logo

లోతట్టున కలవరం

లంక గ్రామాలను.. లోతట్టు ప్రాంతాలను జల గండం వీడలేదు. గోదావరి నీటిమట్టం 15 అడుగులు దాటిన తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి నిలకడగా ఉంది. ఎగువన వర్షాలు, వరదలు తగ్గడంతో పరిస్థితి కుదుటపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Published : 14 Aug 2022 05:54 IST

పల్లంకుర్రులో పడవల్లోనే మత్స్యకారుల జీవనం

ఈనాడు, అమలాపురం, న్యూస్‌టుడే బృందం: లంక గ్రామాలను.. లోతట్టు ప్రాంతాలను జల గండం వీడలేదు. గోదావరి నీటిమట్టం 15 అడుగులు దాటిన తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి నిలకడగా ఉంది. ఎగువన వర్షాలు, వరదలు తగ్గడంతో పరిస్థితి కుదుటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే లంక భూములు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం..కోనసీమ ప్రాంతంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఏటిగట్లు గుర్తించిన జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో ఆయా ప్రాంతాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెండు జిల్లాల కలెక్టర్లు హిమాన్షు శుక్లా, మాధవీలత తాజా పరిస్థితిపై కీలక శాఖల జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు.

* చుట్టూ నీరు..: గోదావరి వరదల ప్రభావం మరోసారి తాకడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. పి.గన్నవరం మండలం జి.పెదపూడి, మానేపల్లి పల్లెపాలెం, బూరుగులంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట లంక.. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం.. అయినవిల్లిమండలం ఎదురుబిడుం.. మామిడికుదురు మండలం అప్పనపల్లి.. ఐ.పోలవరం మండలం పాగాకులంక, పల్లెగూడెం, జాంబవానిపేట, రామాలయం పేట, గోగుల్లంక, భైరవలంక.. ముమ్మిడివరం మండలం గురజాపు లంక, లంక ఆఫ్‌ ఠాణేలంక, కూనాలంక తదితర ప్రాంతాల రహదారులు, కాజ్‌వేలు జలమయం కావడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురయ్యింది. ఐ.పోలవరం మండలం వెదుర్లంక.. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లెపాలెంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి.. 600 మందికి భోజన- వసతులు ఏర్పాటుచేసినట్లు అధికారులు చెప్పారు.

నాగుల్లంక ఏటిగట్టు దిగువన ఇంటి చుట్టూ నీరు

* స్తంభించిన రాకపోకలు: లంక గ్రామాలవాసులు నిత్యం నీటి మధ్య గడుపుతూ బెంబేలెత్తిపోతున్నారు. లంక గ్రామాల్లోని ప్రధాన రహదారుల మధ్య ఉన్న కాజ్‌వేలు పూర్తిగా మునిగిపోవడంతో అక్కడ రాకపోకలు స్తంభించాయి. జాయింట్‌ కలెక్టర్‌ ధ్యాన్‌చంద్ర, ఆర్డీవో ఎం.ముక్కంటి, తహసీల్దారు నాగలక్ష్మమ్మ పాశర్లపూడి కాజ్‌వే నుంచి పడవ ద్వారా వరద ప్రాంతాల పరిస్థితిని పరిశీలించారు.కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి వివిధ లంకగ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని