logo

ఉద్యోగాలు ఇప్పిస్తానని టోకరా

స్మార్ట్‌ విలేజ్‌.. స్మార్ట్‌ యోజన పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేయడంతో బాధితులు దేవరపల్లి పోలీసుస్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కేంద్రప్రభుత్వం ద్వారా

Published : 13 Aug 2022 03:41 IST

500 మంది నష్టపోయినట్లు అంచనా

గోపాలపురం, న్యూస్‌టుడే: స్మార్ట్‌ విలేజ్‌.. స్మార్ట్‌ యోజన పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేయడంతో బాధితులు దేవరపల్లి పోలీసుస్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కేంద్రప్రభుత్వం ద్వారా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి వరి వద్ద రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు వసూలు చేసి కొందరు ఊడాయించారు. దేవరపల్లి మండలం యదవోలుకు చెందిన దొనేపల్లి శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన ఇండిపూడి సుధాకర్‌ స్మార్ట్‌ విలేజ్‌.. స్మార్ట్‌ యోజనలో ఉద్యోగంలో నెలకు రూ.19,500జీతం వస్తుందని నమ్మించడంతో శివకృష్ణ రూ.3,35,000 చెల్లించి ఉద్యోగంలో చేరారు. మొదటి మూడు నెలలు సక్రమంగా జీతం అందడంతో శివకృష్ణ ద్వారా మరో ఆరుగురు రూ.మూడు లక్షలు కట్టారు. వారికి ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ ఉద్యోగ నియామకపత్రాలు ఇచ్చారు. తీరా కార్యకలాపాలు జరక్కపోవడం, కార్యాలయం అద్దె కూడా చెల్లించకపోవడంతో శివకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు జిల్లాలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ హరిబాబు, నాగరాజు, శివ, ఉదయభాస్కర్‌ ద్వారా మరికొంత మందితో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో సచివాలయాల పరిధిలో ఒక్కో కార్యాలయం ఏర్పాటు చేసి, దాని ద్వారా సుమారు 500 మంది నష్టపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరపల్లి ఎస్సై శ్రీహరిరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని