logo

నాడు-నేడు సాగేదెలా..?

నాడు - నేడు రెండో విడత పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ప్రాథమిక తరగతుల్ని విలీనం చేసుకునే ఉన్నత పాఠశాలల్లోనే అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టాలని భావించారు.

Published : 17 Aug 2022 06:14 IST

శ్రీరామ్‌నగర్‌ ఉన్నత పాఠశాలలో నిలిచిపోయిన
అదనపు తరగతి గదుల నిర్మాణం

* కాకినాడ తిలక్‌వీధిలోని ఉన్నత పాఠశాలలో 20 అదనపు తరగతి గదులు నిర్మించాలని ఎంపిక చేశారు. స్థానిక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో పనులకు ఆస్కారం లేకుండా ఉంది.
* శ్రీరామ్‌నగర్‌ ఉన్నత పాఠశాలలో రెండో విడత నాడు-నేడులో 17 గదులు నిర్మించాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టిన నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణం ఏడాదిన్నర అయినా నిధుల లేమితో పూర్తికాలేదు. ఇక్కడ నాలుగు గదులు అందుబాటులోకి వస్తే సరిపోతుంది. అయినా 17 నిర్మించాలని ఎంపిక చేశారు. ప్రస్తుతం అక్కడ అవసరం లేకపోవడంతో నిర్మాణ పనులను విరమించుకున్నారు.

కాకినాడ(వెంకట్‌నగర్‌), న్యూస్‌టుడే: నాడు - నేడు రెండో విడత పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ప్రాథమిక తరగతుల్ని విలీనం చేసుకునే ఉన్నత పాఠశాలల్లోనే అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టాలని భావించారు. మళ్లీ మార్పులు చేసి అన్నింటికీ అవకాశం కల్పించారు. రెండు నెలలు సెలవులు వచ్చినా పనులు పూర్తిచేయలేదు. పాఠశాలల్ని పునఃప్రారంభించిన తర్వాత పనులు చేపట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం, వివిధ మరమ్మతులకు సంబంధించిన ఇసుక, సిమెంటు, కంకర, ఐరన్‌ తదితర సామగ్రిని ప్రాంగణాల్లో గుట్టలుగా వేయడంతో తరగతుల నిర్వహణ కష్టమవుతోందని వాపోతున్నారు.

స్థలం లేకుండా ఎలా నిర్మించాలి...
నాడు-నేడు రెండోవిడతలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చోటు కల్పించారు. నాడు-నేడు పనులపై కసరత్తు చేస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాల సాధ్యాసాధ్యాలు, అవసరమైన స్థలం ఉందా లేదా? నిర్మాణపరంగా ఎటువంటి అవకాశాలు ఉన్నాయనే అంశాలు తెలుసుకోకుండానే ఈ ప్రక్రియ చేపట్టారని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాకినాడ జిల్లాలో రెండోవిడత నాడు-నేడు పనులు చేపట్టేందుకు 942 పాఠశాలలను గుర్తించారు. వివిధ పనుల నిమిత్తం 710 పాఠశాలల యాజమాన్య ఖాతాల్లో నిధులు జమ చేశారు.  జిల్లాకు సంబంధించి రెండోవిడత నాడు-నేడు పనులకు రూ.391 కోట్ల మేర ప్రతిపాదనలు పంపించగా ఇప్పటికి దాదాపు రూ.42 కోట్లు విడుదలయ్యాయి. అదనపు తరగతి గదుల నిర్మాణానికి మొదట 178 పాఠశాలలను ఎంపిక చేయగా తాజాగా 388 చోట్ల 2,078 అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా పాఠశాలల్లో స్థలం లేకపోవడం, అవసరం లేకపోవడం, ఇతర కారణాలు తెలుపుతూ 83 పాఠశాలల యాజమాన్యాలు అదనపు తరగతి గదుల నిర్మాణాలు వద్దన్నాయి. ఒక్క కాకినాడ నగరంలోనే అటువంటివి 15 పాఠశాలలకు పైగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన పాఠశాలల్లో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.

బోధనకు ఆటంకాలు

జిల్లా పరిషత్తు పాఠశాలల తరహాలో మిగిలిన పాఠశాలల్లో స్థలాలు విశాలంగా ఉండవు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ప్రార్థన నిర్వహణ, ఆటలాడుకోవడం, భోజనం చేయడం వంటివి చేస్తుంటారు. ప్రస్తుతం నాడు-నేడు పనుల వల్ల ఆయా స్థలాల్లో ఇసుక, కంకర, ఐరన్‌ వేయడంతో వాటి నిర్వహణ కష్టమవుతోంది. దీనికితోడు నిర్మాణ పనుల కారణంగా యంత్రాల రణగొణ ధ్వనుల మధ్య పాఠాలు ఎలా చెప్పాలని కొంతమంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

ఆపనులు వేగవంతం చేస్తున్నాం..
కాకినాడ నగరం: జిల్లాలో నాడు-నేడు పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నాం. ఇప్పటికే కొన్ని అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరికొన్ని రానున్నాయి.- డి.సుభద్ర, ఏపీసీ, సమగ్ర శిక్ష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని