logo

ఏడు లక్షల జెండాల పంపిణీకి సన్నాహాలు

ఉమ్మడి జిల్లా పరిధిలో పంపిణీ చేసేందుకు ఏడు లక్షల జాతీయ జెండాలు వచ్చినట్లు జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం వీటిని సరఫరా చేస్తోందని వివరించారు. కాకినాడ జిల్లాకు సంబంధించి 2.59లక్షల

Published : 13 Aug 2022 03:41 IST

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా పరిధిలో పంపిణీ చేసేందుకు ఏడు లక్షల జాతీయ జెండాలు వచ్చినట్లు జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం వీటిని సరఫరా చేస్తోందని వివరించారు. కాకినాడ జిల్లాకు సంబంధించి 2.59లక్షల జెండాలు జడ్పీ కార్యాలయానికి చేరుకోగా, వాటిని మండల కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలకు శనివారం సాయంత్రానికి జెండాలు చేరుకుంటాయన్నారు. వీటిని సామాజిక పింఛనుదారులకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తారని తెలిపారు. మండల కేంద్రాలకు వచ్చిన జెండాలను గ్రామాలకు తరలించి ఇళ్లపై ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీఈవోలు, ఇతర అధికారులను ఆదేశించినట్లు సీఈవో పేర్కొన్నారు.

ప్రొటోకాల్‌ సమస్యలు తలెత్తకుండా చూడండి..
మండలాల్లో ప్రొటోకాల్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రతలు తీసుకోవాలని జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు ఎంపీడీవోలను కోరారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీడీవోలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని మండలాల్లో ఎంపీపీలు, ఎంపీడీవోలు, జడ్పీటీసీ సభ్యుల నడుమ సమన్వయం లోపిస్తోందన్నారు. తద్వారా ప్రొటోకాల్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. మండల పరిషత్‌ కార్యాలయాల్లో వసతి కల్పించాలనే డిమాండ్‌ జడ్పీటీసీ సభ్యుల నుంచి వస్తోందని, ఇది రాష్ట్రవ్యాప్త సమస్య అయినప్పటికీ ఎంపీడీవోలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఇకపై ప్రతి మూడు నెలలకు ఎంపీడీవోలను, రెండు నెలలకు ఏవోలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డిప్యూటీ సీఈవో రమణారెడ్డి, డీఎల్‌డీవో పి.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని