logo

మాటిచ్చారు.. మరిచారు

లంక గ్రామాలను జటిల సమస్యలు ఏళ్ల కాలంగా పట్టిపీడిస్తున్నాయి. ఒక వైపు సాగునీటి యాతనలు, మరో వైపు రాకపోకలకు ఇబ్బందులు వెంటాడి వేధిస్తున్నాయి. వీటి పరిష్కారానికి నేనున్నానంటూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీతో అందరిలోనూ ఆశలు రేగాయి. ఏడాదైనా వాటి ఊసే లేకపోవడంతో నిరుత్సాహం అలముకుంది. సరిగ్గా గ

Updated : 16 Aug 2022 06:46 IST

న్యూస్‌టుడే, మామిడికుదురు, పి.గన్నవరం, అయినవిల్లి

అయినవిల్లి ఎదురుబిడుం కాజ్‌వేపై వరదలో రాకపోకలు

లంక గ్రామాలను జటిల సమస్యలు ఏళ్ల కాలంగా పట్టిపీడిస్తున్నాయి. ఒక వైపు సాగునీటి యాతనలు, మరో వైపు రాకపోకలకు ఇబ్బందులు వెంటాడి వేధిస్తున్నాయి. వీటి పరిష్కారానికి నేనున్నానంటూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీతో అందరిలోనూ ఆశలు రేగాయి. ఏడాదైనా వాటి ఊసే లేకపోవడంతో నిరుత్సాహం అలముకుంది. సరిగ్గా గత ఏడాది ఆగస్టు 16న పి.గన్నవరానికి వచ్చిన సీఎం  బహిరంగ సభలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడంతో  ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.   మామిడికుదురు, పి.గన్నవరం మండలంలోని అయిదు లంక గ్రామాల్లో సుమారు 4,600 ఎకరాల భూములకు సాగునీటి వసతి కల్పించేందుకు ఉద్దేశించిన అప్పనపల్లి ఎత్తిపోతల పథకం దశాబ్దాల కాలంగా అమలుకు నోచుకోవడం లేదు. జల వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా  గతంలో పలుమార్లు సర్వేలు జరిగాయి. ప్రతిపాదనలు చేసి పంపినా నిధుల మంజూరు ఊసు లేదు.  మొండెపులంక తూర్పు ఛానల్‌ ద్వారా ఎత్తిపోతల విధానంలో సాగునీటిని భూగర్భం ద్వారా సరఫరా చేసేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం లంక గ్రామాల్లో భూములు పలు చోట్ల సాగునీటి వసతి లేక నిరుపయోగంగా మారాయి.  లంక గ్రామాలను ఆనుకుని ఉన్న వైనతేయ జలాలు నిత్యం సముద్రం పోటు నీటి ప్రభావంతో ఉపయోగపడక రైతులకు తీవ్ర వ్యయప్రయాసలు ఎదురయ్యాయి.  

ఎదురుబిడుం కాజ్‌వేకు మోక్షం లేదు..

పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలంకలోని ఎదురుబిడుం కాజ్‌వే ఆధునికీకరణకు దశాబ్దాల కాలంగా మోక్షం కరవైంది. కొద్దిపాటి వరదలకే ఇది మునిగిపోతుండడంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, కపిలేశ్వరపురం మండలంలోని అద్దంకివారిలంక గ్రామాల ప్రజలు దీని ఆధునికీకరణ గురించి ఏళ్లకాలంగా నిరీక్షిస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. ఈ పనులకు రూ.20 కోట్లు వ్యయమయ్యే ప్రతిపాదనలు చేసి పంపినా నిధుల జాడలేదు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీతో కాజ్‌వే కల నెరవేరుతుందని ఆశించినా ఇప్పటికీ కార్యాచరణ లేకపోవడంతో నిరుత్సాహపడ్డారు.


ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది

అప్పనపల్లి ఎత్తిపోతల పథకం, అయినవిల్లిలంక ఎదురుబిడుం కాజ్‌వేకు సంబంధించి జీవో విడుదలైంది. వీటికి నిధుల కేటాయించారు. ప్రస్తుతం ఇవి ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే వీటికి ఆమోదం రానుంది.

- కొండేటి చిట్టిబాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని