logo

మండలానికో మహిళామార్ట్‌

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేయూత మహిళా మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలతో వీటిని నెలకొల్పనున్నారు.

Published : 17 Aug 2022 06:14 IST

మండల సమాఖ్య సమావేశంలో డ్వాక్రా మహిళలు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేయూత మహిళా మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలతో వీటిని నెలకొల్పనున్నారు. బ్యాంకు లింకేజీ, పొదుపు సొమ్ము, స్త్రీనిధి రుణాలతో చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న సంఘాలను పెద్ద వ్యాపార రంగంలోకి తీసుకురానున్నారు. ఫైలెట్‌ ప్రాజెక్టుగా తొలుత రెండు మండలాలను ఎంపిక చేశారు. తర్వాత దశల వారీగా మిగతా మండలాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు డీఆర్‌డీఏ జిల్లా పీడీ డేగలయ్య తెలిపారు.

రూ.కోటి పెట్టుబడితో..
జిల్లాలో రాజమహేంద్రవరం అర్బన్‌ మినహా మిగతా 18 మండలాల్లో రూ.60 లక్షల నుంచి రూ.కోటి పెట్టుబడితో వీటిని ఏర్పాటు చేయనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా నిడదవోలు, కోరుకొండ మండలాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిడదవోలు మండల సమాఖ్య పరిధిలో 19,054, కోరుకొండ మండల సమాఖ్య పరిధిలో 18,080 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లోని సభ్యులు ఒక్కొక్కరూ వాటా ధనంగా రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. చేయూత మహిళా మార్ట్‌ రిజిస్ట్రేషన్‌ తర్వాత ఆ ఖాతాకు మహిళల వాటా సొమ్మును జమ చేస్తారు. ఇప్పటికే మండల సమాఖ్య వద్ద ఉన్న సొంతనిధి నుంచి వచ్చే వడ్డీ మొత్తాన్ని వాటాగా పెట్టనున్నారు. స్త్రీనిధి ద్వారా ఏటా వచ్చే డివిడెండ్‌ను దీనికి జత చేస్తారు. ఇలా ఒక్కో మండలంలో రూ.60 లక్షల వరకు పెట్టుబడి నిధి సమకూరనుంది. దీనికి అదనంగా బ్యాంకుల నుంచి రుణం మంజూరు చేసి ఒక్కో మండలంలో రూ.కోటి పెట్టుబడితో మహిళా మార్టులను నెలకొల్పి నిర్వహించనున్నారు. మార్ట్‌ల నిర్వహణ ద్వారా వచ్చే నికర లాభంలో సంఘాల వాటా ఆధారంగా ఒక్కో సంఘానికి 36 శాతం వరకు డివిడెండ్‌ కల్పించనున్నారు.

ఇదీ పరిస్థితి..
జిల్లాలో 33,420 డ్వాక్రా సంఘాల్లో 3.37 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ప్రతి మండల సమాఖ్యలో 1700 నుంచి 2 వేల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. సాధారణ పెట్టుబడి నిధి కింద ప్రభుత్వం మండల సమాఖ్యలకు గతంలో రూ.40 లక్షలు చొప్పున ఇచ్చింది. వీటిని డ్వాక్రా సంఘాల సభ్యులకు అంతర్గత అప్పులుగా ఇవ్వడం ద్వారా వచ్చిన వడ్డీతో కలిపి ప్రస్తుతం ఒక్కొక్క మండల సమాఖ్య వద్ద సుమారు రూ.60 లక్షల వరకు నిధి ఉంది.

ఆర్థిక స్వావలంబన
డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ఉద్దేశంతోనే గ్రామీణ మహిళా మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తొలుత ప్రయోగాత్మకంగా నిడదవోలు, కోరుకొండ మండలాల్లో మహిళా మార్టుల ఏర్పాటు చేయనున్నాం. డ్వాకా మహిళలు తయారు చేస్తున్న సొంత ఉత్పత్తులను ఇక్కడ  విక్రయించుకునే వీలుంటుంది. తద్వారా వ్యాపారాభివృద్ధితోపాటు ఆర్థికంగానూ సంఘాలు బలపడే అవకాశం కలుగుతుంది. బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరలకు ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా ఈ మార్టులు పనిచేస్తాయి. -డేగలయ్య, డీఆర్‌డీఏ పీడీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని