo

పరిశ్రమించిన.. ప్రగతి

సహజ సంపదలకు.. ప్రకృతిసిద్ధ వనరులకు.. కొదవేలేని ఖిల్లా  మనది.. ఇక్కడి సంపదపై కన్నేసి.. బ్రిటిష్‌ పాలకులు నిల్వలు తరలించి సొమ్ము చేసుకునే పరిస్థితి స్వాతంత్య్రానికి ముందుండేది. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న తర్వాత ఉన్న వనరులను మనమే సద్వినియోగం చేసుకునే పరిస్థితి అలవడింది.

Published : 13 Aug 2022 03:41 IST

- ఈనాడు, రాజమహేంద్రవరం

హజ సంపదలకు.. ప్రకృతిసిద్ధ వనరులకు.. కొదవేలేని ఖిల్లా  మనది.. ఇక్కడి సంపదపై కన్నేసి.. బ్రిటిష్‌ పాలకులు నిల్వలు తరలించి సొమ్ము చేసుకునే పరిస్థితి స్వాతంత్య్రానికి ముందుండేది. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న తర్వాత ఉన్న వనరులను మనమే సద్వినియోగం చేసుకునే పరిస్థితి అలవడింది. ధాన్యాగారంగా పేరున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ పారిశ్రామిక ప్రస్థానం దశాబ్దాల కిందటే మొదలైంది. పారిశ్రామికీకరణ తొలిదశలో సూక్ష్మ- చిన్న- మధ్య తరహా పరిశ్రమలతో మొదలైన ప్రస్థానం.. భారీ- మెగా పరిశ్రమల స్థాపన దిశగా ఎదిగింది. ఈ క్రమంలో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్వాతంత్య్రం సిద్ధించి వజ్రోత్సవాలకు సిద్ధమవుతున్నా.. భవిష్యత్తు 25 ఏళ్లలో సాధించాల్సింది ఎంతో ఉందన్నది క్షేత్రస్థాయి చిత్రం చెబుతోంది.


రోడ్డు మార్గం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5,344.15 కి.మీ పొడవున రహదారులు ఉన్నాయి. ఎన్‌హెచ్‌- 16: 125 కి.మీ, ఎన్‌హెచ్‌- 214: 134 కి.మీ పొడవున ఉంటే.. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ, రాష్ట్రీయ, గ్రామీణదారులు 5,085.15 కి.మీ పొడవున ఉన్నాయి. పారిశ్రామికీకరణకు ఈ మార్గాలు ఊతమిస్తున్నాయి. మూడు జిల్లాల్లో 3.56 లక్షల కి.మీ నిత్యం సర్వీసులను నడుపుతున్న ఆర్టీసీలోనూ కార్గో పార్శిల్‌ ద్వారా సరకు రవాణా సాగుతోంది.


జల: 161 కి.మీ సుదీర్ఘ సాగర తీరం ఉంది. చమురు, గ్యాస్‌, ఇతర విలువైన ఖనిజ నిక్షేపాలు వెలికితీసే సంస్థలు ఇక్కడ ఉన్నాయి. పోర్టుల ద్వారా సరకు ఎగుమతులు- దిగుమతులకు జలమార్గం ఊతమిస్తోంది. దేశంలో అత్యధిక జల రవాణా, ఎగుమతులు జరిగే టాప్‌-30 జిల్లాల్లో తూర్పుది 19వ స్థానం. ప్రభుత్వ ఆధీనంలోని కాకినాడ యాంకరేజీ పోర్టు ద్వారా నాలుగు మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో కార్యకలాపాలు సాగుతుంటే... ప్రైవేటు ఆధీనంలోని కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు 20 మిలియన్‌ టన్నుల ౖకార్గో ఎగుమతీ దిగుమతుల సామర్థ్యంతో పనిచేస్తోంది.


రైలు: ఉమ్మడి జిల్లాలో 23 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 167.20 కి.మీ రైలు మార్గం సాగుతోంది. కాకినాడ పోర్టుతో రైలుమార్గం అనుసంధానం కావడం సరకు రవాణాకు ఊతమిస్తోంది. కాకినాడ పోర్టు రైల్వేస్టేషన్‌ నుంచి గూడ్సు రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు సరకు ఎగుమతులు- దిగుమతులు సాగుతున్నాయి.


వాయు: మధురపూడి విమానాశ్రయం అటు విశాఖ, ఇటు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలకు అనుసంధానంగా ఉండటం కలిసొచ్చిన అంశం. దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే పారిశ్రామికవేత్తలు, ఇతరులకూ ఉపయుక్తం. ఇక్కడి విమానాశ్రయం నుంచి సరకు రవాణాకు శ్రీకారం చుట్టారు. ఈ దిశగా సత్ఫలితాలు వస్తున్నాయి.


ప్రస్థానం మొదలైందిలా...

సముద్రంలో చమురు వెలికితీత

బ్రిటిష్‌ కాలంలో కోరంగి కాలువ ద్వారా విదేశీ వర్తకం సాగేది. డచ్చి, పోర్చుగీసు పాలకుల కాలంలో సరకుల ఎగుమతుల వేళ ఇక్కడివారు శ్రామికులుగా పనిచేసే పరిస్థితి.

స్వాతంత్య్ర అనంతరం ఆహార ఉత్పత్తులు, మత్స్యసంపద ఇతర సరకు రవాణాకు జలమార్గం దోహదపడింది. వాణిజ్య కేంద్రంగా పేరున్న రాజమహేంద్రవరంలో పాత్రల తయారీ కుటీర పరిశ్రమలు ఉండేవి.

క్రమేపీ... పేపర్‌ మిల్లు, పొగాకు కొనుగోలు కేంద్రాలు, 1970లో హార్లిక్స్‌ ఫ్యాక్టరీ ఇలా క్రమేపీ పరిశ్రమలు కొలువుదీరాయి. కాకినాడలో తొలిసారిగా ఎస్‌ఆర్‌ఎంటీ పార్శిల్‌ సర్వీసుతో కూడిన రవాణా పరిశ్రమ ఏర్పాటైంది.

1977లో నాగార్జున, 1982లో గోదావరి ఫెర్టిలైజర్స్‌ పరిశ్రమలతో ఇలా పారిశ్రామిక అడుగులు పడ్డాయి.

80-90 దశకంలో కేజీ బేసిన్‌ సహజ నిక్షేపాల వెలికితీతకు అడుగులు పడి అనుబంధ పరిశ్రమలు, సహజ వాయువుల ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

రామచంద్రపురం కేంద్రంగా 1956లోనే సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టోస్‌ శీతల పానీయాల పరిశ్రమ ఏర్పాటైంది.

వస్త్ర, లోహ, ఓడల తయారీ, శీతల పానీయాలు, యంత్ర పరికరాల విడిభాగాలు, సిరామిక్‌, ఔషధ తయారీ ఇలా భిన్న పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.


అందుకుంటే అవకాశాలెన్నో...

కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో ప్రింటింగ్‌, పప్పులు- పప్పు ధాన్యాలు, ఫర్నిచర్‌ తయారీ, ఆటో జనరల్‌ ఇంజినీరింగ్‌, బంగారు ఆభరణాల తయారీ, రైస్‌మిల్లు, అరటి, కొబ్బరి అనుబంధ పరిశ్రమలు, పూతరేకులు, ఇతర మిఠాయిలు,  ఉద్యాన- ఫ్లోరీ కల్చర్‌ క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదన ఉంది. ఇవి అందుబాటులోకి వస్తే అనుబంధ పరిశ్రమల స్థాపనతోపాటు వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కేవీలుంది.

ఎప్పట్నుంచో ఊరిస్తున్న విశాఖపట్నం- కాకినాడ పెట్రో రసాయనాలు, పెట్రో ఉత్పత్తుల పెట్టుబడుల కేంద్రం (పీసీపీఐఆర్‌) సాకారమైతే తూర్పుతీరం పారిశ్రామికంగా.. ఉపాధిపరంగా మరింత ప్రగతి సాధిస్తుంది. సాగరమాల సాక్షాత్కరిస్తే సరకు రవాణా, పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతమే. ప్రభుత్వం పోర్టు వృద్ధికీ చొరవ చూపాలి.

కాకినాడ జిల్లాలో హెచ్‌పీసీఎల్‌-గెయిల్‌ పెట్రోలియం క్రాకర్స్‌ కాంప్లెక్స్‌.. హల్దియా పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌.. కృష్ణా- గోదావరి ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌. ఓఎన్‌జీసీ సంస్థలు కెమికల్‌- పెట్రోకెమికల్‌ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలో ఉన్నాయి. దివీస్‌ ల్యాబొరేటరీ బల్క్‌ డ్రగ్‌ ఫార్మా పరిశ్రమకు, లైఫ్లస్‌ ఫార్మా ప్రై. లిమిటెడ్‌ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని