logo

కట్టేసుకోండి.. కళ్లప్పగిస్తాం

అమలాపురం మండలం కామనగరువులోని ఓ అపార్టుమెంట్‌ నిర్మాణానికి అయిదు అంతస్తుల వరకు అనుమతులు తీసుకుని.. ఆరో అంతస్తు కట్టారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. వారు నోటీసు ఇచ్చినా.. భవన

Published : 25 Sep 2022 03:13 IST

కామనగరువులో అదనపు అంతస్తుకు అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనం

* అమలాపురం మండలం కామనగరువులోని ఓ అపార్టుమెంట్‌ నిర్మాణానికి అయిదు అంతస్తుల వరకు అనుమతులు తీసుకుని.. ఆరో అంతస్తు కట్టారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. వారు నోటీసు ఇచ్చినా.. భవన యజమాని మాత్రం నిర్మాణం ఆపలేదు. ఇదే తరహా బహుళ అంతస్తుల భవనాలు ఈదరపల్లిలోనూ నిర్మిస్తున్నా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

* నలువైపులా ఖాళీ స్థలం(సెట్‌ బ్యాక్స్‌) వదలకుండా కట్టడం, ఇంటికి ప్లాన్‌ తీసుకుని వాణిజ్య సముదాయం నిర్మించడం, పంచాయతీలకు దాఖలుచేసిన స్థలాలను వదలకుండా నిర్మాణాలు చేపట్టడం.. ఇలాంటి అతిక్రమణలు కోకొల్లలుగా జరిగిపోతున్నాయి. కొత్తగా ఏర్పడిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రధాన రహదారులు, పట్టణాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఇటీవల ఈ తంతు కళ్లముందే జరుగుతున్నా.. అధికారులకు పట్టడం లేదనే విమర్శలున్నాయి.

న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం, ముమ్మిడివరం

ఒకప్పుడు నగరాలు, పట్టణాల్లో కనిపించే అపార్టుమెంట్ల సంస్కృతి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ప్రధానంగా జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారుల వెంట పట్టణాల సమీప గ్రామాల్లోనూ బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. జిల్లాలోని ఐ.పోలవరం మండలం ఎదుర్లంక నుంచి ప్రారంభమైన 216 జాతీయ రహదారి రాజోలు మీదుగా పశ్చిమగోదావరి జిల్లా వరకు విస్తరించి ఉంది. మరోవైపు అమలాపురం నుంచి రావులపాలెం వరకు ప్రధాన రహదారి ఉంది. యానాం నుంచి మండపేట ప్రధాన రహదారి చెంతన పట్టణానికి ఆనుకుని ఉన్న పంచాయతీ పరిధుల్లో ఈ భవన నిర్మాణాలు చేపడుతున్నారు. రుసుముల తగ్గింపు, నిబంధనలను తోసిరాజని నిర్మాణాలు చేపట్టినా ఎవరూ పట్టించుకోరని.. బహుళ అంతస్తులు కట్టేస్తున్నారు. అనుమతులు ఒకలా తీసుకుంటే.. నిర్మాణాలు మరొకలా చేపడుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన పంచాయతీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

గ్రామీణ ప్రాంతాల్లో..

జిల్లాలోని అమలాపురం గ్రామీణం కామనగరువు, ఈదరపల్లి, బండారులంక, జనుపల్లె, పేరూరులో ఈ తరహా భవన నిర్మాణాలు ఏడాదిగా జరుగుతున్నాయి. అంబాజీపేట, కొత్తపేట, రావులపాలెం, రాజోలుతోపాటు రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం నగర పంచాయతీకి సమీప గ్రామాల్లోనూ అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి.

నిబంధనలేం చెబుతున్నాయంటే..

బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలంటే తప్పనిసరిగా 30 అడుగుల రహదారి సౌకర్యం ఉండాలి. కొందరు క్షేత్రస్థాయిలో 20 నుంచి 25 అడుగుల వరకే పరిమితం చేస్తున్న పరిస్థితులున్నాయి. భవనం విస్తీర్ణాన్ని బట్టి చుట్టూ 1.5 నుంచి 3 మీటర్ల వరకు తప్పనిసరిగా ఖాళీ స్థలం (సెట్‌ బ్యాక్స్‌) వదలాలి. ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. పంచాయతీల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు మరో రెండు అంతస్తులకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఆపై అంతస్తులు నిర్మించాలంటే డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) నుంచి అనుమతి తెచ్చుకోవాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఎక్కువ నిర్మాణాల్లో ఆరో అంతస్తు నిర్మిస్తున్నా.. సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం..

గ్రామాల్లో నిర్మించే బహుళ అంతస్తుల భవనాలకు జీప్లస్‌ 2 వరకు పంచాయతీ స్థాయిలో అనుమతులు ఇస్తారు. ఆపై నిర్మించే వాటికి డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకోవాల్సిఉంది. అలా అనుమతులు లేనివి మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

- వి.కృష్ణకుమారి, జిల్లా పంచాయతీ అధికారి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని