logo

రెక్కీ చేస్తారు.. గొలుసు తెంచుకుపోతారు..

బంగారు గొలుసులు, చరవాణుల అపహరణలకు పాల్పడుతున్న తొమ్మిది మంది అంతర్‌ జిల్లా నేరగాళ్లను పిఠాపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై శుక్రవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన

Updated : 13 Aug 2022 06:51 IST

బంగారు గొలుసులను పరిశీలిస్తున్న ఎస్పీ

మసీదుసెంటర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: బంగారు గొలుసులు, చరవాణుల అపహరణలకు పాల్పడుతున్న తొమ్మిది మంది అంతర్‌ జిల్లా నేరగాళ్లను పిఠాపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై శుక్రవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వివరాలు వెల్లడించారు. నిందితులంతా కాకినాడ జిల్లా సామర్లకోట బోసువారివీధికి చెందిన వారని, వీరిలో ఏ1గా బోడెం రామాంజినేయులు(21), ఏ2గా ఉమ్మిడి ఆనందకుమార్‌(19), ఏ3గా గూడుపు సాయిరాం(21), ఏ5గా బోనాసు శంకర్‌నారాయణ(20), ఏ9గా రేలంగి నితిన్‌దుర్గాప్రసాద్‌(19), వీకేరాయపురానికి చెందిన ఏ4 కామిరెడ్డి జోగారావు(19)తోపాటు మరో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. తొమ్మిది మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి బంగారు గొలుసుల అపహరణలకు పాల్పడుతూ.. వచ్చిన సొమ్ముతో మద్యం పార్టీలు, ఇతరత్రా విందు వినోదాల్లో మునిగి తేలుతుంటారు. గ్యాంగ్‌లోని సభ్యులు కొందరు ముందుగా రెక్కీ చేసి, పథకం సిద్ధం చేస్తారు. మిగిలిన వారు బంగారు గొలుసుల అపహరణ చేస్తారు. ఆ సమయంలో కొందరు వీరు తప్పించుకొనేందుకు సాయం చేస్తారు. ఇటీవల పిఠాపురంలో జరిగిన బంగారు గొలుసు దొంగతనం కేసులో పోలీసులు ఈ ముఠాను గుర్తించారు. వీరిపై కాకినాడ జిల్లాలో 14, ఏఆస్‌ఆర్‌ జిల్లాలో ఒకటి, అనకాపల్లి జిల్లాలో రెండు, విశాఖ జిల్లాలో రెండు మొత్తంగా 19 బంగారు గొలుసుల అపహరణలు, కాకినాడ జిల్లాలో 8, ఏఎస్‌ఆర్‌ జిల్లాలో ఒకటి మొత్తం తొమ్మిది చరవాణుల అపహరణ కేసులు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. వీరినుంచి ఇప్పటికే ఏడు బంగారు గొలుసులు, తొమ్మిది సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ. 9 లక్షలు ఉంటుందన్నారు. ఇంకా రూ. తొమ్మిది లక్షల విలువజేసే 11 బంగారు గొలుసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. ఏఎస్పీ(అడ్మిన్‌) పి.శ్రీనివాస్‌, ఎస్పీ డీవో భీమారావుల పర్యవేక్షణలో పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, పిఠాపురం టౌన్‌ ఎస్సై శంకరరావు, గొల్లప్రోలు హెచ్‌సీ శ్రీనివాస్‌, పీసీ బాలాజీ, సీసీఎస్‌ సీఐ సురేష్‌, ఎస్సై హరీష్‌కుమార్‌, క్రాంతికుమార్‌, సిబ్బంది నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. వీరందరినీ ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని