logo

నిండా ముంచేసి..నిర్దయగా వదిలేసి

ముంపు తొలగదు.. ఇళ్లలోంచి బయటకొచ్చే పరిస్థితి లేదు... బయట అడుగుపెట్టాలంటే యాతనే.. నివాసాల చుట్టూ ముక్కుపుటాలు అదిరిపోయే దుర్వాసన నిండిన నీరు. మోకాళ్లలోతు ముంపులో వీధి రహదారులు..  రాకపోకలకు నరకయాతన అనుభవించాల్సిందే.. ఒకపక్క దోమల బెడద.. మరోవైపు వెంటాడుతున్న అంటువ్యాధులు.

Published : 19 Aug 2022 06:18 IST

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం, ధవళేశ్వరం, దానవాయిపేట

మునిగిన రాఘవేంద్ర కాలనీ

మురుగు పారదు.. ముంపు తొలగదు.. ఇళ్లలోంచి బయటకొచ్చే పరిస్థితి లేదు... బయట అడుగుపెట్టాలంటే యాతనే.. నివాసాల చుట్టూ ముక్కుపుటాలు అదిరిపోయే దుర్వాసన నిండిన నీరు. మోకాళ్లలోతు ముంపులో వీధి రహదారులు..  రాకపోకలకు నరకయాతన అనుభవించాల్సిందే.. ఒకపక్క దోమల బెడద.. మరోవైపు వెంటాడుతున్న అంటువ్యాధులు. ఇదీ హకుంపేట పరిధిలోని రామకృష్ణానగర్‌లోని కొన్ని ప్రాంతాలు, సావిత్రినగర్‌, నాగిరెడ్డి నగర్‌, ఆదర్శనగర్‌, బొమ్మూరు పంచాయతీ నేతాజీనగర్‌, ఆదర్శనగర్‌ తదితర కాలనీల్లోని పరిస్థితి. సరిగ్గా నెల రోజుల కిందట గోదావరికి వరదలు వచ్చినప్పుడు సుమారు పదిరోజులు ఈ కాలనీలన్నీ మురుగునీటితో నిండిపోవడంతో జనం పడవలపై ప్రయాణం సాగించారు.. నెలగడవక ముందే మళ్లీ ముంచేసింది. వారం రోజులుగా ఆ ప్రాంత ప్రజలు మురుగుతో సహవాసం చేస్తున్నారు.
కుచించుకుపోయిన ఆవ కాలువ
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: ఆవ ఛానల్‌ అక్రమ నిర్మాణాలు వల్ల కాలువ కుచించుకుపోయింది. రామకృష్ణా థియేటర్‌ నుంచి మొదలైన ఆవ ఛానల్‌కు ఎస్‌టీపీ ప్లాంట్‌ వరకు సిమెంట్‌ కాలువ ఉంది. తర్వాత గ్రామీణం పరిధిలో సుమారు 6 కిలోమీటర్ల మేర మామూలుగా వదిలి వేయడంతో మట్టితో కూరుకుపోయింది. వరదలు, వర్షాల సమయంలో కాలనీల్లోకి మురుగు చేరుతోంది. సావిత్రీనగర్‌ నుంచి పెద్ద మొత్తంలో ఆవ ఛానల్‌ ఆక్రమణకు గురైంది. పంచాయతీ కార్యాలయాల్లో సులువుగా అనుమతులు లభిస్తుండటంతో విచ్చలవిడిగా భారీ అంతస్తులు వెలిశాయి. దీనికి తోడు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం మరో కారణం.  

నేతాజీనగర్‌ కొహినూర్‌ అపార్ట్‌మెంటు చుట్టూ మురుగు కాలువ నీరు

చలించని యంత్రాంగం..
రోజుల తరబడి జనం పడుతున్న పాట్లు ఎవరికీ పట్టడం లేదు.. కాలనీవాసులు నానా అవస్థలు పడుతున్నా అధికార యంత్రాంగంలో చలనం లేదు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాగానే ధవళేశ్వరం సాయిబాబా గుడి సమీపంలో ఆవకాలువ గోదావరి వద్ద కలిసే ప్రాంతంలో సూయిజ్‌ గేట్లు మూసివేస్తున్నారు. దీంతో ఆవ కాలువలోని మురుగు కాలనీలోకి చేరుతోంది. అక్కడి మురుగును గోదావరిలోకి పంపించే ఏర్పాట్లు చేయడం లేదు. గత నెల వరద సమయంలో మోటార్లు ఏర్పాటు చేసి మురుగు తోడించినా వాటి సామర్థ్యం చాలక పెద్దగా ఫలితం కనిపించ లేదు. ప్రస్తుతం ఆ మోటార్లు సైతం ఏర్పాటు చేయలేదు.

నాగిరెడ్డి నగర్‌లోని ఓ వీధిరోడ్డు ఇలా..

బయట అడుగుపెట్టేదెలా..?
పలు కాలనీల్లోని వీధులన్నీ నీటితో చెరువులను తలపిస్తుండటంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. చిన్నపిల్లలు మురుగులో నడవలేకపోతున్నారు. తల్లులు వాళ్లను ఎత్తుకుని పాఠశాల వరకు తీసుకువెళ్తున్నారు. ఉద్యోగులు, వివిధ పనులపై బయటకెళ్లే వాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావస సరకులు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోతున్నారు.
నీటిని మళ్లిస్తాం...
గోదావరి వరదల కారణంగా గ్రామీణం పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చిన నీటిని పంపింగ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ ప్రాంతం నది ప్రవాహం కంటే దిగువన ఉండటం వల్ల నీరు చేరుతోంది. మోటార్ల సాయంతో నీటిని పంపింగ్‌ చేయాల్సి ఉంది. గ్రామీణంలో ఆవ ఛానల్‌ ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకుంటాం. - దినేష్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌
రోగాలకు నిలయం...
వీధుల్లో భరించలేని దుర్గంధం వస్తోంది. దోమలు విజృంభిస్తున్నాయి. ఎక్కడికక్కడ పాములు తిరుగుతున్నాయి. ముంపు ప్రాంతం అంతా రోగాలకు నిలయంగా మారింది. సుమారు పది రోజుల నుంచి ఇదే పరిస్థితి. రోజురోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. విష జ్వరాలు వ్యాపిస్తుండటంతో ఈ ప్రాంత వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇక్కడి నీటిలో తిరుగే వాళ్లకు దురదలు వస్తున్నాయి. మా గోడుపట్టించుకునే నాథుడే లేడు.
- మోటూరి కనకదుర్గ భవాని, నేతాజీనగర్‌

చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది..
ఇళ్లకు రావాలంటే రెండు కిలోమీటర్లు తిరగాల్సి వస్తోంది. ఆటోలు, పాఠశాలకు వెళ్లే బస్సులు ఈ వీధుల్లోకి రావడం లేదు. పిల్లలను పాఠశాలకు పంపించే సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపించకుంటే రానున్న రోజుల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అధికారులు వచ్చి పరిశీలించాలి. - నాగరాజు, నేతాజీనగర్‌ 
ఎవరూ పట్టించుకోవడం లేదు
బయటకెళ్లి సరకులు తెచ్చుకోవడానికీ వీలులేదు. జ్వరం వచ్చినా ఆసుపత్రికి వెళ్లే పరిస్థితిలేదు. ఇళ్లచుట్టూ పదిరోజులుగా మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తోంది. దోమలు పెరిగిపోతున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలవారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి జనం కష్టాలు అధికారులకు పట్టడం లేదు. - నారాయణమ్మ, సావిత్రినగర్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని