logo

రాజకీయ.. భూటకం!

అది పేదల భూమైనా.. రూ.కోట్లు పలికే పెద్దల భూమైనా రాజకీయం చక్రం తిప్పేస్తోంది. ఇన్నాళ్లూ లేని వివాదాలు ఇటీవల ముసురుతున్నాయి. భూ వివాదాల ద్వారా కొందరు ఆర్థికంగా లాభపడుతుంటే.. మరికొందరు రాజకీయంగా లబ్ధిపొందే పనిలో ఉన్నారు. ఏళ్లుగా ఖాళీగా ఉన్న భూముల చిట్టాలు..

Updated : 25 Sep 2022 03:41 IST

ఈనాడు, కాకినాడ

భూదాన భూముల్లో రెవెన్యూశాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

అది పేదల భూమైనా.. రూ.కోట్లు పలికే పెద్దల భూమైనా రాజకీయం చక్రం తిప్పేస్తోంది. ఇన్నాళ్లూ లేని వివాదాలు ఇటీవల ముసురుతున్నాయి. భూ వివాదాల ద్వారా కొందరు ఆర్థికంగా లాభపడుతుంటే.. మరికొందరు రాజకీయంగా లబ్ధిపొందే పనిలో ఉన్నారు. ఏళ్లుగా ఖాళీగా ఉన్న భూముల చిట్టాలు.. చరిత్రలు సేకరించి.. కొత్త వివాదాలు తెరపైకి తెస్తున్నారు. జిల్లా కేంద్రం.. గ్రామీణంలోనూ కొన్నాళ్లుగా భూ వివాదాలు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. వీటి వెనుక కొందరు నాయకులు, చోటాల పేర్లూ బలంగా వినిపిస్తున్నా.. కఠినంగా వ్యవహరించే అధికారుల చొరవ లేదు.

వివాదాల సుడి..

రూ.20 కోట్ల విలువైన లేఔట్‌ స్థలాన్ని కడపవాసులు కబ్జాకు ప్రయత్నిస్తున్నారని గ్రామీణ తహసీల్దారు కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో రాజకీయ జోక్యంపైనా చర్చ నడుస్తోంది. రమణయ్యపేటలో ఎంపీడీవో కార్యాలయం పక్కన సామాజిక స్థలం కబ్జా అంశం వివాదాస్పదమైంది. వ్యవహారం రచ్చకెక్కగా అధికారులు ఆక్రమణలు తొలగించారు.

కన్నేశారిలా..

* కాకినాడ నగరంలో రూ.కోట్ల విలువైన భూదాన భూముల కబ్జాకు యత్నాలు సాగుతున్నాయి. గతంలో తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై కేసులు పెట్టి.. నిషేధిత జాబితాలో చేర్చినా.. వెనక్కి తగ్గట్లేదు. కొందరికి కట్టబెట్టేలా అధికార పార్టీలో ఓ నాయకుడు నిమగ్నమయ్యారనే ఆరోపణలున్నాయి. ఇక్కడి 4.45 ఎకరాలు భూదాన బోర్డు భూమిగా 2014లోనే ఆంధ్రప్రదేశ్‌ భూదాన యజ్ఞ బోర్డు ధ్రువీకరించిందని.. ఇందులో పేదలకు పట్టాలివ్వాలని తీర్మానించిందని కొందరు పత్రాలు చూపుతున్నారు.

* కాకినాడ గ్రామీణం పండూరులో సుమారు 10 సెంట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణపై వివాదం ముసురుకుంది. ఆక్రమణదారుల్లో రాజకీయ నాయకులూ ఉన్నారనే ఆరోపణలు వచ్చినా.. ఉన్నతాధికారుల వరకు వెళ్లినా చర్యల్లేవు.


పేదలే పావులు..

* కాకినాడ నగరం దుమ్ములపేటలో సర్వే నంబరు 1983/4ఏ, 4బీలోని 8.06 ఎకరాల్లో 2017లో తెదేపా హయాంలో 340 మందికి పట్టాలు ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. ఈ స్థలంలో ఎలాంటి తాత్కాలిక/ శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదనే కారణంతో 2019లో పట్టాలన్నీ రద్దుచేశారు. ఇందులో నాలుగు ఎకరాలు ఆర్టీసీకి.. మిగిలిన 4.06 ఎకరాల్లో 207 మందికి స్థలాల కేటాయించారు. దీంతో గతంలో పట్టాలు పొందిన వారు రోడ్డెక్కడంతో పరిస్థితి ఉద్రిక్తత, అరెస్టుల వరకు వెళ్లింది.

* కాకినాడ గ్రామీణం కొవ్వూరు వద్ద గత ప్రభుత్వం పేదలకు స్థలం కేటాయించింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ పట్టాలు రద్దుచేసి.. వేరొకరికి కేటాయించడం వివాదాస్పదమైంది. 1995 నుంచి ఈ స్థలంపై వివాదాలు ఉన్నాయి. తెదేపా హయాంలో 451 మందికి పట్టాలు ఇస్తే.. నిర్మాణాలు చేపట్టలేదనని.. వాటిని రద్దుచేశారు. ‘నవరత్నాలు- పేదలకు ఇళ్లు’ కింద 270 మందికి కొత్తగా పట్టాలు ఇచ్చారు. ఈ అంశంలోనూ స్థానికంగా వివాదం నడుస్తోంది.


రూ.కోట్ల స్థలం  కబ్జాకు స్కెచ్‌

కాకినాడ రాజ్యలక్ష్మీనగర్‌లో 1,000 గజాల మున్సిపల్‌ స్థలాన్ని కొందరు ఆక్రమించి, నిర్మాణాలు చేపట్టేందుకు ఇటీవల యత్నించారు. పూర్వం ఇక్కడ కాలువ పూడుకుపోయింది. దీంతో ఇక్కడ కొంత స్థలంలో కార్పొరేషన్‌ అధికారులు వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేశారు. మిగతా రూ.కోట్ల విలువైన ఖాళీ స్థలంపై కొందరు కన్నేశారు. రాజకీయ దన్నుతో కబ్జాకు యత్నించారు. స్థానికుల వ్యతిరేకతతో ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు.


భూముల పరిరక్షణకు  చర్యలు

ప్రభుత్వ భూముల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జేసీ, ఆర్డీవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. న్యాయపరమైన చిక్కుల్లేని భూ వ్యవహారాల్లో తక్షణమే స్పందిస్తున్నాం. దుమ్ములపేట ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై ఆర్డీవో విచారణ సాగుతోంది. నగర, గ్రామీణ ప్రాంతాల్లో తాజా వివాదాస్పద అంశాలపై దృష్టిసారిస్తాం. ఎక్కడైనా అర్హులు ఇంటి స్థలాలు కోల్పోయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.

- కృతికాశుక్లా, కలెక్టర్‌, కాకినాడ

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని